Dec 23 2017 @ 00:46AM

సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి

19వ శతాబ్ది తొలిపాదానికే తెలుగునాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన కారకులు. సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తిగారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, బహుశా తెలుగు వారికి త్యాగబ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను.‍‍
 
శివుడు డమరుకాన్ని మోగిస్తుంటే, విష్ణువు పెద్దడోలుని వాయిస్తుంటే, బ్రహ్మగారు తాళం వేస్తుంటే నర్తనం చివరి దశలో శివుని ఢక్క నుండి, నవపంచవారం– పద్నాలుగు దరువులున్న నాదం ఏర్పడింది. ఆ 14 దరువుల్నీ ఆకళింపు చేసుకున్న పాణిని మహాశయుడు ఒక్కో దరువు నుండి ఒక్కో అక్షరాన్ని సూత్రీకరించాడు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలు లేదా శివసూత్రాలు అన్నాడాయన.
 
నాదం నుండి వర్ణాలు (అక్షర సముదాయాలు) పుట్టాయి. నాదం నుండి స్వరాలు (సప్తస్వర సముదాయాలు) పుట్టాయి. సంగీత సాహిత్యాలకు మూలం నాదమే! త్యాగరాజస్వామిని నాదబ్రహ్మ అన్నారందుకే! ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం’’ అని కదా ఆర్యోక్తి. కృతి అనేది అటు సంగీతానికీ, ఇటు సాహిత్యానికీ వర్తించే పదం. సాహిత్య కృతులు, సంగీత కృతులు రెండింటిలోనూ సమాన ప్రతిభా సంపన్నత కలిగిన మహనీయులకు కర్ణాటక సంగీతంలో కొదవ లేదు.
 
తెలుగు భాష సంగీత ప్రధానమైందని ప్రపంచం అంతా అంగీకరించింది. కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టుగా నిలిచిన తెలుగు భాష భారతీయ ప్రాచీన సంగీత కళను ఇన్నేళ్లుగా నిలుపుకుంటూ వచ్చింది. సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది హిందుస్తానీ సంగీతంగా ప్రచారంలోకి వస్తున్న కాలంలో సంగీతమయమైన భాషా సౌలభ్యం కలిగిన తెలుగువారు తెలుగు, సంస్కృత భాషల్లో కృతులు, గీతాలు, వర్ణాలు, స్వరజతులు, జతిస్వరాలు, రాగమాలికలు ఎన్నింటినో వెలయిస్తూ అనేక నూతన రాగాలతో భారతీయ సంగీతాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. పదాలు, జావళీలు, తిల్లానాలు వంటివి వెలిశాయి. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తి ప్రభృతులు ఈ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేశారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, దాక్షిణాత్య యుగంలోనూ జరిగిన ఈ సంగీత పరిణామాల కారణంగా ఇది కర్ణాటక సంగీతం అయ్యిందని కొందరు, కర్ణపేయమైన సంగీతం కాబట్టి కర్ణాటక సంగీతం అని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. ఎవరైనా కర్ణాటక సంగీతం నేరవాలంటే తెలుగు భాష తెలిసి ఉండాలనే భావన సంగీత వేత్తల్లో ఉంది. త్యాగరాజాదుల రచనలు, రాగాలే ఇందుకు కారణం.
 
ఋషి కాలేనివాడు ‘కృతి’ రచన చేయలేడనేది కేవలం నమ్మకం కాదు, నిజం. గానవిద్యా గురుకులపతి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి గారు ఒక సంగీత ఋషి.. సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, తెలుగునాట త్యాగరాజ స్వామి వారి గురు శిష్యపరంపరకు ఆద్యులు. త్యాగరాజు సంగీత సంప్రదాయాన్ని ఆంధ్ర దేశానికి తీసుకువచ్చిన తొలి సంగీత విద్యాబోధకులు. వేదం, సంస్కృతం చదివారు. సంగీత, సాహిత్యాల అధ్యయనపరులు. అసమాన ప్రజ్ఞాధురీణులు. 16వ శతాబ్ది చివరి పాదంలో తమిళ దేశానికి తరలి పోవటానికి కారణాలు చారిత్రక మైనప్పటికి, తమిళ నేలమీద తెలుగు వారే పాలకులుగా ఉండటంతో ఎందరో లబ్ద ప్రతిష్టులైన పండితులు, సాహితీమూర్తులు వాగ్గేయకారులు, తెలుగు సారస్వతాన్ని చక్కగా పండించగలిగారు.
కృష్ణానది తీరంలోని పెదకళ్ళేపల్లి (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్ర్తి, లక్ష్మాంబ దంపతులకు దక్షిణామూర్తి శాస్ర్తి 1860లో జన్మించారు. స్వగ్రామంలోనే కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. సంగీతాన్ని మరింతగా అభ్యసించాలనే కోరికతో తంజావూరు కాలినడకన వెళ్ళి, అక్కడ త్యాగరాజ స్వామికి శిష్యులు, బంధువులైన మానాంబు చావడి వేంకట సుబ్బయ్య గారిని ఆశ్రయించారు. అనేక మెళకువలను నేర్చారు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి వీణ కుప్పయ్యర్‌, వారి కుమారులు ముత్యాలపేట త్యాగయ్య వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. పట్నం సుబ్రహ్యణ్య అయ్యర్‌, మహా వైద్యనాథ అయ్యర్‌, ఫ్లూట్‌ శరభశాస్ర్తి తంజావూరులో వీరికి సహాధ్యాయులు.
 
