Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 28 May 2018 00:26:31 IST

ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం

ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం

కొన్ని దశాబ్దాల అనిర్వచనీయ బంధం మాది. నేను తనని ‘రాణి’ అని పిలుస్తాను. ‘కృష్ణా’ అన్న ప్రేమపూర్వకమైన ఆ పిలుపుకు పులకాంకితనవుతాను. వారానికొక్కసారైనా మేం మాట్లాడకుండా వుండలేము- సాహిత్యపరంగా, తాను నడుపుతున్న వృద్ధాశ్రమపరంగా, వైద్యపరంగా, ఎన్నో ఎన్నో విషయాలను చర్చించుకునేవాళ్ళం. రాణి సాహితీలోకంలో నవలా సామ్రాజ్ఞి. కోట్లాది అభిమానుల ఆరాధ్య రచయిత్రి. మమతా మమకారాలనూ, గృహిణి ధర్మాలనూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని విలువలనూ, ఆదర్శనీయ బంధాలనూ, అనుబంధాలనూ పెంచిపోషిస్తూ-- కలం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న ఆదర్శ సాహితీవేత్త. ఐనా నాకు మాత్రం ప్రియబాంధవి.
 
1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో మేమిద్దరం పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేవాళ్ళం. ‘కృష్ణక్క సలహాలు’ ద్వారా పాఠకులకు నన్ను పరిచయం చేసింది ఆ పత్రికే. మునిరత్నంగారి కుటుంబ సభ్యులు మా ఇద్దరినీ ప్రాణ సమానంగా చూసేవారు. వారి అమ్మాయి వివాహానికి మా ఇద్దరినీ ప్లైట్‌లో ప్రత్యేకంగా తీసుకువెళ్ళారు. ఐతే తిరుగు ప్రయాణంలో మా ఇద్దరికీ ట్రైన్‌లోనే బుక్‌ చెయ్యమనీ, అదీ సెకండ్‌ ఎ.సిలోనే బుక్‌ చెయ్యమనీ వారిని రాణి కోరటం జరిగింది. ‘‘ట్రైన్‌ అయితే- కొన్ని గంటలైనా కృష్ణతో సరదాగా గడిపే వీలుంటుంది. ఎన్నో విషయాలను మేము మాట్లాడుకోవాలి’’ అని. రాణీ కోరిక ప్రకారమే సెకండ్‌ క్లాస్‌లో బుక్‌ చేశారు. అలా కోరటానికి మరో కారణం కూడా వుంది. సామాన్యులతో కలిసిపోయి వారి మానసిక స్థితిగతులను అంచనా వేస్తూ, మనోభావాలను చదువుతూ ప్రేమపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ, వారిని ఉత్తేజపరుస్తూ నాతో కలిసి కొన్ని గంటలైనా ఉల్లాసంగా గడపాలని.
 
మా కంపార్ట్‌మెంట్‌లో చాలామంది లేడీస్‌ స్టూడెంట్స్‌ వున్నారు. నా ఫొటోలు తరచుగా పత్రికల్లో చూడటం వల్ల ‘‘మీరు కృష్ణక్క కదా!’’ అంటూ నన్ను చుట్టుముట్టి ప్రశ్నలవర్షం కురిపించటం మొదలుపెట్టారు. నా పక్కనే వున్న నవలా సామ్రాజ్ఞిని వారు గమనించక పోవటం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. రాణికి మటుకు ఆ దృశ్యం వినోదంగా అనిపిస్తోంది. ఇంక ఆగలేక అన్నాను- ‘‘యద్దనపూడి గురించి మీ అభిప్రాయం ఏమిటి?-’’
 
‘‘వారు మా ఆరాధ్య రచయిత్రి’’ అంటూనే నా పక్కకి చూసి అవాక్కయ్యారు, ఆవిడకి పాదాక్రాంతులయ్యారు. చెమ్మగిల్లిన మా ఇద్దరి కళ్ళు ఆర్ద్రమయాయి-- ఆర్ద్రతతో ఏకమయాయి.
 
