
- బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత
- ఘంటసాల గళాన్ని పరిచయం చేసిన ఘనుడు
- తొలి ప్రధాని ప్రసంగానంతరం వినిపించిన తొలిగీతం రచయిత
- ‘సంగీత రుషి’ని కోల్పోయాం..సీఎం చంద్రబాబు సంతాపం
- నేడు బెజవాడలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నేడు విజయవాడలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆకాశవాణి ‘భక్తి రంజని’ ద్వారా తెలుగు ప్రజలకు మేలుకొలుపు పాడిన స్వరం మూగబోయింది. బహుముఖ ప్రజ్ఞాశాలి.. నవీన వాగ్గేయకారుడు.. రచయిత.. స్వరకర్త బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూశారు. నేటికీ తెలుగు ప్రజలకు మేలుకొలుపు పాడుతున్న ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమానికి రూపకర్త ఆయనే. 98 ఏళ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున విజయవాడ సీతారాంపురంలోని స్వగృహంలో అస్వస్థతతో ఆయన కన్నుమూశారు. 1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో రజనీకాంతరావు జన్మించారు. వేంకటపార్వతీశ కవుల్లో ఒకరైన కవిరాజహంస బాలాంత్రపు వెంకట్రావు తనయుడే రజనీకాంతరావు. ఈయన పుట్టిన రెండేళ్లకే అమ్మ వెంకటరమణమ్మ కన్నుమూయడంతో పిఠాపురంలో చిన్నమ్మమ్మ వద్ద పెరిగారు. ఆయన విద్యాభ్యాసం అక్కడే సాగింది. ఆంధ్రవిశ్వకళాపరిషత్‌లో బీఏ ఆనర్స్ (తెలుగు, సంస్కృతం) చేశారు. రజనీకాంతరావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
సీఎంతోసహా పలువురు ప్రముఖుల సంతాపం
సప్త స్వరాలే శ్వాసించి, సరిగమలను ధ్యానించిన సంగీత రుషి రజనీకాంతరావు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. లలిత సంగీతానికి, ఆకాశవాణి అభిృవద్దికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. రజనీకాంతరావు పార్ధివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఆదేశించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరొక సందేశంలో సంతాపం ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రజనీ మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, సీనియర్ సంగీత కారులు, భాషావేత్తలు, సాహిత్యకారులు, పాత్రికేయులు తదితరులు ఆయన మృతదేహానికి నివాళి సమర్పించారు. రజనీకాంతరావు మృతదేహానికి సోమవారం ఉదయం 10.30 గం.లకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
నడిచే పాట రజనీ...
రజనీకాంతరావు పరిచయం ఉన్నవారంతా ఆయనను నడిచే పాటగా పిలుచుకుంటారు. రజనీకి ఆయన తండ్రి నుంచి సాహితీవారసత్వం వచ్చింది. తండ్రి వెంకట్రావు ‘ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల’ పేరుతో ఓ సాహితీసంస్థను నిర్వహించేవారు. తల్లి కూడా సాహిత్యాన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆనాటి గొప్ప పండితులు నిత్యం ఆయన ఇంటికి వచ్చి పోతుండేవారు. ఈ ప్రభావం రజనీకాంతరావును మంచి సాహిత్యకారుడిగా తీర్చిదిద్దాయి. పిఠాపురంలో తమ బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ వద్ద భక్తి సంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కాకినాడ పీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్(ఆంధ్రా యూనివర్సిటీ)లో బిఏ ఆనర్స్ (తెలుగు, సంస్కృతం) చదివారు. పింగళి లక్ష్మీకాంతం గురువైతే, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆత్మీయ మిత్రుడు.
రచయితగానూ ఆకట్టుకున్నారు
కవి, స్వరకర్త, సంగీత విద్వాంసుడు అయిన రజనీకాంతరావు 21 ఏళ్ల నుంచే అనేక రచనలు చేశారు. వందలాది లలిగీతాలతో పాటు జేజిమామయ్య వంటి బాలగేయాలనూ రచించారు. శతపత్ర సుందరి, ఆంధ్రవాగ్గేయకార చరితము, విశ్వవీణ, ఏకాంత సేవ, తన ఆత్మకథా విభావరి ‘రజనీభావతరంగాలు’ తదితర రచనలు చేశారు. ‘సారంగదేవ’ అనే కలం పేరుతో అనేక మంది తెలుగు కవుల జీవితాలను కూడా తెలుగువారికి పరిచయం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో టంగుటూరి సూర్యకుమారి పాడిన ‘మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే గేయాన్ని రచించి స్వరపరిచింది రజనీకాంతరావే.
