
- మూడు ‘టీ’లతో కళకు శాశ్వతత్వం..
- సంస్కృతికి సాంకేతికతను జోడిస్తున్నాం
- కళాకారుల గుర్తింపునకు కార్డుల జారీ
- అందుకే ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు
- ‘ఆంధ్రజ్యోతి’తో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా భాషా, సాంస్కృతిక శాఖకు అవార్డులు రావడం అరుదు. కానీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డుతోపాటు ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం వచ్చింది. అది కూడా ఇన్నోవేటివ్ విభాగంలో. ఇందుకు కారణం.. దేశంలోనే తొలిసారిగా కళాకారుల డేటాబే్‌సను తయారు చేయడమే! ఇందుకు నడుం కట్టింది ఆ శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ. స్కోచ్ పురస్కారం అందుకున్న ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఆ వివరాలు...
కల్చర్‌కి, కంప్యూటర్‌కి లింకు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
కంప్యూటర్లకు, కల్చర్‌కి లింకు కుదరదనేది సాధారణ అభిప్రాయం. కానీ, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఆ రెండింటికీ మధ్య జత కూర్చగలిగాం. ఒక యాప్, మరో సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాం. దీనికి స్కోచ్ పురస్కారం వచ్చింది. తెలంగాణలో రకరకాల కళాకారులు ఉన్నారు. వారంతా అసంఘటిత రంగంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే కళాకారులకు సంబంధించిన డేటాబే్‌సను తయారు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఇందుకు సుదూర ప్రయాణం చేశాం.
సాఫ్ట్వేర్ డెవల్‌పమెంట్‌కు ఏం చేశారు?
నేను డైరెక్టర్‌గా వచ్చిన తర్వాత అట్టడుగు కళారూపానికి చెందిన ఫలాలను అందించాలని భావించాను. అందుకే, చిందు యక్షగానంపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ పెట్టాను. 2000 మంది కళాకారులు వచ్చారు. పది జిల్లాల్లో పది కౌంటర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేశాం. మంచి కథ చెప్పగలిగే 125 బృందాలను రిజిస్ట్రేషన్ చేయించాం. దాంతో, చిందు యక్షగాన కళాకారులకు సంబంధించిన డేటాబేస్ తయారైంది. దీనిని మిగతా కళారూపాలకు విస్తరించాలని భావించాం. ఎవరికి వారు రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెబ్సైట్ తీసుకొచ్చాం. మైమ్, మిమిక్రీ నుంచి సాహిత్యం వరకూ తెలంగాణలోని కళారూపాలను ఇందులో చక్కగా వర్గీకరించాం. సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడానికి 8 నెలలు పట్టింది.
భాషా సాంస్కృతిక శాఖకు స్కోచ్ అవార్డు వచ్చింది కదా! దానికి ప్రాతిపదిక ఏమిటి?
కళాకారుల డేటాబే్‌సను తయారు చేసి, మధ్యవర్తుల జోక్యం లేకుండా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడమే దానికి ప్రాతిపదిక. దీనికి ఇన్నోవేటివ్ విభాగంగా స్కోచ్ అవార్డు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు 4200 దరఖాస్తులు వచ్చాయి. ఇన్నోవేటివ్ విభాగంలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అవార్డు వచ్చింది. కల్చర్‌ని, కంప్యూటర్ని లింకు చేయడం, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చినందుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు ఇచ్చింది.
తెలంగాణ కళను జాతీయ వేదికకు తీసుకెళ్లారని అనుకోవచ్చా?
జాతీయ వేదిక మీద తెలంగాణ కళ ఔన్నత్యాన్ని వివరించాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అది నెరవేరింది. ప్యానల్ డిస్కషన్‌కు నన్ను పిలిచినప్పుడు తెలంగాణలో సాంస్కృతిక వికాసం, సాహిత్య అభివృద్ధి, కళా వికాసంపై 16 నిమిషాలపాటు వివరించా. దానికి వాళ్లంతా చాలా ఇంప్రెస్ అయ్యారు. ‘‘ఇప్పటి వరకూ స్కోచ్లో నేను విన్న అద్భుతమైన స్పీచ్ ఇది’’ అని ముంబై ఐఐటీ ప్రొఫెసర్, ఆకాశ్ ట్యాబ్ రూపకర్త పాఠక్ కితాబునిచ్చారు.
ఎన్ని కళారూపాలు, ఎంతమంది కళాకారుల డేటాబేస్ తయారుచేశారు. ఇంకా ఎంత కాలం?
తెలంగాణలో 56 జానపద కళారూపాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 19 వేల మంది రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12 వేల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశాం. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నెలా రెండు నెలల్లో అయిపోయే ప్రక్రియ కాదు. కొత్త కళాకారులు కూడా వస్తుంటారు కనక ఇది నిరంతరం సాగుతుంది.
కళాకారులకు ఒనగూరే మేలు ఏమిటి?
మొత్తం కళాకారుల వివరాలు ఉంటే, భవిష్యత్తులో కళాకారులకు రైల్వే, బస్సు పాస్‌ల్లో రాయితీలు, బీమా, ఆరోగ్య కార్డులు వంటి సంక్షేమ పథకాల రూపకల్పనకు వీలవుతుంది. అంతరించిపోతున్న కళారూపాలను గుర్తించి, వర్క్‌షా్‌పలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.
కళారూపాలను భవిష్యత్తు తరాలకు అందించడానికి మీరు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు నేను అమలు చేసేది మూడు ‘టీ’ల విధానం. ఇందులో మొదటిది ట్రెడిషన్.. సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలనేది దీని లక్ష్యం. రెండోది ట్రెండ్... కొత్త కళారూపాలను కూడా ప్రోత్సహించడం. మూడోది టెక్నాలజీ వేదికగా జానపద, ఆధునిక కళలను ముందుకు తీసుకెళ్లడం. అంతిమంగా సాంస్కృతిక పునాదుల మీద ‘బ్రాండ్ తెలంగాణ’ను నిర్మించడమే మా లక్ష్యం.