Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 03 Apr 2018 09:12:39 IST

ఎనిమిది పదుల చదువుల తల్లి

ఎనిమిది పదుల చదువుల తల్లి

పెద్దయిన తర్వాత చదువు కొనసాగించడం ఆడవాళ్లకు అసాధ్యమనుకుంటారు. కానీ చదువుకు వయసుతో పనిలేదని నిరూపించారు ఇక్కడ కనిపిస్తున్న 84 ఏళ్ల లక్ష్మీబాయి పుంజాల. ఏడు పదులు దాటిన తర్వాతే లక్ష్మీబాయి ఫిలాసఫీలో పిహెచ్‌డి చేశారు. తర్వాత రెండు డి.లిట్‌లు చేసి వాటిల్లో బంగారు పతకాలు సాధించారు. ఇటీవల తన ఎంబ్రాయిడరీ వర్క్సుతో ఎగ్జిబిషన్‌ కూడా పెట్టారు.
 
‘‘ఎనభైనాలుగేళ్ల వయసులో డా.లక్ష్మీ బాయి అని అనిపించుకోవడం ఎలా ఉంది మీకు’’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. కానీ చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఏ పనినైనా క్రమశిక్షణతో చేసుకుపోవడం నా అలవాటు. అలాగే పిహెచ్‌డి, రెండు డి.లిట్‌లు కూడా చేశాను.
 
ఊళ్లోనే పులులు... సింహాలు!
స్కూలు ఫైనల్‌ వరకూ నా చదువు సాగిన తీరు వింటే ఆశ్చర్యపోతారు. మాది ఒరిస్సా కోరాపూట్‌ జిల్లాలో జయపూర్‌ అనే కొండగ్రామం. అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. మా అమ్మానాన్నలకు మేం మొత్తం పదకొండుమంది పిల్లలం. అందరిలోకీ నేనే పెద్దదాన్ని. మా నాన్న రామకృష్ణారావు పోలీసుశాఖలో పనిచేశారు. మా ఊరు ఎంత లోపలిగా ఉండేదంటే పులులు, సింహాలు కూడా అక్కడ బాగా తిరిగేవి.
 
మా అమ్మ రాజమణి ఎంతో సున్నితమనస్కురాలు. పదకొండుమంది పిల్లల బాగోగులు చూస్తూనే, తనకెంతో ఇష్టమైన ఎంబ్రాయిడరీ వర్కు చేసేది. మా ఫ్రాకులను కూడా ఆమే ఎంతో ఫ్యాషన్‌గా కుట్టేది. ఆమెకు చిత్రలేఖనం కూడా వచ్చు. కొండగ్రామం అయిన మా వూరిలో అప్పట్లోనే మహిళా క్లబ్బు కూడా ఉండేది! అందులోని మహిళలందరూ వులెన్‌ వర్కు చేసేవారు. అప్పుడు రెండవ ప్రపంచయుద్ధం జరుగుతోంది. మా అమ్మతో పాటు లేడీస్ క్లబ్‌లోని సభ్యులు సైనికుల కోసం ప్రత్యేకంగా వులెన్‌ స్వెట్టర్లు అల్లి పంపేవారు.
 
మా అమ్మ వాళ్లది సంగీత కుటుంబం. ప్రసిద్ధ వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మా అమ్మకు చిన్నాయన అవుతారు. కళలంటే అమ్మకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నాకూ వచ్చింది. సంగీతమన్నా, నృత్యమన్నా నాకు ప్రాణం. మా నాన్న చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. పైగా మాది సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబం. అందుకే నేను పెరిగిన ప్రపంచం పూర్తిగా వేరు. ‘పెద్దవాళ్లను గౌరవించాలి, కుటుంబబాధ్యతలు నిర్వర్తించాలి, అత్తమామలకు సేవలు చేయాలి’ లాంటి పెద్దవాళ్ల మాటల మధ్య పెరిగాను.
 
