Jan 1 2018 @ 22:48PM

అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని..

ఆమె మువ్వల సవ్వడి నుంచి జాలువారిన ‘లకుమ’, ‘ రాణి రుద్రమ’ తెలుగునాట నృత్యలోగిలిలో ప్రత్యేకమైనవి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యబోధకురాలిగా అనేకమందికి నృత్యశిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అదే యూనివర్శిటీలో రిజిస్ట్రార్‌ హోదాని అలంకరించిన తొలి మహిళ అలేఖ్య పుంజాల. ఓ వైపు నృత్య బోధన... మరో వైపు యూనివర్సిటీ నిర్వహణ బాధ్యతలు.. ఇంకోవైపు నృత్య ప్రదర్శనలు...వీటన్నింటితో పాటు గృహిణిగా... జుగల్‌బందీ చేస్తున్న అలేఖ్య‘ నవ్య’తో ముచ్చటించారు. ఆ విశేషాలే ఇవి...
 
ఇంట్లో ఉన్నప్పుడు గృహిణిగా నా భర్త, పిల్లల బాగోగులు మాత్రమే ఆలోచిస్తాను. విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టగానే బోధకురాలి హోదాలో ఇమిడిపోతాను. ప్రదర్శన సమయంలో వేదికపై నేను కేవలం నృత్యకారిణిని మాత్రమే. అయితే కొన్నిసార్లు విధి పరీక్షలు పెడుతుంటుంది. ‘యూనివర్సిటీలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. సాయంత్రం వేళ రవీంద్రభారతిలో ప్రదర్శన చేసేందుకు అంగీకరించాను.
 
అదే రోజు మా చిన్నబ్బాయికి జ్వరం... ఆ సమయంలో నేను దేనికి ఎక్కువ ప్రాఽధాన్యత ఇవ్వాలి? ఈ పాతికేళ్ల వృత్తిజీవితంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురయ్యాయి. అవి తారసపడుతున్న ప్రతిసారీ ఎదిరించి ముందుకుసాగుతూనే ఉన్నాను. నేనేకాదు, నాలాంటి ఎంతోమంది మహిళలు ఎదుర్కునే సమస్యలే ఇవి.
వాటన్నింటినీ వివేచనతో ఎలా దాటుకొని ముందుకెళ్లాలో నృత్యం నాకు నేర్పింది. అందుకే, అదంటే నాకు ప్రాణం. ఎప్పుడు ఏ పని చేయాలన్న దానిపై ఖచ్చితమైన స్పష్టత ఉంటే, మన వృత్తిజీవితానికి, కుటుంబ జీవితానికి న్యాయం చేయగలమని భావిస్తాను.
 
ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలి, ఆ సమయంలో దానిపట్ల ఎంత నిబద్ధతతో ఉన్నామన్న విషయాలు చాలా అవసరం. ఆ బాధ్యతలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంలోనే ఆనందం ఉందనుకుంటున్నాను. 2017 నవంబర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కొత్త బాధ్యతలను చేపట్టాను. 30 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో ఆ హోదాను అలంకరించిన తొలి మహిళను నేనే కావడం ఆనందంగా ఉంది. లలిత కళాపీఠం నుంచి ఓ కళాకారిణిగా విశ్వవిద్యాలయ పరిపాలనా బాధ్యతలను చేపట్టే అవకాశం దక్కడం నా అదృష్టం. ప్రస్తుతం లలితకళా పీఠం డీన్‌ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నాను.
 
విద్యార్థిగా మొదలై...
తెలుగు విశ్వవిద్యాలయంతో నా అనుబంధం మొదట విద్యార్థిగా మొదలైంది. 1989నాటి మాట.. అప్పటికే ‘ప్రాచీన చరిత్ర, కళలు’ అనే అంశంపై పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత ఇంగ్లీషు లిటరేచర్‌, సైకాలజీలోనూ ఎంఏ చదివాను. మా గురువు ప్రముఖ నాట్యాచార్యులు ఉమారామారావు వద్ద చిన్ననాటి నుంచి నృత్యశిక్షణ తీసుకున్నాను.
 
