Jul 6 2018 @ 03:26AM

‘గౌలిగూడ’ కనుమరుగు!

 • చరిత్ర పుటల్లోకి సీబీఎస్‌ బస్టాండ్
 • నిలువునా కూలిన డోమ్‌ పైకప్పు
 • నిజాం కాలం నాటి అద్భుత కట్టడం.. నిజాం ఇంటికి దగ్గరగా ఉండాలని ఏర్పాటు
 • విమానాల హ్యాంగర్‌గా నిర్మాణం..70 ఏళ్లపాటు ఆర్టీసీ బస్టాండ్‌గా సేవలు
 • కూలుతుందని ఆర్టీసీకి ముందే తెలుసు.. ఐదు రోజుల క్రితమే ఖాళీ చేసిన సంస్థ
 • ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు
 • 1930లో మూసీ ఒడ్డున హ్యాంగర్‌ నిర్మాణం
 • పదెకరాల విస్తీర్ణంలో హ్యాంగర్‌ ప్రాంగణం
 • హ్యాంగర్‌ ఖాళీ స్థలంలోనే తొలి బస్‌ డిపో
 • 1951లో ఆర్టీసీ చేతికి హ్యాంగర్‌ నిర్వహణ
 • బయట్నుంచి హ్యాంగర్‌లోకి బస్టాండ్‌
 • 1994 వరకు రాష్ట్ర ప్రధాన బస్టాండ్‌
 • 2006 వరకు జిల్లా బస్సులకు ఆశ్రయం
 • పుష్కరకాలంగా సిటీ బస్‌స్టేషన్‌గా సేవలు
హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పాతికేళ్ల క్రితం వరకు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ మహానగరానికి వలస వచ్చిన ఆశాజీవి తొలి అడుగు పెట్టింది ఇక్కడే. నగరంతో వారి అనుబంధం మొదలయ్యేది ఈ ప్రాంగణంతోనే. డెబ్బయి ఏళ్లుగా మన ఊరికి, మహానగరానికి పేగుబంధంగా నిలిచిన గౌలిగూడ బస్టాండ్‌ గురువారం నిలువునా కూలిపోయింది. 1951 నుంచి 1994 వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ (సీబీఎస్‌)గా, గతనెల వరకు సిటీ బస్‌ స్టేషన్‌గా సేవలు అందించిన నిజాం కాలం నాటి వారసత్వ కట్టడం చరిత్ర పుటల్లో కలిసిపోయింది. గౌలిగూడ బస్టాండ్‌ పేరు వినగానే నగర పౌరుడి స్మృతిపథంలో తళుక్కున మెరిసే జిప్సం రేకుల గుమ్మటం శాశ్వతంగా కనుమరుగై పోయింది.
 
ముందే తెలుసా?
సీబీఎస్‌ డోమ్‌ పతనానికి గత నెలే రంగం సిద్ధమైంది. జూన్‌ 30 నుంచి సిటీ సర్వీసుల రాకపోకలు నిలిపేశారు. రెండు గేట్లు మూసివేశారు. డోమ్‌కు బిగించిన ఇనుప బొల్టులు తుప్పు పట్టాయని, కూలి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని గుర్తించి బస్సుల రాకపోకలను నిలిపేశామని, షాపులను ఖాళీ చేయించామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. గురువారం ఉదయం గుమ్మటం పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. లోపల ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 1930లో నిజాం కాలంలో దీన్ని విమానాల హ్యాంగర్‌గా నిర్మించారు. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్‌ భాగమయ్యాక 1951లో హ్యాంగర్‌ను ఆర్టీసీ అధీనంలోకి తీసుకుంది. 1994లో మూసీ మధ్యలో ఎంజీబీఎస్‌ నిర్మించే వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ బస్టాండ్‌గా ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సులకు గమ్యస్థానమైంది. ఆ తర్వాత కూడా 2006 వరకు జిల్లాల బస్సులు సీబీఎస్‌ డోమ్‌లోకి జిల్లాల బస్సులు వచ్చేవి. పన్నెండేళ్లుగా కేవలం సిటీ బస్‌స్టేషన్‌గా సేవలు అందిస్తోంది. రోజూ సీబీఎస్‌ నుంచి 85 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
 
