Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 02 May 2018 10:11:41 IST

సహ్యాద్రి పరవళ్లు ఒడిసి పట్టారు!

సహ్యాద్రి పరవళ్లు ఒడిసి పట్టారు!

  • నిండుకుండలా కాకతీయ గొలుసు కట్టు చెరువులు
  • ముమ్మరంగా సాగుతున్న ఆధునికీకరణ పనులు

నిర్మల్‌: కాకతీయ సామ్రాజ్య పాలకులు బహుళార్తక ప్రయోజనాల కోసం నిర్మించిన గొలుసు కట్టు చెరువులు నిర్మల్‌ ప్రాంతాన్ని ఇప్పటికే సస్యశ్యామలంగా ఉంచుతున్నాయి. సహ్యాద్రి పర్వతాల మధ్యలో ఉన్న నిర్మల్‌ను జలకళతో ఉంచేందుకు అప్పట్లో చుట్టూరా గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. వర్షకాలంలో సహ్యాద్రి పర్వతాల నుంచి ప్రవహించే వరద నీటిని ఒడిసి పట్టి ఆ నీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలన్న ధ్యేయంతో ఈ చెరువులను అప్పటి పాలకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని కోసం 12 గొలు సు కట్టు చెరువులను నిర్మించి ఈ చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరించారు. అలాగే శత్రు సైన్యాన్ని ఎదురించేందుకు ఈ చెరువుల పక్కన కందకాలు నిర్మించారు. కాగా, చెరువు నీరును సాగుకే కాకుండా తాగునీటికి అలాగే భూగర్భ జలాల పెంపుకు తోడ్పడే విధంగా డిజైన్‌ చేశారు. అలాంటి గొలుసు కట్టు చెరువులు కొంత మేరకు ఆక్రమణలకు గురి కాకుండా అలాగే ఈ చెరువుల కింద ఆయకట్టు తగ్గిపోవడంతో ఇవి పూర్వ వైభ వం కోల్పోతున్నాయి. ఇలాంటి క్రమంలో నిర్మల్‌ ఇరిగేషన్‌ అధికారులు గొలుసు కట్టు చెరువుకు పూర్వ వైభవం రక్షించేందుకే కాకుండా పెద్ద ఎత్తున ఆధునికీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
 
డ్యాంగాపూర్‌ అడవుల నుంచే ప్రస్థానం..
నిర్మల్‌ మండలం డ్యాంగాపూర్‌ అడవుల్లో మొదలై కండి కాలువ అక్కడి నుంచి అడవుల గుండా బంగల్‌పేట్‌ వరకు సాగుతుంది. సహ్యాద్రి పర్వతాల నుంచి ప్రవహించే నీరంతా డ్యాంగాపూర్‌ చెరువులోకి అక్కడి నుంచి కండి కాలువ ద్వారా ప్రవహిస్తుంది. వర్షకాలమంతా కండి కాలువ ప్రవాహం ఉధృతంగా ఉంటుంది.
 
బహుళార్థక ప్రయోజనాలు..
గొలుసు కట్టు చెరువులను అప్పట్లో బహుళ ప్రయోజనాల కోసం రూపొందించారు. అయితే చెరువుల కింద ఆయకట్టు ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి చేరుకుంది. రియల్‌ వ్యాపారం పెరగడంతో పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోయాయి. నిర్మల్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న ధర్మాసాగర్‌ చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.
 
ముమ్మరంగా ఆధునికీకరణ పనులు..
కండి కాలువ మరమ్మతులతో పాటు 12 గొలుసు కట్టు చెరువుల ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడో విడత మిషన్‌ కాకతీయ పథకం కింద విశ్వనాథ్‌పేట్‌ చెరువు మరమతు పనుల కోసం రూ. 41.08 లక్షలు మంజూరు కాగా ఖజాన్‌ చెరువు మరమతుల కోసం 15.09 లక్షల నిధులు మంజూరయ్యాయి. అలాగే సీతాసాగర్‌ చెరువు మరమ్మతుల కోసం రూ. 19.08 లక్షల నిధులు మంజూరయ్యాయి. కండి కాలువ ఆధునీకరణ పనుల కోసం రూ. 52. 67లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తు తం ఈ గొలుసు కట్టు చెరువుల మరమ్మతు పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే నాలుగో విడత మిషన్‌ కాకతీయ పథకం కింద సోఫీనగర్‌ సమీపంలోని ఇబ్రహీం సాగర్‌ (కొత్త చెరువు) మరమ్మతు పనుల కోసం రూ.29.06 లక్షలు మంజూరు కాగా ప్రస్తుతం ఈ చెరువు పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. అలాగే కంచరోని చెరువు మరమ త్తు పనుల కోసం రూ. 11.10లక్షలు, గాజులపేట్‌ సమీపంలోని మంగళమూర్తి చెరువు మరమ్మతుల కోసం రూ.50.02 లక్షల నిధులు మంజూరయ్యాయి. అలాగే జంగల్‌ కుంట చెరువు మరమ్మతు పనుల కోసం రూ.53.07 లక్షల నిధులు మంజూరయ్యాయి. నిర్మల్‌ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ధర్మసాగర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
కొనసాగుతున్న చెరువుల మరమ్మతులు: వేణుగోపాల్‌, డీఈ, నిర్మల్‌, ఇరిగేషన్‌ శాఖ
నిర్మల్‌ పట్టణానికి ఆనుకొని కాకతీయు ల కాలంలో నిర్మించిన గొలుసు కట్టు చెరువులను ఆధునీకరించేందుకు మిషన్‌ కాకతీయ పథకం కింద నిధులు మంజూ రు చేశాం. ముఖ్యంగా సహ్యాద్రి పర్వతాలుగా పిలవబడే మహబూబ్‌ఘాట్‌ నుం చి వచ్చే వరద నీటిని కండికాలువ ద్వారా నిర్మల్‌ పట్టణంలోని గొలుసు కట్టు చెరువుల్లో నీటిని నింపడం జరిగింది. విశ్వనాథ్‌పేట్‌ ఖజాన్‌ చెరువు, సీతాసాగర్‌ చెరువు మరమ్మతు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.