అనతికాలంలోనే సుసర్లవారు తమిళనాడులో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా ఎదిగారు. అక్కడి సంగీత ప్రముఖులు తంజావూరులోనే ఉండిపోవలసిందిగా కోరినప్పటికీ ఆయన స్వస్థలానికి తిరిగివచ్చి, త్యాగయ్య గారి సంగీత సంప్రదాయాన్ని తరువాతి తరం భావి సంగీత వేత్తలకు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
 
అనేకమంది శిష్యులకు గురుకుల పద్ధతిలో భోజన వసతులు ఏర్పాటుచేసి సంగీత విద్యాదానం చేశారు. ఆయన శిష్యుల్లో గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య, చల్లపల్లి సీతారామయ్య, చిట్టా పురుషోత్తమ శాస్ర్తి, రాజనాల వెంకటప్పయ్య, ద్వివేదుల లక్ష్మణశాస్ర్తి లాంటివారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులయ్యారు. సుసర్లవారి కుమారుడు కృష్ణబ్రహ్మం, ఆయన సోదరుని కుమారుడు సుసర్ల గంగాధరశాస్ర్తి కూడా ప్రసిద్ధ సంగీతవేత్తలే!
 
సద్గురు శ్రీ త్యాగరాజస్వామి, వారి శిష్యుడు మానాంబుచావడి వెంకట సుబ్బయ్య, వారి నుండి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి, వారి శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి శిష్యుల్లో ప్రముఖులైన డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరినాగభూషణం, అన్నవరపు రామస్వామి, నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచారి, నేతి శ్రీరామశర్మ, దాలిపర్తి పిచ్చిహరి ఇలా ఐదు తరాల పాటు సంగీత గురుశిష్య పరంపర కొనసాగుతోంది. సినీ సంగీత ప్రపంచంలో సుసర్లగా ప్రసిద్ధులైన సుసర్ల దక్షిణామూర్తి వీరి మనుమడే! తాత మనుమలిద్దరూ ప్రసిద్ధ సంగీత విద్వాంసులే కావటంతో తాత సుసర్ల, మనుమడు సుసర్లగా విశ్లేషికులు వ్యవహరిస్తుంటారు.
 
19వ శతాబ్ది తొలిపాదానికే తెలుగునాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన కారకులు. బహుశా సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తిగారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, తెలుగు వారికి త్యాగబ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను.
 
కారణ జన్ముడైన ఒక్కో మహానుభావుడు ఒక్కో ప్రయోజనాన్ని నెరవేర్చటానికి అవతరిస్తారు. తెలుగు నేలపైన నిజాం పాలనలో సారస్వత శూన్యం ఏర్పడిన కాలంలో త్యాగబ్రహ్మ తంజావూరు రాజ్యంలో మరాఠా ప్రభువుల ఏలుబడిలో ఉన్న కాలంలో అవతరించి సంగీత శాస్ర్తాన్ని సుసంపన్నం చేశారు. త్యాగయ్య గారి తరువాత ఓ ఐదారు దశాబ్దాల పాటు త్యాగరాజ కీర్తనలు మరుగునపడిపోతుండగా, వృద్ధాప్యంలో ఉన్న త్యాగరాజు వారి శిష్యులను ఆశ్రయించి, వారి నుంచి నేరుగా సంగీత విద్యను పొంది ఆ మహావిద్యను తెలుగు నేలమీదకు తీసుకువచ్చి ప్రతిష్టించిన సుసర్ల వారికి తెలుగు జాతి రుణపడి ఉంది. 1917 భాద్రపద మాసంలో సుసర్లవారు స్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి తరువాత వారి శిష్యులూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది వారి 100వ వర్ధంతి. ఈ సందర్భంగా పెదకళ్ళేపల్లి గ్రామంలో వారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయటం, సంగీత ప్రపంచానికి వారు చేసిన సేవలను సంస్మరించుకోవటం వారికి నిజంగా ఇవ్వదగిన నివాళి.
డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి
(డిసెంబర్‌ 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతులమీదుగా సుసర్ల వారి విగ్రహావిష్కరణ)