May 20 2018 @ 23:23PM

వర్షించే మేఘం పెద్దిభొట్ల

పాఠక ప్రపంచంపై కరుణాత్మకమైన కథలెన్నో వెదజల్లిన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కలం శాశ్వతంగా విశ్రమించింది. ఆయన సన్నిహితుల ఆత్మీయ స్మరణలివి.
 
సమాజపు చీకటి కోణాల్లో నీడల్లా నీరసపడే వ్యక్తులపైన్నే ఆయన దృష్టి ప్రసరిస్తూ వుండేది.
 
పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు వెన్నెముకలో వచ్చిన యిబ్బందితో నడవలేక గత ఆరేడేళ్ళుగా యింటికే పరిమితమైపోయారు. ఆ కాలంలో రెండుమూడు ఆపరేషన్లు గూడా చేయించుకున్నారు. గత వారంలో మూడు రోజుల పాటూ ఆస్పత్రిలో వెంటిలేటర్ల పైనే వున్నారు. విషాదమంటే యేమిటో బాగా తెలిసిన ఆయన యిలా తన నిర్గమనానికి మనల్నంతా ముందు నుంచే మానసికంగా సన్నద్ధం చేసినట్టే వున్నారు. కానీ భీష్ముడిలాంటి వ్యక్తొకడు అంపశయ్యపైనే అయినా జీవించివున్నాడనే భరోసా యెంత బలాన్నిస్తుందో ఆ వ్యక్తి వెళ్ళిపోయాక గానీ అర్థమవదు.
 
సాహిత్యమే జీవన విధానంగా తయారైన కుటుంబంలో పుట్టడం వల్ల నాకు దొరికిన మహత్తరమైన అనుభవాల్లో పెద్దిభొట్ల గారి వంటి సాహితీ స్రష్టలతో కలిగిన వ్యక్తిగతమైన పరిచయాలు చాలా ముఖ్యమైనవి. చిన్నప్పటి నుంచీ పెద్దిభొట్లగారి రచనల్ని చదువుతూనే వున్నా ఆయనను కలవడం మాత్రం 1996లోనే సాధ్యమైంది. వ్యక్తిగా ఆయన నిష్కాపట్యాన్ని గురించీ, నిర్మొహమాటాన్ని గురించీ వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు చెప్పిన మాటల్ని విని, అప్పటికే ఆయనంటే నాకు కొంచె భయం గూడా కలిగింది. 1996 జనవరి నెలలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌ వాళ్లు మధురాంతరం రాజారాంగారికి ప్రతిభామూర్తి పురస్కారమిచ్చినప్పుడు జరిగిన సదస్సులో ఆయన్ను మొదటిసారిగా చూసాను.
 
పొడవుగా, పొడవుకు తగినంత పుష్టిగా, మెలితిప్పిన మీసాలతో పెద్దిభొట్ల వారప్పుడు గొప్ప కథాయోధునిలాగే వున్నారు. గొప్ప కరుణరసాత్మకమైన కథల్ని రాసిన పెద్దిభొట్ల వారా సభలో మానాన్నగారి కథ ‘కమ్మతెమ్మెర’ను గురించి పదినిముషాల పాటూ ప్రసంగించి నాకెంతో విస్మయాన్ని కలిగించేశారు. ‘కమ్మ తెమ్మెర’ అనే కథ వొక యువకుడి వివాహ సందర్భంలో జరిగిన వొక మరువరాని మధురానుభూతిని గురించిన కథ. అందులో విషాదలేసమైనా లేదు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం కోసం ఆయనేమైనా అలాంటి పనిచేసాడేమోనని గూడా నేనప్పుడనుకున్నాను. అయితే ఆయనతో పరిచయం పెరిగాక, క్రమంగా ఆయనకు నిజంగానే ఆ కథంటే ప్రాణమనీ, అది పూర్తిగా ఆయనకు నోటికొచ్చుననీ తెలిసింది. ఆ తరువాత మానవజీవన మాధుర్యాన్ని గుర్తించినవాళ్ళకే దానిలోని విషాదమూ కనబడుతుందని అర్థమయ్యింది.
 
