Apr 13 2018 @ 00:42AM

అసలైన జాతీయవాది

భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే జాతీయ నాయకుడు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌. ఆయన 127వ జయంతిని పురస్కరించుకుని అన్ని పార్టీలు అంబేడ్కర్‌ తమ ప్రతినిధే అని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నాయి. కానీ అంబేడ్కర్‌ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికే కాక భవిష్యత్‌ తరాలకు కూడా స్ఫూర్తిదాయకం. అంబేడ్కర్‌ను ఏ ఒక్క కులానికో, మతానికో ఆపాదించలేము. ఆయన్ను కులాలకు, మతాలకు పరిమితం చేయటం అంటే ఆ మహనీయుడిని తక్కువ చేసి చూడటమే అవుతుంది.
 
హిందూ సమాజంపై అంబేడ్కర్‌కు వ్యతిరేకత ఉందన్నది వాస్తవం కాదు. అంబేడ్కర్‌ ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన హిందూ సమాజాన్ని ఎన్నడూ ఏవగించుకోలేదు. హిందూ సమాజంలో ఉన్న దురాచారాలను మాత్రమే ఎండగట్టడం జరిగింది. అనేక సందర్భాలలో ఆయన హిందూ సమాజంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు పరిశీలిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది. తాను ప్రత్యక్షంగా అనుభవించిన అంటరానితనాన్ని, కుల వివక్షలను రూపుమాపాలని దృఢమైన సంకల్పం తీసుకున్నాడు. అందుకే ‘కులం పునాదులపై ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేము’ అని స్పష్టం చేశాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ సామాజికంగా కలిసి ఉండాలని కోరుకున్నాడు. సామాజికంగా కలిసి లేకుండా రాజకీయంగా కలిసి ఉండటం సాధ్యంకాదని అభిప్రాయ పడ్డాడు. ‘సామాజికంగా కలిసి లేకుండానే రాజకీయంగా కలిసి ఉన్నామని అనుకోవటం ఎడారిలో చెట్టును పెంచినట్టే అవుతుంది’ అన్నారు. ‘నా వ్యక్తిగత ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం ఏర్పడితే నేను నా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తాను’ అన్న ఆయన మాటలు దేశం పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుతాయి.
 
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో భారత దేశ సమగ్రతను కాపాడేందుకు అంబేడ్కర్‌ ఎంతో పరితపించాడు. రాజ్యాంగ రచనా సమయంలో కూడా మతం, ప్రాంతం పేరుతో జరిగే విచ్ఛిన్నాన్ని ముందే పసిగట్టాడు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించాడు. అదే సమయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం బలమైన అధికారాలు కలిగి ఉండాలని కోరుకున్నాడు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాల్సి వచ్చినప్పుడు కూడా అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇలాంటి చర్యల వల్ల భారత్‌ ఒక దేశంగా మనుగడ సాగించలేదని ఊహించి, కశ్మీర్‌కు మిగిలిన రాష్ట్రల కంటే అపరిమిత అధికారాల్ని కట్టబెట్టే 370 ఆర్టికల్‌ను కూడా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌, అంబేద్కర్‌ ఒక్కతాటిపై నిలుచున్నారు. హిందూ కోడ్‌ బిల్‌, కామన్‌ సివిల్‌ కోడ్‌ కావాలని పోరాటం చేశాడు. ముస్లిం పర్సనల్‌ లా ఉండటం సరికాదన్నాడు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం, భవిష్యత్‌ తరాల వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే రిజర్వేషన్ల విధానాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. తనను ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టిన వర్గాల వారిపై ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. తన వర్గాలను కూడా వారితో సమాంతరంగా నిలబెట్టడం ద్వారా మార్పుకోరుకున్నారు. ‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు’ అన్న ఆయన మాటల్లో ఎంతైనా ఔచిత్యం ఉంది.
 
అంబేద్కర్‌ను హిందూమతానికి వ్యతిరేకంగా చిత్రీకరించడమంటే చరిత్రను వక్రీకరించటమే అవుతుంది. వేదాల్లోనూ, పురాణాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ ఉన్న సారాన్ని అవపోసన పట్టాలని, మత గ్రంథాలన్నీ మంచిని బోధిస్తాయని అన్నారు. ‘నేను మతాన్ని ఇష్టపడతాను ఎందుకంటే మతం సాధికారతను బోధిస్తుంది’ అంటారు అంబేద్కర్‌. అందుకే ఆయన్ను ఎప్పుడూ ఒకే కోణంలో చూపించటం సరికాదు. హిందూ మతాన్ని అత్యంత గౌరవించిన వ్యక్తి అంబేడ్కర్‌. ఏ మతం అయినా సరే మత మార్పిడులు జరగటం సరైంది కాదన్నారు అంబేడ్కర్‌. హైదరాబాద్‌ రాష్ట్రంలో 1947-49 సంవత్సరాల మధ్య హిందూ మతంలోని ప్రజలు బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చబడడాన్ని అంబేడ్కర్‌ వ్యతిరేకించారు. అలా హిందూ మతం నుంచి ముస్లింలుగా మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావాలని కూడా అభిప్రాయపడ్డారు.
 
రాజ్యాంగం అమల్లోకొచ్చి 67 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అంబేడ్కర్‌ ఆశించిన ఫలాలను అణగారిన కులాలు అందుకోలేకపోతున్నాయి. వారిపై జరుగుతున్న అమానుష దాడులను రూపుమాపలేక పోవటం ప్రభుత్వాల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. దళితులపై, నిమ్న వర్గాలపై దాడులు జరిగినపుడు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవటమే తప్ప రాజకీయ నాయకులకు వారిపట్ల నిజాయితీని కలిగి ఉండకపోవటం బాధాకరం. అంబేడ్కర్‌ ఆశించిన జాతీయవాదం, సమగ్రత రాజకీయ పార్టీల్లో వెల్లివిరియాల్సిన అవసరం ఉంది. సువిశాల భారతావని కోసం పరితపించిన ఆ మహనీయుడి ఆశయాలను ఆచరించటమే ఆయనకు ఘనమైన నివాళి.
 డాక్టర్‌. దొంతగాని వీరబాబు
(ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి)