Nov 28 2014 @ 21:11PM

‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ విడుదలై నేటికి 30 ఏళ్లు

                                             చారిత్రక చిత్రాలకు తలమానికం
కులమత విభేదాలు, విగ్రహారాధన, జంతుబలులు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 400 ఏళ్ల క్రితమే నినదించిన సంస్కర్త, తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం. అటువంటి మహనీయుని చరిత్రను అనితరసాధ్యమైనరీతిలో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు మహానటుడు ఎన్టీఆర్‌. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం.
ఇతిహాసాలు, చారిత్రక కథాంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రాల్లో ఒక పాత్రలోని బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యదశలను చూపించిన చిత్రాలు తెలుగులో ఏ మూడో నాలుగో ఉంటాయి. వాటిల్లో ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలే రెండు ఉండటం గమనార్హం. ఆ చిత్రాలు ‘భీష్మ’,‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’. ఏమాత్రం గ్లామర్‌, వినోదం లేకుండా కాషాయ వస్ర్తాలు ధరించి, సందేశాలు చెప్పే ఒక తత్వవేత్త కథతో సినిమా రూపొందించడమే ఒక సాహసం. అందులో వాస్తవచరిత్రలో ఉన్న వివాదాంశాలను కూడా ధైర్యంగా చర్చించడం, ప్రజలను ఒప్పించి మెప్పించడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అంతకుముందు ఐదారుగురు బ్రహ్మంగారి గురించి చిత్రాలు ప్రారంభించినప్పటికీ అనేక అవాంతరాలతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేశారు. ఎన్టీఆర్‌ ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపించినా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. దాదాపు రెండేళ్లు పరిశోధనలు చేసి స్ర్కిప్ట్‌ రూపొందించారు. సంఘాన్ని చూసి బాధపడి, భవిష్యత్‌ను ఊహించిన మహాజ్ఞాని బ్రహ్మంగారనీ, పీడత వర్గాలను చూసి వేడి కన్నీటిబొట్లు రాల్చిన సంస్కర్త అనీ ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ చెప్పేవారు. బ్రహ్మంగారు తన జీవితంలో ఏ యే ప్రాంతాల్లో పర్యటించారో అక్కడే ఈ చిత్రం షూటింగ్‌ జరగడం విశేషం. రాయలసీమ ప్రాంతంలో ఎన్టీఆర్‌ తొలిసారిగా షూటింగ్‌ జరిపిన చిత్రం ఇదే. రాయలసీమలోని కందిమల్లాయపల్లె, అహోబిలం తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. అలాగే ముమ్ముడివరం బాలయోగి మందిరం దగ్గర షూటింగ్‌ జరిపిన ఏకైక చిత్రం ఇదే. షూటింగ్‌కు ముందు బ్రహ్మంగారి మఠాన్ని ఎన్టీఆర్‌ సందర్శించారు. అప్పుడే బ్రహ్మంగారు ఉపయోగించిన వస్తువుల నకళ్లను తయారు చేయించడానికి ఆయన పాదుకల్ని పరిశీలించారు. బ్రహ్మంగారి పాదుకలు ఎన్టీఆర్‌ పాదాల కొలతతోనే ఉండటం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో సిద్ధయ్య పాత్రను నందమూరి బాలకృష్ణ పోషించారు. ఆయన నటజీవితంలోనే అత్యుత్తమమైన నటన ప్రదర్శించిన చిత్రంగా నిలిచింది. అలాగే కక్కడిగా సత్యనారాయణ పాత్ర కూడా ప్రశంసలు అందుకొంది. ముక్కామల, రుష్యేంద్రమణి, దేవిక, కాంచన, రతి, ప్రభ తమ పాత్రల్లో రాణించారు.
కొండవీటి వేంకటకవి రచనా చాతుర్యం, సుసర్ల దక్షిణామూర్తి సంగీత సౌరభం, నందమూరి మోహన్‌కృష్ణ ఛాయాగ్రహణ నైపుణ్యం బంగారానికి తావి అబ్బినట్లుగా వన్నె తెచ్చాయి. ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు ఈ చిత్రానికి సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి, అద్భుతమైన అభినయంతో, అనితర సాధ్యమైన దర్శకత్వ ప్రతిభతో ఎన్టీఆర్‌ ప్రాణం పోశారు. చిత్రంలోని పాటలు, కాలజ్ఞాన తత్వాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గాయకుడు రామకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిందీ సినిమా. 1981లో ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రనిర్మాణం పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం 1984 నవంబర్‌ 29న విడుదలై ఘనవిజయం సాధించింది.
తెలుగులో తొలిసారి వందకు పైగా ప్రింట్లతో విడుదల కావడం ఒక విశేషం.
                   ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో విడుదలైన
‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రం ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ రాజకీయ జైత్రయాత్రకు ఒక టానిక్‌లా పనిచేసింది. పార్లమెంట్‌లో ఒక ప్రాంతీయపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఏకైక చారిత్రక సంఘటనలో ఈ చిత్రం తనదైన ప్రభావం చూపించింది.