పెద్దిభొట్లగారొక జ్ఞాపకాల పుట్ట. ఆయన మాట్లాడడం మొదలుపెడితే అయిదారు దశాబ్దాల జీవితమంతా పరిచయమైపోతుంది. వాళ్ల నాన్నగారు స్టేషను మాస్టరుగా పనిచేసిన లంకలకోడేరు, స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో నెల్లూరు విస్సావారి పార్కులో జరిగిన వుత్సవాలూ, కొద్ది రోజులు బెజవాడలో, మరికొన్నాళ్లు ఒంగోలులో జరిగిన వున్నత పాఠశాల విద్యా, ఒంగోలులో కొత్తగా పెట్టిన జూనియర్‌ కాలేజీలో ధారా రామనాథ శాస్త్రి, కె.వి. రమణారెడ్డి గార్ల దగ్గర చదువుకోవడం, బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణగారి యింట్లోనే వుంటూ డిగ్రీ చదువుకోవడం, విశ్వనాథవారి మాట ప్రకారం బెజవాడ లయోలా కాలేజీలో అధ్యాపకుడిగా వుద్యోగం రావడం- యీ విషయాలనంతా ఆయన పరవశంగా, అదోరకమైన చిత్రమైన వుద్వేగంతో చెబుతూనే వుండేవారు.
 
2009లో కథావార్షిక ఆవిష్కరణ సభలో పాల్గొనడం కోసం నెల్లూరుకొచ్చినప్పుడు అక్కడి మునిసిపల్‌ స్కూలునూ, విస్సావారి పార్కునూ వెదికి చూసి వచ్చాక, అక్కడుండి మాయమైపోయిన బాదం చెట్లూ, సీమచింత చెట్లూ, ఖాళీస్థలాలూ గుర్తుకు తెచ్చుకుని డబ్బుల వల్ల వచ్చే ఐశ్వర్యం రొద తప్ప మరేమీ కనిపించడం లేదని వాపోయారు.
పెద్దిభొట్లగారికి బెజవాడ లయోలా కాలేజీ అంటే ప్రాణం. అక్కడి క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం, మంచి అధ్యాపకుల్ని ప్రోత్సహించే నిర్వాహకులు ఆయనకో మూడు దశాబ్దాల పాటూ గొప్ప ఆలంబనగా వుండి, ఆ గొప్ప సృజనాత్మక దశలో స్వేచ్ఛగా రాసుకోవడానికి కావల్సిన భూమికను అందించారని ఆయన ప్రగాఢంగా నమ్ముతారు. తాను తొలిరోజుల్లో రాసిన కథల్ని చూసి విశ్వనాథవారు ‘‘నువ్వు గద్యం రాయడమే బావుంది’’ అని ప్రోత్సహించారట! విశ్వనాథవారి సంప్రదాయ పాదుల్లోంచీ ప్రారంభమై, అభ్యుదయ రచయితల సంఘం ముఖ్య సభ్యుడిగా యెదగడం, చివరివరకూ విశ్వనాథ పైన అదే భక్తి కలిగి వుండడం, తన రచనల్లో మాత్రం వామపక్ష ధోరణినే యింకించుకోవడం ఆయనలో వుండే వైచిత్రి.
 
