Apr 15 2018 @ 00:47AM

వ్యవసాయ మాంత్రికుడు గోపాల్‌రెడ్డి కన్నుమూత

గరిడేపల్లి, ఏప్రిల్‌ 14: వ్యవసాయ రంగ మాంత్రికుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త ఘంటా గోపాల్‌రెడ్డి(86) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
 
గోపాల్‌రెడ్డికి భార్య రత్నమాల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 1932 ఫిబ్రవరి 14న గడ్డిపల్లిలో జన్మించిన ఆయన.. 1964 నుంచి 1969 వరకు హైదరాబాద్‌లోని అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశారు. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించారు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు. శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.