Jul 14 2018 @ 23:58PM

పాటల రాణి ఇక లేరు!

అలనాటి ప్రముఖ సినీ నేపథ్య గాయని కె. రాణి ఇక లేరు. అక్కినేని నటించిన ప్రసిద్ధ ‘దేవదాసు’ చిత్రంలో ‘అంతా భ్రాంతియేన...’, ‘చెలియ లేదు చెలిమి లేదు...’ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలు పాడిన ఆ సీనియర్‌ గాయని శుక్రవారం రాత్రి 9:15 గంటలకు హైదరాబాద్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట తుదిశ్వాస విడిచారు. ఆమె రెండో కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న రాణి వయసు 75 ఏళ్లు. మైసూరు దగ్గర తుముకూరులో 1942లో ఆమె జన్మించారు. ఉత్తరాదికి చెందిన ఆమె కుటుంబం తండ్రి రైల్వే ఉద్యోగం రీత్యా అనేక చోట్ల తిరిగి, చివరకు కడపలో స్థిరపడింది. ఆమె అసలు పేరు ఉషారాణి. ముగ్గురు అక్కచెల్లెళ్ళలో ఒకరైన రాణి ఏడేళ్ల వయసులో గాయనిగా ప్రయాణం ప్రారంభించారు. నటి వైజయంతిమాల స్టేజీ ప్రదర్శనలో రాణి గొంతు విని సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ ఆమెతో తొలిసారిగా తమిళంలో పాడించారు. ఆ తరువాత తెలుగులోనూ పాటలు పాడారు.
 
తొమ్మిదేళ్ళప్పుడే ’దేవదాసు‘లోని విషాద గీతాలతో శ్రోతల కంటతడి పెట్టించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రవీణురాలైన ఆమె 500లకు పైగా పాటలు ఆలపించారు. ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు, సి.ఆర్‌. సుబ్బురామన్‌, టి.జి లింగప్ప, పెండ్యాల, కె.వి.మహదేవన్‌ స్వరసారథ్యంలో ఆమె ఎక్కువగా పాడారు. ఒకప్పుడు చిన్నప్పటి హీరో, హీరోయిన్లకు వచ్చే పాటలు పాడిన ఆమె ఆ తరువాత ఎన్నో హుషారైన పాటలు, యుగళగీతాలతో అలరించారు. ‘ధర్మదేవత, పెళ్ళి చేసి చూడు, సతీ అనసూయ, సతీ సావిత్రి, బాటసారి, తోడికోడళ్లు, వినాయక చవితి, భూలోక రంభ, అన్నాతమ్ముడు, బాలనాగమ్మ, దైవబలం, జయసింహ, లవకుశ’ తదితర హిట్‌ చిత్రాల్లో పాపులర్‌ పాటలు పాడారు. కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ తదితర భాషల్లోనూ రాణి పాడారు. ‘ఓ చందమామా ఇటు చూడరా మాటాడరా...’ (శభాష్‌ రాముడు), ‘కొండ మీద కొక్కిరాయి...’ (జయసింహ), ‘రామన్న రాముడు...’, ‘ఒల్లనోరి మామా నీ పిల్లను...’ (లవకుశ), హెలెన్‌ నృత్యం చేసిన ‘హొయలు గొలుపు వలపు...’ (దొంగల్లో దొర) తదితర హిట్‌ పాటలు ఆమె పాడినవాటిల్లో కొన్ని.
 
సింహళ భాష వచ్చిన ఆమె సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో శ్రీలంక జాతీయగీతాన్ని ముఖ్యగాయనిగా ఆలపించారు. ఆ పాట రికార్డులు వేల సంఖ్యలో అమ్ముడవడం విశేషం. గాయని లతా మంగేష్కర్‌ అన్నా, సంగీత దర్శకుడు నౌషాద్‌ అన్నా ఆమెకు చాలా ప్రాణం. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ సమక్షంలో ప్రదర్శన ఇచ్చిన ఘనత కూడా కె.రాణి సొంతం. సంగీతాభిమాని కె.వి.రావు సారథ్యంలో హైదరాబాద్‌లోని ఘంటసాల గానసభ వారు గతంలో ఆమెను పలుసార్లు సత్కరించి, స్వర్ణకంకణం కూడా బహూకరించారు. చార్మినార్‌ సమీపంలో ఒకప్పుడున్న సదరన్‌ మూవీటోన్‌ స్టూడియో రాణి భర్త సీతారామరెడ్డిదే. ‘సతీ అరుంధతి’, ‘నిజం చెబితే నమ్మరు’ చిత్రాలను ఆయన నిర్మించారు. రాణి మరణంతో పాత తరం గాయనీమణుల్లో మరొక తార రాలిపోయినట్లయింది.