Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 19 May 2018 02:16:29 IST

ప్రముఖ రచయిత పెద్దిభొట్ల కన్నుమూత

ప్రముఖ రచయిత పెద్దిభొట్ల కన్నుమూత

  • మధ్యతరగతి జీవనపోరాటమే ఆయన కథ
  •  2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  •  భౌతికకాయం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి అప్పగింత
  •  సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
విజయవాడ (కల్చరల్‌), మే 18: సమకాలీన కథా రచయితలలో పేరెన్నికగన్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పది రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నగరంలోని ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస అందకపోవడంతో వెంటిలేటర్‌పైనే ఉంచారు. శుక్రవారం మ ధ్యాహ్నం 2.30 గంటలకు కన్ను మూశారు. ఆయన భౌతికకాయాన్ని చుట్టుగుంటలోని విశాలాంధ్ర కార్యాలయానికి తరలించారు. పలువురు రచయితలు, సాహి తీ సంస్థల ప్రతినిథులు ఆయనకు నివాళులర్పించారు. ఐదేళ్ల క్రితమే తన మరణానంతరం భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి పెద్దిభొట్ల రాసివ్వడంతో శుక్రవారం రాత్రి 8 గంటల తరువాత ఎన్‌ఆర్‌ఐ కాలేజీకి అప్పగించారు. ఆయన మరణంతో తెలుగు సాహితీలోకం గొ ప్ప రచయితను కోల్పోయింది. 1938 డిసెంబర్‌ 15న గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య 79 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయనకు భార్య గీతారాణి, దత్తపుత్రిక అరుణమణి ఉన్నారు. పెద్దిభొట్ల కళాశాల విద్యను విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో పూర్తి చేశారు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వద్ద చదువుకున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీలో అధ్యాపకునిగా 40 సంవత్సరాలు పని చేసి డిసెంబర్‌ 1996లో పదవీ విరమణ చేశారు. 1959లో రచనలను మొదలుపెట్టిన సుబ్బరామయ్య రచనలన్నీ పేద, మధ్య తరగతి కుటంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఈయన 200లకుపైగా కథలు, నవలలు రాశారు. ప్రాఽథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మకం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును 2012లో అందుకున్నారు. ఆయన కథలన్నీ రెండు సంపుటాలు ‘‘పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు’’ గా వచ్చాయి. మొదటి సంపుటికి ‘కథల సంకలన విభాగం’లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వరించింది. మృత్యువు తరచుగా కనిపిస్తున్న వేళ... మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు, ప్రవర్తించని సహజ ఘటనలూ నిండి ఉండే ఆయన కథలు పాఠకుడిని వెంటాడుతూంటాయి. అక్షరాల వెంట ఆసాంతం పరిగెట్టేలా సాగే కథారచనా శైలి ఆయన స్వంతం. మధ్య తరగతికి చెందిన పెద్దిభొట్ల అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలింపజేసిన అ భ్యుదయ రచయిత. గుంటూరు, విజయవాడ మధ్య తిరిగే ఆయన కథల్లో స్వాతంత్ర్యానంతర భారతదేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. భూస్వామ్య, పెట్టుబడి దారీ విలువల మధ్య చిక్కుకున్న మధ్య తరగతి ఆయన కథల్లో దర్శనమిస్తుంది. మానవ సంబంధాలను నియంత్రించే ఆర్థికాంశం ఆయన రచనలన్నింటిలోనూ స్వస్వరూపంతో కనిపిస్తుంది.
 
తెలుగువారికి గర్వకారణం: సీఎం
ప్రఖ్యాత కథా రచయిత పెద్దిభొట్ల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. 40 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పని చేస్తూనే సాహితీ రంగంలో తనదైన ముద్రతో శిఖరాగ్రస్ధాయికి ఎదిగారని, తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొంది తెలుగువారికి గర్వ కారణంగా నిలిచారని సిఎం కొనియాడారు. 200లకుపైగా కథలు రాసిన పెద్దిభొట్ల మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.
 
‘బడుగు కథ’కుడు పెద్దిభొట్ల లేనిలోటు తీరనిది
పెద్దిభొట్ల సుబ్బరామయ్య భౌతికకాయానికి నివాళులర్పించటానికి వచ్చిన పలువురు రచయితలు తమ అభిప్రాయాలను, ఆయనతో ఉన్న అవినాభావ సంబంధాన్ని పంచుకున్నారు. సీనియర్‌ పాత్రికేయుడు సీ రాఘవాచారి మాట్లాడుతూ, ‘‘మధ్య తరగతి జీవితాలను దగ్గరగా చిత్రీకరించిన తెలుగు కథకుల్లో పెద్దిబొట్ల ఒకరు. సులభమైన భాష, సున్నితమైన భావప్రకటన, అనంతమైన అర్ధంతో కూడిన వ్యాక్యనిర్మాణం ఆయన కథల్లోని సాహితీరత్నాలు. తోటి రచయితలను ఆదరించటం, సత్కరించటం ఆయన వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం.’’ అన్నారు. పెద్దిభొట్లతో 50ఏళ్లకుపైగా సాన్నిహిత్యం ఉన్న ప్రముఖ రచయి త భమిడిపాటి జగన్నాఽఽథరావు మాట్లాడుతూ, ‘‘ఆయన సాహిత్యమంతా బ డుగులు, బలహీన వర్గాలు, స్టేషన్‌లో అడుక్కునే పిల్లల జీవితాల చుట్టూ తిరిగింది. ఏ రచయితా పట్టించుకోని, జోలికి వెళ్లనటువంటి వారిని దగ్గరగా చూసి రాసిన కథలు గొప్పగా ఉంటాయి. దళిత బ్రాహ్మణుల మీద కూడా చాలా మంచి కథలు రాశారు. 1965 నుంచి ఆయన నాకు బాగా తెలుసు. రచయితలమంతా కలసి వేసిన నాటకంలో రాదు రాదంటున్నా బలవంతంగా ‘జర్నలిస్ట్‌’ పాత్ర వేయించాను. ఆయన మంచి మాటకారి, స్నేహశీలి. మంచి రచయితను సాహితీలోకం కోల్పోయింది’’ అని అన్నారు. జనసాహితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి అరుణ మాట్లాడుతూ, ‘‘మధ్య తరగతి జీవన సంఘర్షణలు ఆయన రచనల్లో ప్రతిబింబిస్తాయి. హిందూ మతం పేరిట ఉన్మాదులు, లౌకిక వాదులను హతమార్చే విధానాలకు నిరసనగా, కేంద్ర పాలకుల అసహన రాజకీయాలను ఖండిస్తూ 2015లో సాహిత్య అకాడమి అవార్డు గ్రహీతలతో కలసి ప్రకటన విడుదల చేయటంలో పెద్దిభొట్ల చాలా చొరవ ప్రదర్శించారు’’ అని అన్నారు.
 
కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్‌ మాట్లాడుతూ, ‘‘తెలుగు కథకు పెద్ద దిక్కు పెద్దిభొట్ల. 1978లో ఆయన అధ్యక్షుడిగా చైతన్య భారతి అనే సాహితీ సంస్థ పని చేసేది. గుమ్మడి దినకరరావు, ఎం.ఆర్‌.ఎ్‌స.ప్రకాసరావు తదితరులు ఉండేవారు. నండూరి రామమోహనరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సంపాదకత్వంలో ‘మహా సంకల్పం’ కవితా సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. అరసంలో చాలాకాలం పనిచేసిన ఆయనకు కృష్ణాజిల్లా రచయితల సంఘతో అవినాభావ సంబంధముంది’’ అని అన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.