May 16 2018 @ 02:43AM

ఆరోగ్యానికి పొయ్యి సెగ!

  •  వంటింటి పొగతో ఏటా 40 లక్షల మరణాలు
  •  గాలి కాలుష్యంతో ఏటా 70 లక్షల మంది మృతి
  •  ప్రతి 10మందిలో 9 మందికి కలుషిత గాలితో ఇబ్బందులు
  •  వాతావరణ కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు
మీరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారా? అన్నం, పప్పు, కూరల కోసం బొగ్గులు, పిడకల కుంపటినే నమ్ముకుంటున్నారా? లేదంటే కిరోసిన్‌ స్టౌతో నెట్టుకొస్తున్నారా? అయితే మీరు చేజేతులా ఆరోగ్యానికి ‘పొగ’ బెట్టుకుంటున్నట్టే! కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటిపై వంట చేస్తున్నవారిలో గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలమంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, దాని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాను డబ్ల్యూహెచ్‌వో ఆదివారం వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. ఏటా 70 లక్షల మంది వాయు కాలుష్యంతో మరణిస్తున్నారు. వీటిలో 40 లక్షల మరణాలు వంటింట్లో వెలువడే పొగవల్లేనే సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది కట్టెలు, పిడకలు, కిరోసిన్‌, బొగ్గులపై ఆధారపడి వంట చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే వంటింటి పొగతో దాదాపు 20 లక్షల మంది చిన్నారులు నిమోనియాకు గురై మరణిస్తున్నారు. వాయుకాలుష్యం కారణంగా ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాల్లో ఏటా 20 లక్షల మంది చొప్పున మరణిస్తున్నారు. ఆఫ్రికాలో 10 లక్షల మంది, యూర్‌పలో 5 లక్షల మంది, తూర్పుమధ్యదరా ప్రాంతంలో 5 లక్షల మంది మరణిస్తున్నారు. ఏటా వంటింటి పొగ, బయట వాతావరణ కాలుష్యంతో సంభవిస్తున్న మరణాల్లో 21 శాతం నిమోనియా మరణాలే ఉన్నాయి. అలాగే 20 శాతం గుండెపోటు, 34శాతం గుండె సంబంధిత జబ్బులతో మరణాలు సంభవిస్తున్నాయి. 7శాతం ఊపిరితిత్తుల కేన్సర్‌ మరణాలు నమోదవుతున్నాయి.