Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 27 Feb 2018 04:28:01 IST

చంద్ర చక్రం

చంద్ర చక్రం

  • జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం
  • దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ‘కింగ్‌’! కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’! కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. జాతీయ రాజకీయాలపై చంద్ర ముద్ర వేశారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక... 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. దీనిని అవకాశంగా తీసుకొని చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత... దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించారు. నిజానికి... ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ... సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసును ప్రధానిగా చేస్తే ప్రభుత్వం ఎక్కువ కాలం మనగలుగుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నం చేశారు. కానీ... సీపీఎం అందుకు నిరాకరించి ‘చారిత్రక తప్పిదం’ చేసింది. కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించడంతో రెండేళ్లలోనే ఆ ప్రభుత్వం పడిపోయి... లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. టీడీపీ కేవలం పన్నెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అదేసమయంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరమైంది. కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడక చంద్రబాబు తొలిసారి బీజేపీకి అండగా నిలిచారు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోలేదు. స్పీకర్‌గా ఎర్రన్నాయుడికి అవకాశం కల్పించారు. 1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 33 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నారు.
 
 ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలో...
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్‌ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించారు. కలాం ఒప్పుకోరేమోనని వాజపేయి సందేహం వ్యక్తం చేశారు. కలాంకు చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నచ్చచెప్పి ఒప్పించారు. ఏపీకి గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. ఇక... రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా, ఆర్థికవేత్త రంగరాజన్‌ను చంద్రబాబు గవర్నర్‌గా వేయించుకొన్నారు.
 
 స్వర్ణ చతుర్భుజికి ఇలా శ్రీకారం
చంద్రబాబు మలేషియా వెళ్లినప్పుడు అక్కడ ఆ చివర నుంచి ఈ చివరి వరకూ విశాలంగా నిర్మించి ఉన్న జాతీయ రహదారులను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రధాని వాజపేయిని కలిసి మన దేశంలో కూడా అటువంటి రహదారులను నిర్మించాలని కోరారు. డబ్బులెక్కడివని ప్రధాని ప్రశ్నించారు. పీపీపీ పద్ధతిలో రోడ్లు వేయిద్దామని, రోడ్లు బాగుంటే టోల్‌ ఫీజు కట్టడానికి ఎవరూ వెనుకాడరని చంద్రబాబు వివరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో నాలుగు మూలలా జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి చేపట్టింది.
 
 హలో... హలో!
1997, 98 వరకూ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఫోన్‌ కనెక్షన్లు ఇచ్చేది. విదేశాల్లో మాదిరిగా ప్రైవేటు కంపెనీలు సెల్‌ఫోన్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని వాజపేయికి చంద్రబాబు సూచించారు. కేంద్రం ఓకే అనడంతో రెండేళ్లలోనే దేశంలోకి సెల్‌ఫోన్లు వచ్చి వేగంగావిస్తరించాయి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.