
కాళోజీ చేత ‘అమ్మకవి’ అనిపించుకున్న సహజ కవి డొంకెన శ్రీశైలం ఇక లేరు. ‘ఊపిరి వదిలిన పేదరైతు ఉసురు/ దేశానికా? దేవునికా?’ అని ప్రశ్నించిన శ్రీశైలం గురువారం ఉదయం భువనగిరిలోని స్వగృహంలోని తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ‘అమ్మా’ (2001), ‘అమ్మనడక ఆగలేదు’ (2014) అన్నవి ఆయన కవితా సంపుటాలు. శ్రీశైలం పాఠశాలలో చదివింది తక్కువ. జీవితం నుంచి నేర్చుకున్నది ఎక్కువ. ‘శ్రీశైలంది బడిపలుకుల భాష కాదు. పలుకుబడుల భాష’ అని ‘అమ్మా’ కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ కాళోజీ అన్న మాట అక్షర సత్యం. చిన్నపిల్లలంటే ప్రాణం విడిచేవాడు! వాళ్ళతో వాళ్ళ భాషలో ముచ్చటిస్తూ తన బాల్యంలోకి వెళ్ళిపోయేవాడు. ‘పాపా! చిన్నారి పాపా!/ నాకు దూరం కాకు, నన్ను దూరం చేయకు’ అనేవాడు. స్ర్తీ ఆయన దృష్టిలో ‘ఆకాశం కంటే ఎత్తు/ సముద్రం కంటే లోతు’. అమ్మను గురించిన తాత్వికత ఆయన రెండు కవితా సంపుటాలలోను కనిపిస్తుంది. ‘శిల్పిచెక్కిన అమ్మ శిల్పం ముందు/ ఎవరెస్టైనా తల వంచుతుంది’ అన్న పంక్తులు కవిగా శ్రీశైలం ఎత్తును కూడా సూచిస్తాయి. ఇతరుల మంచి కవిత్వాన్ని సేకరించి ప్రచారం చేసిన సహృదయుడు కావటం వల్లనే ఆయ నకు ‘సేకరన్న’ అన్న పేరు వచ్చింది.
శ్రీశైలం నవ్వుల రాజు. నవ్వకుండా, నవ్వించకుండా ఏ క్షణ మూ బతుకలేదు. క్యాన్సర్తో ఆరు నెలలుగా అవస్థపడుతున్నప్పుడు కూడా ఫోన్లో జోకులు పేల్చేవాడు. ‘ఫస్టుతారీఖు నాడు/ భార్య ఎదురుచూపు, భర్త బెదురుచూపు’ అని నవ్వించినవాడు, తన వాళ్ళందరికీ దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు. ‘జయమిత్ర’ సంస్థకు పెద్ద దిక్కుగా ఉన్న శ్రీశైలంకు ఇదే నివాళి.
- అమ్మంగి వేణుగోపాల్