desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 29 2018 @ 23:25PM

సోయగాల సిరి చిత్తూరు

ఆధ్యాత్మిక ధామాలతోపాటు రమణీయ పర్యాటక ప్రదేశాలకు, ప్రకృతి సౌందర్యానికి నెలవు చిత్తూరు జిల్లా. ఇక్కడ అనేక విజ్ఞానదాయకమైన, వినోదభరితమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, చారిత్రక కేంద్రాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
 
ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్‌
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వద్ద ఉన్న హిల్‌ స్టేషన్‌ హార్సిలీ హిల్స్‌. సముద్ర మట్టానికి 265 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, కొండదారిలో ఇరువైపులా నీలగిరి వృక్షాలు, సంపెంగ తోటలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. దట్టమైన పొగ మంచు, సేదతీర్చే చల్లగాలి, పచ్చని అడవులు, ఔషధ గుణాలు కలిగిన చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా వేసవిలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా ఇది ఖ్యాతి పొందింది. సుప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషీ వ్యాలీ స్కూల్‌ ఇక్కడే ఉంది.
 
 
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 140కిలోమీటర్ల దూరంలో హార్సిలీ హిల్స్‌ ఉంది. బస్సు, రైలు మార్గాల్లో మదనపల్లె రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. పలు ప్రైవేట్‌ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
వసతి: ఏపీ టూరిజం శాఖ నిర్వహణలోని చిన్న కాటేజీలు, పెద్ద కాటేజీలతో పాటు కొన్ని ప్రైవేట్‌ కాటేజీలు కూడా ఉన్నాయి. గదులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు.
 
 
 
జీవ వైవిధ్యానికి నెలవు శేషాచలం
చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు జీవ వైవిధ్యానికి పెట్టని కోటగా నిలుస్తున్నాయి. ఎన్నో అరుదైన జాతుల మొక్కలు ఈ కొండల్లో ఉన్నాయి. సుమారు 170 రకాల పక్షి జాతులను ఈ ప్రాంతంలో గుర్తించారు. ‘క్రయ్సోపిలియ టాప్రోబానిక’ అనే పిలిచే ఎగిరే పామును శేషాచలం జీవావరణ ప్రాంతంలో కనుగొన్నారు. ఇక్కడ సుమారు 5 కుటుంబాలకు చెందిన 60కి పైగా జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. నీటి చెలమలతో, సెలయేళ్ళతో విలసిల్లే శేషాచలం కొండల్లో పరిశోధనల కోసం, వైజ్ఞానిక పర్యటనల కోసం ఎందరో వస్తుంటారు. ఈ కొండల్లోని పలు ప్రాంతాల్లో ట్రెకింగ్‌ క్యాంపులు జరుగుతుంటాయి.
ఎలా వెళ్ళాలి?: ఇది తిరుపతికి సమీపంలో ఉంది.
 
 
 
రాతి కొండల పులిగుండు
చిత్తూరు- పెనుమూరు రోడ్డులో ఉన్న పులిగుండు... రెండు నిలువెత్తు రాతి కొండలు అతి దగ్గరగా కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిపై శివుడు, అయ్యప్ప ఆలయాలున్నాయి. ఇక్కడ తరచుగా ట్రెక్కింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి తిరుపతి పరిసరాలు, అటవీ ప్రాంతాలు అతి రమణీయంగా కనిపిస్తాయి.
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో పులిగుండు ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు.
 
జలపాతాల కోన చిత్తూరు జిల్లాలోని పుత్తూరు దగ్గర ఉన్న కైలాసకోన అసలు పేరు
‘కైలాసనాథ కోన’. కొండల పైనుంచి జాలువారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎత్తయిన కొండల పైనుంచి రకరకాల ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ దాదాపు 100అడుగుల పైనుంచి దూకే ఈ జలపాతం నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఈ నీటిలో స్నానం చేస్తే పలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న నమ్మకం ఉంది.
ఎలా వెళ్ళాలి?: తిరుపతి నుండి 45 కిలోమీటర్లు, చెన్నై నుండి 100 కిలోమీటర్ల దూరంలో కైలాసకోన ఉంది. ఆ నగరాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వసతి: ఏపీ టూరిజం హరిత హోటల్‌లో పర్యాటకులు బస చెయ్యవచ్చు. నాన్‌ ఏసీ, డీలక్స్‌ గదులు అందుబాటులో ఉన్నాయి.
 
 
 
శ్రీవేంకటేశ్వరా జూలాజికల్‌ పార్క్‌
దేశంలోని అగ్రశ్రేణి జూలలో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఎస్వీ జంతుప్రదర్శనశాల సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. సింహాలను దగ్గరగా చూసేందుకు లయన్‌ సఫారీ, సందడి చేసే లేళ్ళు, దుప్పులను.. డీర్‌ సఫారీలో చూడొచ్చు. జంతువులు, పక్షులు మాత్రమేగాక ఈ జూ అరుదైన వృక్షసంపద, పుష్ప సంపదకు ఆలవాలం. విద్యార్థులలో జంతుజాలం, ప్రకృతి పట్ల అవగాహన పెంచేందుకు ఇక్కడ ‘బయోస్కోప్‌’ పేరిట అవగాహన కేంద్రాన్ని, ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జూ సమీపంలోనే సైన్స్‌ సెంటర్‌ ఉంది.
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్వీ జూ పార్క్‌ ఉంది. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. 
 
