
నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్
తారాగణం: విశాల్, సమంత, అర్జున్, రోబో శంకర్, ఢిల్లీ గణేశ్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
కూర్పు: రూబెన్స్
కళ: ఉమేశ్ కుమార్
మాటలు: రాజేశ్ ఎ.మూర్తి
నిర్మాత: జి.హరి
దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్
పందెంకోడి, పొగరు, భరణి వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభంలో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో విశాల్. అంతే కాకుండా మాస్ ఇమేజ్ను కూడా సంపాదించుకున్నాడు. అయితే క్రమంగా విశాల్ కేవలం మాస్ సినిమాలనే కాదు.. వైవిధ్యమైన కథలు చేయడానికి రెడీ అయ్యారు. ఇంద్రుడు, పల్నాడు వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడు విశాల్ చేసిన మరో వైవిధ్యమైన చిత్రం `అభిమన్యుడు`. అందరూ డిజిటల్ ఇండియా అంటుంటే.. అందులోని మరో కోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు విశాల్, దర్శకుడు మిత్రన్ అండ్ టీం. ఈ సినిమాకు డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్‌కి వ్యతిరేకంగా ఉంది అంటూ తమిళంలో విడుదలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆటంకాలను దాటిన అభిమన్యుడు తమిళ వెర్షన్ మంచి విజయాన్ని సాధించింది. మరి తెలుగులో అభిమన్యుడు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం
కథ:
కరుణాకర్(విశాల్).. ఓ ఆర్మీ మేజర్. నిజాయతీ గల ఆఫీసర్. అన్యాయం కనపడితే ఎదురు తిరుగుతుంటాడు. కోపం ఎక్కువ .. దీని కారణంగా గొడవలు ఎక్కువ కావడంతో ఆర్మీ అతన్ని ఓ సైక్రియాటిస్ట్ దగ్గర ఆరు వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకుని వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చుననే కండిషన్ పెడుతుంది. ఉద్యోగం కోసం కరుణాకర్ సైక్రియాటిస్ట్ లతాదేవి(సమంత)ని కలుస్తాడు. తండ్రి అప్పులు చేసి దాక్కోవడం, తల్లి కుట్టు మిషన్ కుట్టి తనను చదివించడం.. తల్లి అనారోగ్యంతో చనిపోవడం వంటి కారణాలతో తండ్రి అంటే కరుణాకర్‌కి ఓ ద్వేషం ఏర్పడుతుంది. అందువల్ల ఇంటికి వెళ్లకుండా ఆర్మీలోనే ఉంటాడు. అతనికి ఓ చెల్లెలు కూడా ఉంటుంది. అయితే అనాథ అయిన లతాదేవి కుటుంబం గొప్పతనం గురించి చెప్పి నెలపాటు ఊరిలో కుటుంబ సభ్యులతో గడిపితేనే ఆర్మీకి వెళ్లేలా తాను లెటర్ ఇస్తాననడంతో ఊరికి వెళతాడు కరుణాకర్. అక్కడ వెళ్లిన తర్వాత అన్నగా.. చెల్లికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలుసుకుంటాడు. పెళ్లి కోసం పది లక్షలు ఖర్చు అవుతుంది. పొలం అమ్మి నాలుగు లక్షలు బ్యాంకులో జమచేస్తారు కరుణాకర్ తండ్రి.. ఆరు లక్షల లోన్ కోసం అన్నీ బ్యాంకుల చుట్టూ తిరిగినా లోన్ రాదు. ఓ ఏజెంట్ మాటలు నమ్మి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆరు లక్షలు లోన్ తెచ్చుకుంటాడు. అయితే బ్యాంకులోని పది లక్షల మొత్తాన్ని ఎవరో కాజేస్తారు. పోలీసుల దగ్గరకు వెళ్లినా తాను కూడా ఏజెంట్ కారణంగా ఉచ్చులో ఉండటంతో ఏం చేయలేకపోతాడు. చివరకు నెమ్మదిగా తన డబ్బును కాజేందెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో వైట్ డెవిల్(అర్జున్) దీని వెనుక ఉన్నాడని తెలుసుకున్న కరుణాకర్ ఏం చేస్తాడు? వైట్ డెవిల్ అందరినీ ఎలా మోసం చేస్తున్నాడు? కరుణాకర్.. వైట్ డెవిల్ను పట్టుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
