Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 22 Jul 2018 23:37:33 IST

మానస చామర్తి

మానస చామర్తి

కవిత రాయటం వైపు మిమ్మల్ని నెట్టే ప్రేరణలు ఎలాంటివి?
బహుముఖీయమైన కరుణ, సౌందర్యం ఏ రూపంలో కనపడ్డా ఒడిసిపట్టాలన్న తాపత్రయం మొదటిది. దానికి జతగా, ప్రపంచం మొత్తం ఏదో రహస్య సూత్రపు ఆధారంగానే పని చేస్తుందనీ, కనుకే, ఎంత మామూలు విషయమైనా, దానిని మనలాగే అర్థం చేసుకోగల, అనుభవించగల, మనలాగే దానికి స్పందించగల మరొకరెక్కడో ఉండి తీరతారనీ, మన అక్షరాలు వాళ్ళని చేరాలనీ, చేరుతాయనీ, నా లోపల స్థిరపడ్డ నమ్మకం వ్రాయిస్తుంది. అలాగే, అక్షరాల మీద నాకున్న ప్రేమ. గారడీ చేసినట్టు ఉన్న కాసిన్ని అక్షరాలనే అటు తిప్పీ ఇటు తిప్పీ నేను పొందిన అనుభవానికి నూటికి నూరు శాతమూ దగ్గరకు వచ్చేలా తిరగరాస్తూనే ఉండటంలో దొరికే తృప్తీ, అట్లా నేనకున్నది అనుకున్నట్లు అక్షరాల్లో సాధించుకున్నాక పొందే సంతోషం- మళ్ళీ మళ్ళీ రాసేందుకు ముందుకు తోస్తుంటాయి.
 
తెలుగులో ప్రస్తుతం ఉన్న కవిత్వ విమర్శ కొత్త కవులకి ఉపయోగ పడేట్టుగానే ఉన్నదా?
ఇప్పుడు వ్రాస్తున్న కవులకు, వారి కవిత్వానికి సంబంధించిన బలమైన విమర్శ ఏదీ దొరకడం లేదనే అనిపిస్తోంది. కవిత్వ విమర్శ చేసేప్పుడు విమర్శకులు కవితని ముక్కలుగా విడగొట్టుకుని, మెరుస్తూ కనపడే వాక్యాలనెన్నుకుని అభినందిస్తూ వ్రాయడం సర్వసాధారణంగా కనపడుతోంది. కానీ, జాగ్రత్తగా చదివే పాఠకులకు, అదే కవితలో మొదలూ తుదీ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉండడమూ, వ్యక్తపరచదలచిన వస్తువుకు కవిత ఎడం జరుగుతూపోవడమూ శ్రమపడకుండానే గ్రహింపులోకి వస్తున్నాయి. కవిత్వమంటే ఆకర్షణీయమైన పదాలు నాలుగుంటే చాలన్న అపప్రథ నుండి బయటకులాగే విమర్శ ఉంటే బాగుండనిపిస్తుంది. మంచి కవితను గుర్తించి అది ఎందుకు మంచి కవిత అయిందో వివరించినట్లే, ఒక కవిత మంచి కవిత కాగలిగీ కొంత దూరంలో నిలబడ్డప్పుడు, ఆ కారణాలనూ వివరిస్తే, కొత్తగా వ్రాసే కవులకు చిన్న చిన్న పొరబాట్ల నుండి తప్పించుకునే వీలుంటుంది.
 
మీ తరం కవులు మాత్రమే ఎదుర్కొనే ఇబ్బందులు ఏవైనా ?
ఈ ఇబ్బంది నిజానికి మా తరానిది మాత్రమే కాదనీ, ఏ తరానికాతరం ఎదుర్కుంటూనే ఉంటుందనీ, తనదైన శైలిలో తనే పరిష్కరించుకుంటుందనీ నాకనిపిస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ వల్ల కానీయండి, అనివార్యమైన దూరాల వల్ల కానీయండి, మనిషిని మనిషి సమీపించే తీరు మారుతోంది. ఒక ఉద్వేగం మనసును తాకుతోన్న తీరు మారుతోంది. సాహిత్యం సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించాలన్నది ఒక ఆదర్శం కనుకా, మనిషి-మనసు-మమత ఏదో ఒకవైపు నుండి చొరబడని కవిత్వం మనకింకా అరుదే కనుక, ఈ కొత్త మార్పులను కవిత్వంలో ప్రవేశపెట్టడానికి మేమంతా కొత్త పదాలను, సమర్థవంతమైన వ్యక్తీకరణలను వెదుక్కుంటూనే ఉన్నాం. అట్లాగే బ్లాగుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ మునుపెన్నడూ మనమెరుగనంత విరివిగా కవిత్వం కనపడుతున్నప్పుడు, భాషలూ, మాండలికాలనూ కూడా మించి, మనదైన గొంతును, మనదైన విరుపును వినిపించాల్సిన అవసరం కనపడుతోంది. ఇవన్నీ కొత్త వ్యక్తీకరణలను ఆహ్వానించేవే. ఐతే, అనుభవం బలమైనదైనప్పుడు, కవిలో నిజాయితీ ఉన్నప్పుడు, వ్యక్తీకరణ దానంతటదే అవసరమైన రూపు తీసుకుంటుందన్నది, మంచి కవిత్వాన్ని చదువుతున్నప్పుడు పట్టుబడ్డ రహస్యం.
 
మానస కవిత శమన
నువ్వున్నట్టుండొక
మెరుపువై వణికినా
నే నిలువెల్లా జ్వలించి
ఒకే ఆలోచనై చలించినా
ఎంత అలజడి!
చినుకుల్లా కురిశాక
నీలోనూ,
కవిత్వమై కరిగాక
నాలోనూ..
ఆకాశమా!
తేలికపడ్డాక
ఎంత ప్రశాంతత.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.