అంతా ప్రైవేటుగానే...
మా అమ్మకు పిల్లలను ఎలాగైనా చదివించాలని ఉండేది. నాకూ చదువంటే ఇష్టం. మా ఊళ్లో అప్పట్లో స్కూలు, కాలేజీలు లేవు. చిన్న బడి మాత్రం ఉండేది. చదువు కోసం నన్ను బయటకు పంపడం నాన్నకు అస్సలు ఇష్టం లేదు. పగలే ఊళ్లో పులులు అవీ తిరిగేవి. అందుకే ఇంట్లోనే నన్ను ఇంట్లోనే ఒక ట్యూటర్‌ని పెట్టి ప్రైవేటుగా చదివించారు. మెట్రిక్యులేషన్‌ పాసయ్యాను. ఆ విషయాన్ని నాన్న అందరికీ ఎంతో గర్వంగా చెప్పారు. ఇంటర్‌ చదువుతానని పట్టుబట్టాను. ప్రైవేట్‌గానే ఇంటర్‌, బిఎలు చదివాను. మాకు బిఎలో డొమెస్టిక్‌ సైన్సు అనే ఒక సబ్జెక్టు ఉండేది. నేను ప్రైవేటు విద్యార్థినిని కావడం వల్ల ఆ సబ్జెక్టు ప్రాక్టికల్స్‌కు అంగీకరించలేదు.
 
దీంతో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌తో గొడవపడి అనుమతి సాధించి మరీ ప్రాక్టికల్స్‌లో పాసయ్యాను. విశేషమేమిటంటే ప్రాక్టికల్స్‌లో నేనే ఫస్ట్‌ వచ్చాను. నాకు ఇంగ్లీషులో మంచి పునాదులు పడడానికి కారణం జయపూర్‌ మహారాజా అని చెప్పాలి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ను మా ఊరికి మహారాజా తెప్పించారు. అలా రాజావారీ పిల్లలతో పాటు నేను కూడా మూడేళ్లు ఆ స్కూల్లో చదివాను.
 
ఆయన ‘లా’ చదవమనేవారు...
నా పెళ్లి ప్రముఖ న్యాయవాది పి.శివశంకర్‌గారితో 1950లో అయింది. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌ నేతగా, కేంద్ర మంత్రి, సిక్కిం, కేరళల గవర్నరుగా సేవలందించారు. ఆయన కుటుంబం కూడా మాలాగే పెద్దది. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆయన ‘లా’ పూర్తిచేశారు. చదువుకున్న అమ్మాయే కావాలని హైదరాబాద్‌ నుంచి మా కొండవూరు వచ్చి నన్ను పెళ్లిచేసుకున్నారు. అప్పట్లో చదువుకున్న మహిళలు తెలంగాణలో పెద్దగా ఉండేవారు కాదు. నేను ‘లా’ చదవాలని ఆయనకు గట్టిగా ఉండేది. పెళ్లయిన తర్వాత తరచూ నన్ను ‘లా’ చదువంటూ పోరేవారు. కానీ అది సాధ్యపడలేదు. అత్తమామలు, ఇంటి పని, పిల్లలు ఇదే నా లోకంగా ఉండేది. ఆయన చివరకు ‘నిన్ను సేవలు చేయడానికి కాదు పెళ్లి చేసుకుంది.. నాతో హైకోర్టుకు ఫైల్స్‌ పట్టుకుని న్యాయవాదిగా వస్తావని’ అని కోప్పడ్డారు కూడా! మొత్తానికి ఆయన నా వల్ల చాలా డిజప్పాయింట్‌ అయ్యారు.
 
రెండు షాక్‌లు...
మాకు ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు. నా జీవితాన్ని రెండు విషయాలు బాగా కలిచివేశాయి. మా చిన్నబ్బాయి సుధీర్‌ కుమార్‌ మరణం నన్ను తీవ్ర షాక్‌కి గురిచేసింది. అలాగే మా అమ్మాయి జలజ సంగీత, నృత్య కళాకారిణి. వీణ చాలా బాగా వాయిస్తుంది. నృత్యం చేస్తుంటే కళ్లకప్పగించి చూడాలి. అంత బాగా చేస్తుంది. తన ప్రదర్శనల కోసం నేనూ తనతో పాటు విదేశాలు తిరిగాను. కాలు కదపకుండా కళల మీదే ఏకాగ్రత చూపేలా ఎన్ని విధాల సహకరించాలో అన్ని విధాలా సహకరించాను.
కానీ ఏమయిందో ఏమో హఠాత్తుగా నృత్య, సంగీతాలను వదిలేసింది. తనను ఎన్నో విధాలుగా ఒప్పించాలని చూశాను. కానీ తన నిర్ణయంలో మార్పు లేదు. ఇది నాకు ఊహించని దెబ్బ. ఎంతో దుఃఖించాను. నాకు సంగీతమంటే ఎంతో ఇష్టం. కానీ 70 ఏళ్ల వయసులో ఏం నేర్చుకోగలను? పాడగలను? చివరకు ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడాలనుకున్నాను. అప్పుడే స్వామి చిన్మయానంద ప్రభావం నా మీద బాగా పడింది. సంగీతం నేర్చుకోలేను కాబట్టి చదువుకుందామన్న ఆలోచన కలిగింది. ఫిలాసఫీపై నా దృష్టి పడింది. అలా నా విద్యావ్యాసంగాన్ని మళ్లా మొదలెట్టాను.
 