వ్యక్తిగతమైన ఆస్తిని పట్టించుకోని నిజమైన మార్క్సిస్టు పెద్దిభొట్లగారు. బెజవాడలో చాలా అద్దెయిండ్లు మారి వూరినంతా తనదిగానే భావించినవాడాయన. ఆ వూరిని ‘విజయవాడ’ అని పిలవడమంటే ఆయనకు కోపం. అది దుష్టసమాసమని నిరసించేవారు. పది సంవత్సరాల క్రితం విజయవాడ శివార్లలో తాడేపల్లి దగ్గరో చిన్న యింట్లో నివాసమున్నప్పుడు మిత్రుడు డాక్టరు వి. చంద్రశేఖరరావుతో కలిసి ఆయనను కలవడం బాగా గుర్తుంది. అప్పుడాయన మరణానంతరం తన శరీరాన్ని యేదైనా ఆస్పత్రికివ్వాలని పట్టుదలతో తిరుగుతున్నారు. తన కుమార్తె, బంధువులూ వారించినా వినడం లేదు. తన శరీరాన్ని తీసుకుంటామని ఆస్పత్రి నిర్వాహకులు రిజిష్టరు వుత్తరం యిచ్చేవరకూ అదొక తపస్సులాగా తిరిగాడాయన. అందుకు అడ్డుపడే ప్రభుత్వం విధానాలనూ, ఆస్పత్రి నియమాలనూ ఆయన తీవ్రంగా విమర్శించేవారు.
 
2013లో తనకు అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్‌ వాళ్ళు ప్రతిభామూర్తి పురస్కారమూ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాక ఆయన తన పేరుతో ‘పెద్దిభొట్ల సాహిత్య పురస్కారం’ను స్థాపించాలనుకున్నారు. అప్పటికీ, చివరివరకూ ఆయనకున్నది కేవలం పెన్షను మాత్రమే! అనారోగ్యం వచ్చినప్పుడల్లా ఆస్పత్రి ఖర్చులూ, ఆపరేషను ఖర్చులూ చాలా యెక్కువగానే వుంటున్నాయి. అటువంటి సమయంలో పురస్కారాల పేరుతో ఖర్చుపెట్టడమెందుకని ఆత్మీయులు కొందరు వారించారు. అయితే ఆయన పట్టినపట్టు విడిచే వ్యక్తి కాడు. ఆ సభలకు శ్రీశ్రీవిశ్వేశ్వరరావు, ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేలూరి కౌండిన్య వంటి మిత్రులు సహాయ సహకారాలందిస్తున్నా, తానే పురస్కార గ్రహీతలకూ, అతిథులకూ ఫోన్లపైన ఫోన్లు చేసేవాడు. డిసెంబరు 15న ఆయన పుట్టిన రోజున పురస్కార సభ జరిగేది. ఆ రోజు వుదయాన్నే యింటికెళ్తే కొత్త బట్టల్తో, మెడలో బంగారు గొలుసుతో, చేతికొక బంగారు బ్రేస్‌లెట్టుతో కొత్త పెండ్లికొడుకులా, పిల్ల జమీందారులా వెలుగుతూ కనిపించేవాడు.
 
‘అమ్మ’ నవలలో గోర్కీ వొక చోట ‘‘డబ్బంత పనికిరానిది మరొకటి లేదు. దాన్ని తీసుకోవడమూ, యివ్వడమూ రెండూ దుర్భరమే!’’ అంటాడు. డబ్బుకుండే యీ పరిమితిని తెలుసుకున్నవాళ్ళు మాత్రమే పెద్దిభొట్లగారిలా వుండగలరు. డబ్బును ప్రోగు చేసుకోవడానికీ సంపన్నంగా జీవించడానికీ చాలా తేడా వుందని నిరూ పించిన ధనవంతుడు పెద్దిభొట్ల. మూడేళ్ళక్రితమోసారి మాట్లాడుతూ, యీ సంవత్సరం నుంచీ కథకుడికీ, కథా రచయిత్రికీ రెండు పురస్కారాలుంటాయని చెప్పాడాయన. అదనపు బరువు బాధ్యతలెందుకన్నా వినిపించుకోలేదు.
 