వారు నాకు కేవలం గురువు మాత్రమే కాదు, ఆత్మీయులు, మార్గనిర్దేశకురాలు కూడా. లలితకళాపీఠం విభాగాధిపతిగా వ్యవహరిస్తున్న ఉమారామారావు ప్రోత్సాహంతో తెలుగు విశ్వవిద్యాలయం, ఎంఏ కూచిపూడిలో చేరాను. కొద్దిరోజుల తర్వాత యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఖాళీలున్నాయని ప్రకటన వెలువడింది. ఆత్మీయుల సలహాతో దరఖాస్తు చేశాను.
 
ఆ విషయం తెలిసిన అప్పటి వీసీ సి.నారాయణరెడ్డిగారు ‘‘ఏంటి.! అలేఖ్య అప్లై చేసిందా’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.! అలా 1990లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా యూనివర్సిటీతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఓ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తాననిగానీ, ఆ తర్వాత పలు బాధ్యతలు చేపడతాననిగానీ ఎన్నడూ ఊహకందని విషయమే. పెళ్లైన తర్వాత కొద్దిరోజులు నృత్యానికి దూరంగా ఉన్నాను.
 
అలాంటిది, నా కుటుంబం, గురువు ప్రోత్సాహంతో మళ్లీ నాకిష్టమైన రంగంలో ప్రవేశించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. నాకు అత్యంత ఇష్టమైన నృత్య రంగంలోనే నాట్యాచార్యులుగా కొనసాగే అవకాశం దక్కడం గర్వంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఎవర్నీ నాకు ఫలానా హోదా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పటివరకూ నాకు వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా నా పనితనం, నిబద్ధత వల్ల పొందినవే.
 
 
 
విధి నిర్వహణ, కర్తవ్యం...
గతంలో నృత్యశాఖ విభాగాధిపతి బాధ్యతలు చేపట్టినా, ఆ తర్వాత టూరిజం స్టడీస్‌ డైరెక్టరుగా, లలితకళాపీఠం డీన్‌గా.. ఏ హోదాలో ఉన్నా, నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రయత్నించాను. ప్రతి ఏటా ప్రపంచ నృత్యోత్సవాలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాను. ఇన్నేళ్ల నా వృత్తి జీవితంలో ఇప్పుడు ఇదొక కొత్త కోణం. నా యూనివర్సిటీకి ప్రత్యేక సేవ చేసుకునే అవకాశం దక్కింది. ఇక్కడున్న ప్రతి విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు యూనివర్సిటీలోని అన్ని కోర్సులకు తగిన ప్రాచుర్యం కల్పించాలన్నది నా అభిమతం. విలక్షణమైన కోర్సులకు తగిన ప్రాచుర్యం కల్పించి, ఎక్కువ మంది విద్యార్థులు వాటిని అభ్యసించేవిధంగా ప్రణాళికలు రూపొందించాలనుకుంటున్నాను.
 
కళారంగానికి, పరిపాలనా విభాగానికి పొంతన ఉండదని పెద్దలు అంటారు. కానీ స్వతహాగా కళాకారిణైన నేను ఈ బాధ్యతలు చేపట్టడం సవాల్‌ లాంటిదే. సహజంగా కళాకారులు సున్నితత్వంతో మసులుకుంటారు. సున్నితంగా వ్యవహరించడమన్నది అన్ని సందర్భాల్లో పనికిరాకపోవచ్చు. కానీ నేటి సమాజానికి సున్నితత్వం చాలా అవసరం అని భావిస్తాను. ప్రస్తుతం పదిమంది పరిశోధనా విద్యార్థులకు గైడ్‌గా ఉన్నాను. వారిలో ఐదుగురు విద్యార్థులు ఇప్పటికే పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
 