స్వతంత్ర భారతంలో వినిపించిన తొలి తెలుగు గీతం
1947 ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ జండాను ఎగురవేశారు. అనంతరం తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే ఆలపించిన దేశభక్తి గీతం ‘మోగించు జయభేరి’ రజనీ రాసి, కంపోజ్ చేశారు. గాయని టంగుటూరి సూర్యకుమారి పాడారు. సూర్యకుమారి గొంతు నుంచి జాలువారి ఎందరికో ఉత్తేజానిచ్చిన ‘‘మాదీ స్వతంత్ర దేశం... మాదీ స్వతంత్ర జాతి’’ పాటను రజనీకాంతరావే స్వరపరిచారు. ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా భక్తిరంజనిని ప్రవేశపెట్టి 1956లో శ్రీ సూర్యనారాయణా, మేలుకో హరి సూర్యనారాయణా వంటి భక్తిగీతాలను అత్యంత శ్రావ్యంగా తెలుగు శ్రోతలకు వినిపించిన ఘతన రజనీకాంతరావుదే. ఏడెనిమిది సినిమాలకు పాటలు కంపోజ్ చేశారు. పాపులర్ సంగీతాన్ని సంగీత గంగోత్రి పేరిట ఆయన కంపోజ్ చేశారు.
ఎన్నో పురస్కారాలు
1961లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. టీటీడీ వెంకటేశ్వర కళాపీఠానికి స్పెషల్ ఆఫీసర్‌గా నాలుగు సంవత్సరాలు పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. 1972లో గుడిపూడి వెంకటాచలంను ఇంటర్వ్యూ చేసి శ్రోతలకు వినిపించారు. చలంకు సంబంధించి అప్పటికీ ఇప్పటికీ రేడియోబ్రాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇది ఒక్కటే కావడం గమనార్హం.
సంగీత సాహిత్య సమ్మిళితం...ఆయన జీవితం
సన్నిహితులు, సహచరులు ఆప్యాయంగా పిలుచుకునే ‘రజనీ’ది సంగీత సాహిత్య సమ్మిళిత జీవితం. లలిత సంగీతంలో ఆయన ముద్ర అజరామరం. ఐదేళ్లకే కల్యాణి రాగాన్ని పాడిన ఆయన తన 16వ ఏట తొలి పాట రాసి, బాణీకట్టి పాడారు. కర్నాటక సంగీతం నేర్చుకున్న రజనీ తదనంతరకాలంలో ఉత్తర భారత, పాశ్చత్య సంగీత పోకడలపై పట్టు సంపాదించారు. మధ్య ప్రాచ్య సంగీతపు ఆలాపనా పద్ధతులను అవలీలగా పలికించిన ఆయన బీఎన్‌రెడ్డి వంటి సంగీత దర్శకులకు దగ్గరయ్యారు. స్వర్గసీమలో భానుమతి పాడిన ‘ఓహో పావురమా!’ మొదలు రాజమకుటంలో ‘ఊరేది పేరేది ఓ చందమామా..’వరకు ఎన్నో గీతాలను రజనీ తెలుగు సినిమాకు అందించారు.
అన్ని ప్రయోగాలూ ఆకాశవాణిలోనే..
1941లో ఆలిండియా రేడియో మద్రాసు స్టేషన్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంతరావు తదనంతర కాలంలో అహ్మదాబాద్, విజయవాడ, బెంగళూరు తదితర స్టేషన్ల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఘంటసాల స్వరాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందీ, ఘంటసాల భగవద్గీతను ఆవిష్కరించినదీ ఈయనే. రేడియోలో అన్నమయ్య కీర్తనలతో తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత నింపారు. ఉషశ్రీ ‘ధర్మ సందేహాలు’, భక్తిరంజనిని ప్రవేశపెట్టిందీ, కార్మికుల కార్యక్రమం, వనితా వాణి కార్యక్రమాలకు సిగ్నేచర్ ట్యూన్ స్వరపరిచినదీ రజనీకాంతరావే. జేజి మామయ్యగా బాలగీతాలను రేడియోలో అందించి పిల్లలకు చేరువయ్యారు. లలిత, భక్తి సంగీతాలతో రేడియోను సామాన్యులకు సన్నిహితం చేశారు. రేడియో అంటే రజనీ.. రజనీ అంటే రేడియో అన్నంతగా ముద్ర వేసుకున్నారు. 1978లో ఆయన ఆల్ఇండియా రేడియోలో ఉద్యోగవిరమణ చేశారు. రజనీకాంతరావు మృతితో సంగీతం ఒక ‘పెద్ద’ దిక్కును కోల్పోయినట్టయింది.