
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బెంగళూరుకు చెందిన టార్నియా టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్.. మెడికల్ షాపుల కోసం గో-డిజిటల్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఇందులో భాగంగా క్లౌడ్ ఆధారిత వ్యాపార డిజిటలైజేషన్ పరిష్కారాల ప్లాట్ఫామ్ ‘టార్నియా స్మార్ట్మైల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్ఫాం ద్వారా రిటైల్ ఫార్మసీలు ఆన్లైన్ ప్రపంచంతో అనుసంధానం కావడంతో పాటు వినియోగదారులకు సొంత మొబైల్ యాప్ ద్వారా సేవలందించవచ్చు. ఈ ప్లాట్ఫాం ద్వారా కస్టమర్లతో పాటు ఔషధాల సరఫరాదారులతోనూ పూర్తిగా ఆన్లైన్లోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుంటుందని టార్నియా వెల్లడించింది. మెడికల్ షాపు యజమానులు తమ మొబైల్ ద్వారానే వ్యాపారాన్ని నిర్వహించవచ్చని, ఎక్కడినుంచైనా రోజువారీ విక్రయాలు, ఔషధాల నిల్వలు, వాటి ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను తెలుసుకునే వీలుంటుందని తెలిపింది. అంతేకాదు, సంస్థ రూపొందించిన ఈగిల్ ఐ అనే డేటా అనలిటిక్స్ టూల్ ద్వారా ఫార్మసీలు కస్టమర్ల కోసం సొంతంగా ఆఫర్లు, లాయల్టీ పథకాలను నిర్వహించవచ్చని అంటోంది.
దేశవ్యాప్తంగా 8 లక్షల మెడికల్ షాపులున్నాయని, అందులో 15 శాతం స్టోర్లలో మాత్రమే టెక్నాలజీని, అది కూడా పాక్షికంగానే ఉపయోగిస్తున్నారని టార్నియా సహ వ్యవస్థాపకులు, సిఇఒ సురేష్ సత్యమూర్తి తెలిపారు. తమ సంస్థ వీరికోసం ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడుతో కలిపి 500 మంది రిటైల్ ఫార్మసీలకు సేవలందిస్తున్నామని అన్నారు. తొలుత దక్షిణాదిపై ఫోకస్ చేయనున్నట్లు, వచ్చే 18 నెలల్లో దేశంలోని 100 ప్రధాన నగరాలకు విస్తరించాలని అనుకుంటున్నట్లు సత్యమూర్తి వెల్లడించారు. వ్యాపార విస్తరణ కోసం నిధుల అన్వేషణలో ఉన్నామని, భవిష్యత్లో 5-10 మిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.