‘రాణీ రుద్రమ’ కూచిపూడి నృత్యరూపకం అనలేదు...
ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఓరుగల్లు వీరవనిత ‘‘రాణీరుద్రమ’’ నృత్యరూపకాన్ని ప్రదర్శించడం ఆనందంగా ఉంది. అదొక అదృష్టంగా కూడా భావిస్తున్నాను. చరిత్రలో స్ఫూర్తిమంతమైన పాత్రపోషించిన మహిళల గురించి తెలుసుకోవాలి, వారి విశిష్టతను భావితరాలకు తెలియజెప్పాలన్నది నా కోరిక. రుద్రమ పోరాట పటిమ, ధైర్యసాహసాల గురించి నృత్యరూపకం ద్వారా ప్రజలకు చెప్పాలన్న కోరిక చాలా ఏళ్ల నుంచి నాలో ఉంది. రాజ్యాన్ని సక్రమంగా నడిపించడంతోపాటు, శత్రుసేనల్ని తిప్పికొట్టడం, రాజ్య క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ మాతృమూర్తిగా పాలన సాగించడంలో ప్రధాని భూమిక పోషించిన కాకతీయ వీర వనిత రాణీ రుద్రమ జీవితం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆ క్రమంలో రుద్రమ గురించిన అనేక అంశాలను, వెలుగులోకి వచ్చిన పలు విషయాలను తెలుసుకున్నాను. వాటన్నింటినీ అధ్యయనం చేసి... ‘రాణీ రుద్రమ’ నృత్యరూపకం రూపొందించాను.
 
మదిలోని ఆలోచన, వేదికపై ఆవిష్కృతమయ్యేందుకు రెండేళ్లు పట్టింది. వేదాంతం రామలింగశాస్త్రి రచన, కృష్ణవాస సంగీత దర్శకత్వంలో 25 మంది కళాకారులతో ఆ నృత్యరూపకాన్ని రూపొందించాను. కళ, రంగాలంకరణ, వస్త్రాలంకరణ వంటి వాటన్నింటినీ పరిశోధన చేసి, సాధ్యమైనంతవరకూ కాకతీయుల సంస్కృతి ప్రతిబింబించే విధంగా రూపొందించాం. నృత్యప్రదర్శనలో భాగంగా, కాకతీయుల చిహ్న ద్వారాన్ని వేదికపైకి తెచ్చేందుకే పదిమంది కళాకారులు మోయాల్సివచ్చింది. అందులోని ప్రతి సన్నివేశం ఓ ప్రత్యేకమైంది. అదంతా కళాకారుల సమష్టి కృషి ఫలితం.
‘రాణీ రుద్రమ’ కూచిపూడి నృత్య రూపకం అని నేను ఎక్కడా చెప్పలేదు. నేను అనుకున్న విషయాన్ని అందంగా, ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా పలు రకాల నృత్యరీతుల సమాహారంతో ఆ నృత్యరూపకాన్ని రూపొందించాను.
 
ఇప్పటి వరకూ ‘రాణీ రుద్రమ’ దేశవ్యాప్తంగా పది ప్రదర్శనలు ఇచ్చాం. ‘లకుమ’, ‘నాయకి’, ‘సత్యభామా విలాసం’, ‘అలిమేలు మంగావిలాసం’, ‘దుర్గాసుర సంహారం’, ‘ద్రౌపతి’, ‘చిత్రకూట మహత్యం’, ‘ఆండాల్‌ కళ్యాణం’ వంటి పలు పురాణ పాత్రల ఆధారంగా నృత్యప్రదర్శనలు రూపొందించి, ప్రదర్శించే అవకాశం నాకు లభించింది. అందులో విభిన్నమైన పాత్రలు పోషించే అదృష్టం నాకు కలిగింది.
 
ఇదీ నా కుటుంబం...
నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నా తల్లిదండ్రులు మార్గం నరసింగరావు, సుగుణలు ఎగ్జిబిషన్‌ సొసైటీ శాశ్వత గౌరవ సభ్యులు కూడా. మా అమ్మ ప్రముఖ రంగస్థల నటులు స్థానం నరసింహారావుగారితో కలిసి రేడియో నాటికలో నటించారు.
 
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, నా గురువు ఉమారామారావు. నా మెట్టినిల్లు కూడా భాగ్యనగరమే. వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మామయ్య పుంజాల శివశంకర్‌ ఇందిరాగాంధీ కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. నా భర్త వినయ్‌కుమార్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులు. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి శాశ్వత్‌ రాంశంకర్‌ న్యాయవాది వృత్తిలో ఉన్నారు. కోడలు సంజన కూడా న్యాయవాది. చిన్నబ్బాయి దేవాన్ష్‌ కృష్ణశంకర్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ జీవితంలో రాణిస్తున్నానంటే నా కుటుంబసభ్యులందించిన సహకారమే.
-వెంకటేశ్‌
ఫొటోలు: రాజేష్‌ జంపాల, నరసింహ