తెలుగు భాషలో వున్నంతమంది గొప్ప కథా స్రష్టలు మరే యితర భాషలోనూ నాకు కనిపించలేదు. వాళ్ళందరివీ భిన్నమైన అత్యంత వైయక్తికమైన ధోరణులు. నాటక సాహిత్యంలో భవభూతి యెంతటివాడో, కథా సాహిత్యంలో పెద్దిభొట్ల అంతటివాడు. క్రింది మధ్యతరగతి, అధోజగత్తుల్లోని దీనులు, హీనులు, బాధితులు, ఆయన పాత్రలు. సమాజపు చీకటి కోణాల్లో నీడల్లా నీరసపడే వ్యక్తులపైన్నే ఆయన దృష్టి ప్రసరిస్తూ వుండేది. కృష్ణానదిలో వొక్కసారిగా అన్ని నీళ్లు చూసి వున్మత్తుడైపోయే పల్నాటి యువకుడూ, మురికి మేడలో యిరుకు గదిలో కావాల్సినంత గాలిని కూడా పొందలేని అభాగ్యుడూ, రైలుపెట్టెల్లో చెత్తలు చిమ్మి పొట్టపోసుకునే అనాధలూ, దహనసంస్కారాలు చేసి పొట్టపోసుకునే బీద బ్రాహ్మణులూ- యిలా ఆయన కథానికా ప్రపంచం నిండా పీడితులూ తాడితులూ వుండేవారు.
 
లేత చివురాకులా పెద్దిభొట్లగారి మనస్సెప్పుడూ ప్రతి చిన్నగాలికీ పెద్దగా వూగిపోతూ వుండేది. బెజవాడలో యిటీవలి కాలంలో వస్తున్న మార్పులూ, పెరుగుతున్న అద్దెలూ, నిత్యజీవితావసరాల కోసం జరుగుతున్న పోరాటం.. యివన్నీ ఆయనను వేధిస్తూ వుండేవి. ఆయనవి తిరిగే కాలూ, రాసే చేయీ. అవి రెండూ మొరాయించడంతో ఆయన పెద్దగా ఆవేదన పడేవాడు. రాయాలనుకుని రాయలేకపోతున్న కథల్ని తలుచుకునేవాడు. గత అయిదారేళ్ళుగా వారం పదిరోజులకోసారి ఆయన దగ్గరినుంచీ ఫోనొచ్చేది. ‘‘హలో! యెలా వున్నారు? నేనూ బాగానే వున్నాన్లెండి! యీ కాలు కదలనివ్వడం లేదు. యేమీ రాయలేను’’ అంటూ మొదలుపెట్టి సమాజపు గొడవలన్నీ యేకరువుబెట్టి, అవన్నీ స్వంత బాధలే అయినట్టుగా విలవిలలాడిపోయేవాడు.యికపైన పెద్దిభొట్ల గారి నుంచీ ఫోను రాదని అనుకోవడానికే ఆందోళనగా వుంది.
 
పెద్దిభొట్లగారి ప్రసిద్ధ కథ ‘ఇంగువ’లో కథకుడి మిత్రుడొకరు చాలా సంవత్సరాలుగా ఇంగువ అంటే యేమిటి? అది వేరా? జిగురా? రసాయనిక పదార్థమా? అని తెలుసుకోవాలనుకుంటాడు. మరణశయ్యపైన వున్నప్పుడు కూడా కథకుడ్ని ఆ ప్రశ్నే అడుగుతాడు. అప్పుడా కథకుడు అదే పనిగా వెళ్ళి ‘ఇంగువ’ అంటే యేమిటో తెలుసుకుని వస్తాడు. అయితే అప్పటికే ఆ మిత్రుడు చనిపోయి వుంటాడు. పెద్దిభొట్లగారు గూడా యింకా తాను చెప్పవలసిన విషయాల్ని చాలా చెప్పకుండా వెళ్ళిపోయిన కథకుడి గానే కనిపిస్తున్నారిప్పుడు.
 మధురాంతకం నరేంద్ర
98662 43659