  
ఆధ్యాత్మిక శోభ
అత్యంత పవిత్రమైన, ప్రాచీనమైన పుణ్య క్షేత్రాలలో చిత్తురు జిల్లా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచింది. ఈ జిల్లాను తలుచుకోగానే కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు, పంచభూతలింగాలలో నాల్గవదైన వాయులింగ రూపంలో పరమశివుడు పూజలందుకుంటున్న శ్రీకాళహస్తి, సత్యప్రమాణాలకు సాక్షిగా నిలిచే వరసిద్ధి వినాయకుడి కాణిపాకం గుర్తుకొస్తాయి.
 
  
 
శౌర్యానికి గీసిన గిరి చంద్రగిరి
ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమై, ఆయన కీర్తికి ప్రతీకగా నిలిచింది చంద్రగిరి కోట. ఆనాటి ఆనవాళ్లు, రాజులు వినియోగించిన వస్తువులు, పడక గదులు, రహస్య మందిరాలను చూస్తుంటే అప్పటి చరిత్ర కళ్ళ ముందు కదలాడి మధురానుభూతి కలిగిస్తుంది. ఆ విశేషాలను వివరించడానికి ఏపీ టూరిజం శాఖ సాయంత్రం వేళల్లో ఆకర్షణీయమైన సౌండ్‌ అండ్‌ లైట్‌షోను ఏర్పాటుచేసింది. చంద్రగిరి కోట గురించి తెలియజేసేందుకు వివిధ భాషలు తెలిసిన గైడ్లు అందుబాటులో ఉంటారు.
ఎలా వెళ్ళాలి?: చంద్రగిరి కోట తిరుపతి నుండి 15 కిలోమీటర్లు దూరంలో ఉంది. బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
 
తనివితీరని అందాల తలకోన
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం తలకోన. శేషాచల పర్వత అటవీ సానువుల్లో సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే వృక్షాలు, జలపాతాల సోయగాలు, పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల పలకరింపుల నడుమ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో తలకోన అందాలను చూసి తీరవలసిందే. తలకోనలోని ఎత్తయిన కొండల నుంచి నిత్యం జాలువారే జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఏడాదంతా ఉరకలేస్తూ ఉంటుంది. తలకోన అడవుల్లో అరుదైన వృక్ష సంపద కనిపిస్తుంది. ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్‌ ఇక్కడ జరుగుతాయి.
 
నెలకోన
తలకోన అడవిలోనే ‘తలకోన’, ‘నెలకోన’ అనే పేర్లతో జంట జలపాతాలున్నాయి. వీటిలో నెలకోన జలపాతం రెండు కొండల మధ్యలో ఉంది. కళ్ళకు కనిపించనంతటి ఎత్తు నుంచి నీరు అక్కడి కొలనులో పడుతుంటుంది. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడి ప్రకృతిని, పక్షులను, జంతువులను వీక్షించడానికి అటవీ శాఖ వారు వాచ్‌ టవర్లు ఏర్పాటు చేశారు. నెలకోన జలపాతం దగ్గర్లోకి పర్యాటకులను ఒంటరిగా అనుమతించరు.
 
ఐతే సిద్ధక్క బావి
సుమారు 400 సంవత్సరాల ప్రాచీనమైన ‘ఐతే సిద్ధక్క బావి’ తలకోనకు వెళ్లే మార్గంలో ధనువు తీసిన బండ వద్ద ఉంది. ఇక్కడ వాచ్‌టవర్‌ ఏర్పాటు చేశారు.
 
ఔషధ గుణాల గెల్ల తీగ
తీగ జాతుల్లో అత్యంత పొడవైనది గెల్ల తీగ. ఔషధాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. నెలకోనకు వెళ్లే దారిలో ఉన్న ఈ గెల్ల తీగ ఎంతో ప్రాచీనమైనది. ఇది దాదాపు కి.మీ. పొడవు ఉంటుంది. దీని శాఖోపశాఖలు సుమారు అయిదు కి.మీ. విస్తరించి ఉన్నాయి. తీగ చుట్టుకొలత 200 సెం.మీ., కాయలు ఒకొక్కటీ వంద సెం.మీ. పొడవు ఉంటాయి.
ఎలా వెళ్ళాలి?: తిరుపతి నుంచి 67 కి.మీల దూరంలో తలకోన ఉంది. తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సు, పైవ్రేటు ట్రావెల్స్‌ ద్వారా తలకోనకు చేరుకోవచ్చు.
 
వసతి: తలకోన ప్రాంతంలో ఏపీ టూరిజం కాటేజీలను ఏర్పాటు చేసింది. ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ సమీపాన బోటింగ్‌తో పాటు పిల్లల కోసం చిల్డ్రన్స్‌ పార్క్‌ కూడా ఉంది. టీటీడీ ఆధ్వర్యంలోని వసతి గృహాలు ఉన్నాయి. నేరుగా సంప్రదిస్తే అప్పటికప్పుడే గదులు పొందవచ్చు. అటవీశాఖ ఆధ్వర్యంలోని సీబీఈటీ సముదాయంలో వసతిగృహాలున్నాయి. ‘వనదర్శిని డాట్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా వీటిని బుక్‌ చేసుకోవాలి.
 
 
మరికొన్ని వివరాలకు..
http://www.aptdc.gov.in/
http://www.andhrajyothy.com/tourism/ap-tourism.html
 
 
- ఆంధ్రజ్యోతి, చిత్తూరు జిల్లా