
‘‘మీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరండి. రెవెన్యూ అధికారిగానూ, మునసబుగానూ నియమిస్తున్నాం. ఇవిగో ఉత్తర్వులు’’ అని అంటే.. ఎవరైనా ఎగిరిగంతేసి ఆ ఉద్యోగంలో చేరిపోతారు. అయితే, ఆ యువకుడు మాత్రం ‘సారీ’తో సరిపెట్టాడు. తద్వారా తెల్ల పాలకులపై తన నిరసనను, తన దేశం పట్ల ప్రేమను బయటపెట్టుకొన్నాడు. ఆయనే...అయ్యదేవర!
బెజవాడకు అడుగుజాడ ఆయన! దక్షిణభారత హిందీ ప్రచార సభ భవనం, ఆంధ్రరత్న భవన్, రామ్మోహన్ లైబ్రరీ, వన్‌టౌన్ కూరగాయల మార్కెట్.. ఇలా ఈ నగరం ప్రతి అవసరాన్ని తీర్చి, అభివృద్ధిని కూర్చి, తెలుగు జాతికి తనను తాను సమర్పించుకొన్న త్యాగజీవి అయ్యదేవర కాళేశ్వరరావు! అయ్యదేవర 1882 జనవరి 22న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు.
బందరులో చదివేరోజుల్లో అయనకు రఘుపతి వెంకయ్యనాయుడుతో పరిచయం అయింది. ఆయన ద్వారా కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం వంటివారికి అయ్యదేవర దగ్గరయ్యారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, ఆ సమాజం తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాళేశ్వరరావు లెక్కలలో నిష్ణాతుడు. దీంతో చిన్నతనం నుంచీ ఇంజనీరు కావాలని కోరుకొన్నారు. ఎందుకో ఆయన కోరిక నెరవేరలేదు. మద్రాస్‌లో న్యాయవిద్య పూర్తిచేసుకొని, విజయవాడలో ప్రాక్టీస్ పెట్టారు.
ఈ నగరంపై తన ముద్రను అనేక రూపాల్లో పొందుపరిచారు. అయ్యదేవర తండ్రి రెవెన్యూలో ఉద్యోగి. ఈ కారణంగా, అయ్యదేవరను సర్కారీ కొలువు వరించింది. కానీ, దేశభక్తి భావాలు కలిగిన ఆయన, పర పాలకుల నీడలో బతకడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, మహాత్మాగాంధీ పిలుపునందుకొని, న్యాయవాద వృత్తిని కూడా వదిలిపెట్టారు. విజయవాడ కేంద్రంగా స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించారు.
1921 మార్చి 31-ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగాయి. గాంధీజీతో పాటు ఉద్దండులైన దేశ నాయకులంతా ఈ సభలకు విచ్చేశారు. ఆ రోజులలో విద్యుత్తు సౌకర్యం లేదు. అయితే, కాళేశ్వరరావు పిలుపుమేరకు, ప్రజలు తమ ఇళ్ల ముందు లాంతర్లు వెలిగించి, నగరాన్ని పట్టపగలుగా మార్చారు.
ఈ ఘటనతో కాళేశ్వరరావు పేరు మహాత్ముడి దృష్టికి వెళ్లింది. ఆ తరువాత మూడు సార్లు బెజవాడకు వచ్చిన గాంధీజీ.. ప్రతిసారీ అయ్యదేవరను వెంటపెట్టుకొనే తిరిగారు. ఆయన చదువుకొన్న బందరు నోబుల్ కాలేజీ యాజమాన్యం.. స్వయంగా పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఆ కాలేజీలో కొద్దికాలం ఆయన చరిత్రను బోధించారు. ఆ అనుభవంతో తన జైలు జీవితంలో అమెరికా చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, చైనా జాతి చరిత్ర, ఈజిప్టు చరిత్ర వంటి గ్రంథాలు రచించారు.
‘నాజీవితం-నవ్యాంధ్రం’ పేరిట తన ఆత్మకథను అయ్యదేవర అందించారు. జాతీయోద్యమంలో ఆయనకు రాజగోపాలాచారి, బెజవాడ గోపాలరెడ్డి, టంగుటూరు ప్రకాశం పంతులు సమకాలీనులు. ఉమ్మడి మద్రాస్ అసెంబ్లీలో బెజవాడ తరఫున అయ్యదేవర ప్రాతినిథ్యం వహించారు. చీఫ్ విప్‌గా నాటి అసెంబ్లీలో తెలుగువారి తరఫున గట్టిగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా అయ్యదేవర సేవలు అందించారు. 1962 ఫిబ్రవరి 26న విజయవాడ నుంచి పోటీ చేసి..ఫలితాలు వెలువడకముందే తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. అయితే ఆ ఎన్నికల్లో అయ్యదేవర బ్రహ్మాండమైన ఆధిక్యతతో గెలుపొందారు.
- విజయవాడ, ఆంధ్రజ్యోతి