Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 26 May 2018 12:16:06 IST

సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య ప్రోగ్రెస్ రిపోర్ట్

సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య ప్రోగ్రెస్ రిపోర్ట్

అధికారుల వెంటబడి అభివృద్ధి పనులను మంజూరు చేసుకొస్తారన్న పేరు సంపాదించుకున్న తలారి ఆదిత్య అందుబాటులో వుండే విషయంలో మాత్రం విమర్శలను దాటలేకపోతున్నారు. పార్టీపరంగా అందరినీ కలుపుకుపోవడంలోనూ విఫలమవుతున్నారు. తండ్రి చాటు బిడ్డగానే వుండిపోయాడంటూ తనపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక అపవాదులను మూటగట్టుకుంటున్నారు. సత్యవేడు నియోజకవర్గం పలు రంగాల్లో పురోగమిస్తున్నా అభివృద్ధిపై తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నారు. గడచిన నాలుగేళ్ళలో ఎమ్మెల్యేగా తలారి ఆదిత్య పనితీరుపై విశ్లేషణ....
 
ఆరోపణల మాటున కనిపించని అభివృద్ధి
యువకుడు... రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాడు... ఆపై ఉన్నత విద్యావంతుడు... వెరసి వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు... ఇవీ గత ఎన్నికలప్పుడు సత్యవేడులో తలారి ఆదిత్య గెలుపు కారకాలు! అయితే స్థానికేతరుడు... అందుబాటులో ఉండడు... తండ్రి చాటు బిడ్డ... పార్టీలో అందరినీ కలుపుకునిపోలేడు... ఇంకా పలు ఇతర ఆరోపణలు... ఇవీ నాలుగేళ్ళ పదవీ ప్రస్థానంలో ఆయన మూటగట్టుకున్న నిందారోపణలు!! ప్రత్యేక ఆర్థిక మండలి కారణంగా ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పారిశ్రామిక రంగంలో సత్యవేడు ప్రపంచపటంలో చోటు సంపాదించుకుంటోంది. దానికనుగుణంగా నియోజకవర్గం ఇతర రంగాల్లోనూ పురోగమిస్తోంది. అయితే అభివృద్ధిపై తనదైన ముద్ర వేయడంలో, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో ఎమ్మెల్యే విఫలమవుతున్నారు!!!
 
సాధించిన విజయాలు
 • సత్యవేడు ప్రభుత్వాస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచి, అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు చేయించారు.
 • రూ.20కోట్లతో కడూరు క్రాస్‌-చిన్న పాండూరు మధ్య రోడ్డు విస్తరణ చేయించారు.
 • రూ. 12 కోట్లతో చిన్నపాండూరు-పీవీపురం రోడ్డు విస్తరణ చేయించారు.
 • ప్రస్తుతం రూ.20కోట్లతో చిన్నపాండూరు-సత్యవేడురోడ్డు విస్తరణ జరుగుతోంది.
 • రూ.12 కోట్లతో పుత్తూరు-చెన్నై హైవే రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్నాయి.
 • రూ. 20 కోట్లతో పిచ్చాటూరు - శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ ముగిసింది.
 • రూ. 10 కోట్లతో సత్యవేడులోసమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు మంజూరు చేయించారు.
 • మినీ క్రికెట్‌ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయించి వినియోగంలోకి తెచ్చారు.
 • పౌరసరఫరాల గిడ్డంగి నిర్మాణం పూర్తి చేయించారు.
 • బీఎన్‌కండ్రిగలో రూ.12కోట్లతో ఏకలవ్య గిరిజన గురుకులం మంజూరు చేయించారు.
 • నారాయణవనంలో ప్రభుత్వాస్పత్రి నిర్మాణం పూర్తి చేయించారు.
 • సీసీ రోడ్లు, నీరు-చెట్టు పనులు, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో దళితవాడల్లోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
నియోజకవర్గ ప్రజల కలలను నెరవేర్చా
ఇంతకాలం జరగని అభివృద్ధిని నాలుగేళ్ళలో చేసి చూపించా. రూ.80 కోట్లతో రోడ్ల విస్తరణ, రూ. 60 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించా.సీఎం సహకారంతో హీరో, ఇసుజు, అపోలో వంటి పరిశ్రమలను నియోజకవర్గానికి తీసుకొచ్చాం. నాయకుల మద్య విభేదాలు తొలగి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం. పెండింగ్‌ పనులనూ పూర్తిచేస్తా.అరణియార్‌, కాళంగి రిజర్వాయర్ల పనులను త్వరలో మొదలుపెట్టిస్తా. స్థానికంగా జాబ్‌ మేళాలు జరిపించి బహుళ జాతి కంపెనీల్లో ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తా.
ఎమ్మెల్యే తలారి ఆదిత్య
అభివృద్ధి బాగానే వుంది!
నియోజకవర్గంలో అభివృద్ధి బాగానేవుంది. ఎన్నో ఏళ్ళ పెండింగు సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రధానంగా రోడ్లన్నీ అభివృద్ధికి నోచుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పెద్దఎత్తున నిధులు మంజూరై సత్యవేడు అభివృద్ధి ఊపందుకుంటోంది.
హేమభూషణం, సత్యవేడు
నిరుద్యోగ సమస్య తీరడంలేదు!
ప్రపంచ పారిశ్రామిక పటంలో గుర్తింపు కలిగిన శ్రీసిటీ సత్యవేడులోనే వున్నా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దొరకడంలేదు. ప్రజాప్రతినిధుల ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక్కడి యువతకు ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకోవాలి.
అభి, సత్యవేడు
పెండింగ్‌ ఫైల్‌
 • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు ఇంకా ప్రతిపాదన దశలోనే వుంది.
 • సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం ఇంకా మొదలు కాలేదు.
 • అరణియార్‌ ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 34 కోట్ల జైకా నిధులు నాలుగేళ్ళుగా మురుగుతున్నాయి.
 • కాళంగి, ఉబ్బలమడుగు ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగడంలేదు.
 • పర్యాటకులను విశేషంగా ఆకర్షించగలిగే ఆధ్యాత్మిక, భౌగోళిక విశేషాలున్నా అవిఅభివృద్ధికి, ప్రాచుర్యానికి నోచుకోవడం లేదు.
 • వరదయ్యపాళెం, దాసుకుప్పం బైపాస్‌ రోడ్డు పనులు ముందుకు సాగడంలేదు.
 • స్థానికుడు కాకున్నా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినా రెండు మూడు నెలలకు ఓసారి గానీ రావడం లేదన్న ఆరోపణలున్నాయి.
 • తిరుపతి, హైదరాబాద్‌ మధ్య రాకపోకలతో ప్రజలకే కాదు పార్టీ కేడర్‌కు కూడా అందుబాటులో వుండడం లేదన్న విమర్శలున్నాయి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.