హ్యాంగర్‌ నుంచి బస్టాండ్‌గా
నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1930లోనే బేగంపేటలో విమానాశ్రయాన్ని నెలకొల్పారు. తమ కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు తిరగడానికి ప్రత్యేక విమానాలు సమకూర్చారు. సొంత ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిర్వహణ, మరమ్మతుల కోసం 1930లో ప్రత్యేకంగా హ్యాంగర్‌ను నిర్మించారు. మూసీ ఒడ్డున పదెకరాల ఖాళీ స్థలంలో బ్రిటీష్‌ ఇంజనీర్ల సహకారంతో ఇంగ్లండ్‌ నుంచి జింక్‌ షీట్లు దిగుమతి చేసుకొని మిసిసిపీ హ్యాంగర్‌ నిర్మించారు. 350 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో (డోమ్‌) హ్యాంగర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నిజాం ప్యాలెస్ కు సమీపంలో విమానం అందుబాటులో ఉండేందుకు హ్యాంగర్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. 1932లో నిజాం స్టేట్‌ రైల్వే రోడ్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు.
 
 
 
హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం, మైసూరు లాంటి దూర ప్రాంతాల ప్రయాణానికి మిసిమిసీ హ్యాంగర్‌ పక్కనే 27 బస్సులతో నిజాం స్టేట్‌ తొలి బస్‌డిపో(గౌలిగూడ డిపో)ను ఏర్పాటు చేయించారు. బేగంపేట విమానాశ్రయం టెర్మినల్స్‌ నిర్మాణం పూర్తయ్యాక విమానాలను అక్కడికి శాశ్వతంగా తరలించారు. గౌలిగూడలోని మిసిసిపీ హ్యాంగర్‌ ఖాళీ అయ్యింది. హ్యాంగర్‌ ముందుభాగంలో ఉన్న గౌలిగూడ బస్‌స్టేషన్‌ను హ్యాంగర్‌ లోపలికి తరలించారు. వెనుకభాగాన్ని బస్‌ డిపో నిర్వహణ కోసం వినియోగించారు. 1958లో ఆర్టీసీ ఏపీఎ్‌సఆర్టీసీగా మారడంతో గౌలిగూడ మినిసిపీ హ్యాంగర్‌ రాష్ట్ర స్థాయి ప్రధాన బస్‌స్టేషన్‌గా అవతరించింది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సుల రద్దీ పెరగడంతో సీబీఎస్‌ పక్కనే మూసీ నదిలోని పాతిక ఎకరాల పార్కులో ఆధునిక బస్‌స్టేషన్‌ ఎంజీబీఎ్‌సను నిర్మించారు. మూసీపై గౌలిగూడ, కాలీఖబర్‌ల వైపు రెండు వంతెనలు నిర్మించి ఎంజీబీఎస్ కు రాకపోకలకు ఏర్పాటుచేశారు.
 
కూలిందా... కూల్చేశారా?
వారసత్వ కట్టడంగా పరిగణించదగ్గ సీబీఎస్‌ డోమ్‌ కూలిపోవడంపై నగర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. శిథిలావస్థకు చేరిందని అధికారులే కూల్చేశారా? దానికదే కూలిపోయిందా? అని ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్‌ పైకప్పు భాగంలో ఇనుప బోల్టులు తుప్పు పట్టాయని చెబుతున్న అధికారులు దాని పరిరక్షణకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్‌ శిథిలావస్థకు చేరిందని ముందే తెలిసినా కాపాడుకునేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతకు కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
కూలిపోతుందని తెలుసు: మంత్రి
సీబీఎస్‌ శిథిలావస్థకు చేరుకుందని, ఇది కూలిపోతుందని ముందే తెలిసి జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని రవాణా మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. గురువారం కూలిపోయిన సీబీఎస్‌ హ్యాంగర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వబోమని చెప్పారు. సీబీఎస్‌ స్థలాన్ని వాణిజ్య ఆదాయం పెంపునకు వినియోగించుకుంటామన్నారు. సీబీఎస్ లోని చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.