మా అన్నయ్య అక్కినేనిగారు తన పేరు మీద ఇచ్చే బంగారు కంకణాన్ని ‘‘మొట్టమొదటిసారిగా ఎవరికిస్తే బావుంటుంది? సాహితీపరంగా-’’ అంటూ ప్రశ్నార్థకంగా నావంక చూశారు. నాకు తెలుసు ఆయన మనసులో ఎవరికివ్వాలో నిర్ణయింపబడే వుంటుంది. సెకండ్‌ ఒపీనియన్‌గా నన్నడగటం అన్నయ్యకి అలవాటు. ‘‘ఇంకెవరికి? యద్దనపూడికే ఇవ్వాలి. తనకిస్తేనే నాకిచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందిస్తాను’’ అంటూ వెంటనే రాణికి ఫోన్‌చేసి కంగ్రాట్స్‌ చెప్పాను.
 
ఆవిడ రచనల గురించి చెప్పటం చంద్రుని చల్లదనాన్ని గురించి వర్ణించటం వంటిదే, జలనిధిలోని అమూల్య సంపదను వెలకట్టే సాహసం చెయ్యటం వంటిదే. చక్కని కుటుంబ నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతనలో ప్రేమాస్పదులైన కుటుంబ సభ్యుల సాన్నిహిత్యంలో, తండ్రిగారి పరమైన సాహితీ స్ఫూర్తితో పసితనం నుంచే తన వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా, బాధ్యతాయుతంగా మలచుకున్న ధన్యజీవి.
నిర్విరామంగా, భారత భాగవత, రామాయణ గ్రంథాలు చదువుతూ, నిరంతరం, నిరాడంబరతతో, మనుష్యుల మానసిక స్థితిగతులను అంచనాలు వేస్తూ, చక్కని కౌన్సిలర్‌గా, ప్రతీవారికీ పెద్ద దిక్కుగా, తనని తానే మలచుకున్న ఆదర్శమూర్తి. ఆ కళ్ళలో ప్రేమ - ఆ చిరునవ్వులో - చక్కని పలకరింపూ ఆ మాటలలో ఆత్మీయతా ఆ చూపుల్లో సున్నితత్వం మరువలేనివి. ఎంతగా ఎదిగినా అంతగా వొదిగివుండే మాననీయ మనస్తత్వం ఆమె సొంతం.
 
ఎప్పుడూ ఏదో వ్రాయాలన్న తపన. తన రచనలు ప్రేమ తత్వానికి నిర్వచనాలుగా వుండాలన్న ఆరాటం - దృశ్య కావ్యాలుగా కూడా నిలిచిపోవాలన్న ఆకాంక్ష - ఆవిడను విశ్రాంతికి దూరం చేసేవి. పేద ప్రజలకు సేవ చెయ్యాలనీ, ఆర్తులను ఆదుకోవాలనీ, ప్రస్తుత సమాజంలో పిల్లల ప్రేమకు నోచుకోలేని వృద్ధులకోసం వృద్ధాశ్రమాన్ని స్థాపించి వారికి సేవలందించాలని పరితపించి తన కలలను సాఫల్యం చేసుకున్న సేవా మూర్తి.
ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి నాకు ఫోన్‌ చేసి తాను యద్దనపూడిని అమితంగా అభిమానిస్తాననీ, ఆవిడను చూడాలని వుందనీ చెబితే రాణితో చెప్పాను. ఆవిడ పసిపిల్లలా సంబర పడింది. కొన్ని గంటలు మాతో సరదాగా కబుర్లు చెప్పింది. వచ్చేస్తుంటే - ఎప్పుడూ లేనిది నన్ను దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. నా మనస్సు కలుక్కుమంది.
 
వృద్ధాశ్రమం కోసం వైద్యపరమైన సలహాలు ఇచ్చేదాన్ని. ‘‘నీ ఆరోగ్యం ఎలా వుంది?’’ ఆత్రంగా అడిగాను. ‘‘అది మటుకు నీకు చెప్పను. చెప్తే బాధ పడతావు. అయినా వచ్చేస్తున్నాను కదా!’’ - కానీ రాలేదు. భౌతికంగానే రాలేదు. ఐనా తాను ప్రేమించి - తనను ప్రేమించే ఆత్మబంధువులను విడిచి ఎక్కడకు వెళ్ళగలదు! ఈ జీవన తరంగాలలో - మనలో మమేకమై నా రాణి - సదా - సర్వదా - చిరంజీవిగానే వుంటుంది. ఇంతకు మించి ఏమీ వ్రాయలేక పోతున్నాను.
  • కె.వి. కృష్ణకుమారి

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.