Jul 11 2018 @ 07:10AM

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ

హైదరాబాద్: శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
 
 ఇందులో భాగంగా.. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపినట్లు తెలుస్తోంది. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తారో.. మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు.
 
 ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వాటిని నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. మరోవైపు కత్తి మహేశ్‌ను కూడా రెండు రోజుల క్రితం నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.