సాంకేతిక అభివృద్ది అవసరమే.. అయితే ఈ అభివృద్ధి కారణంగా మనం ఎటు ప్రయాణిస్తున్నాం. సాధారణ పౌరుడు మోసాలకు గురవుతున్నాడు కదా! అనే విషయాలను విశదీకరంగా అభిమన్యుడు సినిమాలో చెప్పాడు దర్శకుడు మిత్రన్. మనం రోజూ చేసే విషయాల్లో ఎంత డొల్లతనం ఉందో మనకు క్లియర్‌గా చూపించాడు. ఇది చూసిన తర్వాత మన చుట్టూ ఉన్న సాంకేతిక అభివృద్ధిని చూసి భయపడాల్సి వస్తుంది. ఇలాంటి సునిశితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు దర్శకుడు. బ్యాంకుల్లో ఆర్ధిక మోసాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాన్ని కులంకుషంగా ఇందులో వివరించారు. ఇక హీరో విశాల్ చేసిన మరో వైవిధ్యమైన చిత్రమిది. విశాల్ ఎప్పటిలా తన నటనతో, ఫైట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి డిఫరెంట్ చిత్రాన్ని ఎంచుకున్నందుకు హీరోగా, నిర్మాతగా విశాల్‌ను అభినందించాల్సిందే. ఇక సమంత పాత్ర ఇందులో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్రలో సమంత నటించింది. ఇక విలన్‌గా నటించిన అర్జున్.. వైట్ డెవిల్‌గా మెప్పించాడు. ఆయన నటనతో వైట్ డెవిల్ అనే పాత్రకు ప్రాణం పోశాడు. విశాల్ తండ్రిగా నటించిన ఢిల్లీ గణేశ్ తప్ప.. సినిమాలో నటించిన వారంతా.. తమిళ నటీనటులే. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బావుంది. రూబెన్స్ ఎడిటింగ్, యువన్ సంగీతం కథను ఆడియెన్‌కు కనెక్ట్ చేయడంలో తమ వంతు ఎఫర్టనిచ్చాయి. రాజేశ్ ఎ.మూర్తి రాసిన సంభాషణలు బావున్నా... ఎఫెక్టివ్‌గా లేవు. ఇక పాటల సాహిత్యంలో లిప్ సింక్ లేదు. ఇక పాటలు వచ్చిన సిచ్యువేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ప్రపంచం టెక్నాలజీ పరంగా వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో భాగంగా డిజిటల్ ఇండియా అనే అంశంతో ఇండియా అభివృద్ధి చెందుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. బ్యాంకు, గ్యాస్, మొబైల్ కనెక్షన్ ఇలా అన్నింటికీ మన ఆధార్ కార్డ్ అవసరం అని లింక్ చేయమని అంటున్నారు. టెక్నాలజీ పెరుగుతుంది ఓకే.. కానీ దానికి మరోవైపు దాని వల్ల కలిగే అనర్థాలు కూడా ఉన్నాయి. మన వ్యక్తిగత విషయాలను మనకు తెలియకుండా మన స్మార్ట్‌ఫోన్ ద్వారా పక్కవాడికి మనమే ఇచ్చేస్తున్నాం. ఏదో అప్ డౌన్ లోడ్ చేసే సమయంలో మన ఫోన్‌ను హ్యాక్ చేసి దాని నుండి మనకు తెలియకుండా మన వివరాలను దొంగలించేస్తున్నారు హ్యాకర్లు. ఆధార్ కార్డ్ మన ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు.. అందులో మన వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వివరాలు సహా ఉంటాయి. అలాంటి బలమైన మన ఆధారం పక్కవాడి చేతికి వెళితే ఏమవుతుంది? అనే అంశాన్ని చెప్పిన చిత్రమే అభిమన్యుడు. ఈ సినిమా చూసిన తర్వాత మన ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనే అనుమానం కలుగక మానదు. చాలా వివరాలు మన ఫోన్ నుండి ఇతరులకు వెళ్లిపోతుంది. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారానే మన వీడియోలు, ఆడియో రికార్డు తీసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగే కొద్ది మనలో జాగ్రత్త కూడా పెరగాలి. ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ మన వివరాలను ఇచ్చేయకూడదు. మన సంతకాలు గుడ్డిగా పెట్టయకూడదు అనే విషయం బోధ పడుతుంది
చివరగా.. అభిమన్యుడు.. వేకప్ కాల్.. బీ అలర్ట్
రేటింగ్: 2.75/5