ఒక పిహెచ్‌డి, రెండు డి.లిట్‌లు..
 
ప్రైవేటుగా ఫిలాసఫీ ఎంఎ చేసి, తర్వాత అందులో పిహెచ్‌డి చేశాను. బరంపురంలో తెలుగు ప్రొఫెసర్‌ డా. నారాయణ దగ్గర డి.లిట్‌ చేశాను. అదీ ప్రైవేటుగానే! ‘ఫిలసాఫికల్‌ ఫౌండేషన్స్‌ ఫర్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ రిలవెన్స్‌ టు భగవద్గీత’ మీద చేశాను. ఈ డి.లిట్‌లో బంగారు పతకం సాధించాను. తర్వాత రెండవ డి.లిట్‌ను ‘స్పిరిచ్యువల్‌ స్టోరీ ఆఫ్‌ ఇతిహాసాస్‌ అండ్‌ పురాణాస్‌’ మీద బరంపురం యూనివర్సిటీలోనే ప్రైవేటుగా చేశాను. దీంట్లోనూ బంగారుపతకం వచ్చింది. ఇప్పటికి 20 సంవత్సరాలు పైగా ఎంబ్రాయిడరీ వర్కు చేస్తున్నాను. అందులో కూడా బంగారుపతకాన్ని సాధించాను. ఇంత వయసులో నేనెంతో ఉషారుగా ఉన్నానంటే నా తల్లితండ్రులు ఇచ్చిన ఆరోగ్యం, అందరి ప్రేమ, భగవంతుడి దయ. వంట, గార్డెనింగ్‌లు చేయడం నాకు ఇష్టం. నాది ఎవరో వెన్నుతడితే ముందుకు అడుగులు వేసిన జీవితం కాదు. నాలో నేను... నాతో నేను చేసిన సుదీర్ఘ ప్రయాణమది!’
 
రాజ్‌భవన్‌లో ఉన్నప్పుడు...
నేను నా జీవితాన్ని హాయిగా ఆస్వాదించిన రోజులంటే మా ఆయన సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నప్పుడే! అక్కడ రాజ్‌భవన్‌లో జరిగే విందుల ఏర్పాటులో, నిర్వహణలో నేను వైవిధ్యం చూపేదాన్ని. వచ్చే అతిథులందరికీ నచ్చేలా వెరైటీ వంటలను దగ్గరుండి వండించేదాన్ని. ఈ రకమైన ఆతిథ్య సంస్కృతి గతంలో అక్కడ ఎవ్వరూ ఎరుగరు. ప్రధాని నరసింహారావు, రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మగార్లు కూడా నా వంటల రుచులకు మైమరచిపోయారు. ఫస్ట్‌ లేడీగా సభలకు, సమావేశాలకు హాజరయ్యేదాన్ని. నేను ఆతిథ్యం ఇచ్చిన తీరు గురించి, రాజ్‌భవన్‌ను అందంగా తీర్చిదిద్దిన వైనం గురించి, రాజ్‌భవన్‌ గార్డెన్‌ను మలిచిన తీరు గురించి మీడియాలో తరచూ రాసేవారు.
 
స్వేచ్ఛ ఎక్కువై... 
ఇప్పటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న హింసకు కారణాలు ఎన్నో! గతంలో ఉన్న ఉమ్మడి కుటుంబ జీవనం నేడు లేదు. దాని స్థానంలో న్యూక్లియర్‌ కుటుంబాలు ఏర్పడ్డాయి. పిల్లలకు పెద్దలతో సంబంధాలు లేకుండా పోయాయి. పిల్లలకు నైతిక విలువల గురించి చెప్పేవారు ఉండడం లేదు. ఆడవారిపై చోటుచేసుకుంటున్న హింస, వివక్షలకు కారణం స్త్రీపురుషుల్లో మంచి వ్యక్తిత్వాన్ని పెంచే క్రమశిక్షణ లోపించడమే! పైగా పిల్లలకు పేరెంట్స్‌ అతి స్వేచ్ఛనిస్తున్నారు.’
 
భర్త పి.శివశంకర్‌తో లక్ష్మీబాయి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 -నాగ సుందరి, ఫోటోలు:రాజేష్‌ జంపాల
 
 
 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.