desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 22 2017 @ 01:37AM

దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  • ‘గాలి రంగు’ కవితా సంకలనానికి పురస్కారం
  • వెన్నా వల్లభరావుకు అనువాద పురస్కారం
 
 
ఏటిని నిట్టనిలువుగా నిలబెడతా
నిప్పును నీటితో మండిస్తా
ఏనుగును తొండం మీద నడిపిస్తా
ఎవరె్‌స్టను చపాతీలా చదును చేస్తా
ఎవరూ చేయలేనిది ఇంకొకటీ చేస్తా
నేను గాలికి రంగులేస్తా... - దేవిప్రియ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 21(ఆంధ్రజ్యోతి)- ప్రముఖ కవి, సాహితీవేత్త. జర్నలిస్టు, సినీ రచయిత దేవిప్రియకు 2017 వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘‘గాలి రంగు’’ పేరిట ఆయన రచించిన కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు గురువారం నాడు ప్రకటించారు. పంజాబీ రచయిత్రి అజిత్‌ కౌర్‌ ఖానాబదోష పేరిట రచించిన ఆత్మక థను తెలుగులో ‘‘విరామమెరుగని ప్రయాణం’’ పేరుతో అనువదించిన రచయిత వెన్నా వల్లభరావుకు 2017 సంవత్సరానికి అనువాద పురస్కారం లభించింది. 24 భాషల్లో మూల రచయితలకు, అనువాద రచయితలకు ఒకే సారి పురస్కారాలు ప్రకటించడం ఇది మొదటి సారి. ఈ సారి ఏడు నవలలకు, అయిదు కవితా సంపుటాలకు, అయిదు కథా సంకలనాలకు, అయిదు సాహిత్య విమర్శగ్రంథాలకు, ఒక నాటికకు, ఒక వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. దేవిప్రియ అసలు పేరు షేక్‌ ఖ్వాజా హుస్సేన్‌... ఆయన సాహితీ వ్యాసంగం అంతా దేవి ప్రియ పేరుతోనే సాగింది. బాల్యం నుంచే ఆయన కవితలు, గేయాలు, పద్యాలు రచించేవారు. 1951 ఆగస్టు 15న గుంటూరులో పుట్టిన ఆయన గత అయిదు దశాబ్దాలుగా హైదరాబాద్‌ లోనే స్థిరపడి పలు ప్రక్రియల్లో రచనలు చేసి లబ్ధ్దప్రతిష్ఠులయ్యారు. ఆయన అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం మొదలైన 12 పుస్తకాలు రచించారు. రెండు దశాబ్దాల క్రితం ఆయన సంపాదకత్వం వహించిన ప్రజాతంత్ర ఉత్తమ సాహితీపత్రికగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌ మిర్రర్‌ అనే పత్రికకు కూడా ఆయన సంపాదకుడుగా వ్యవహరించారు. ఉదయం, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆయన రన్నింగ్‌ కామెంటరీ పేరిట మొదటి పేజీలో రాసిన 8 లైన్ల కవితలు పాఠకుల నోళ్లలో నానేవి. అనేక సినిమాలకు ఆయన పాటలు రాశారు. ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత నర్సింగరావుతో కలిసి మా భూమి, రంగుల కల, దాసి మొదలైన సినిమాలకు పనిచేశారు. గూడ అంజయ్యతో కలిసి ఆయన రంగుల కల సినిమాలో జై జమ్మల్‌ మరీ, వెయి కాళ్లా జెర్రీ పాట ఎంతో జనాదరణ పొందింది. ఈ పాటను గద్దర్‌ పాడారు. గద్దర్‌పై ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. నాకు రెండు నిధులున్నాయి.. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం, నిత్య నిబద్ధం అని తన గురించి స్వగతం చెప్పుకున్నారు దేవిప్రియ. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి శిష్యుడైన ఆయన- ప్రాచీన, నవీన కవిత్వ పోకడలను ఆకళింపు చేసుకున్నారు. దిగంబర కవిత్వంలోని అశ్లీలతను వ్యతిరేకిస్తూ- పైగంబర కవిత్వం అనే శుద్ధకవితామార్గాన్ని కొన్నాళ్ళు అనుసరించారు. మహాకవి శ్రీశ్రీ అనంతం రాయడానికి కూడా ఈయన ప్రోద్బలమే కొంతవరకూ కారణమంటారు. 2011లో గాలిరంగు వెలువరించారు. అత్యంత సహజంగా రాసే దేవిప్రియ- లిమరిక్కుల్లాంటి పంక్తులతో కవితాక్షేత్రాన్ని సుసంపన్నం చేశారు.
 
అనువాదంలో దిట్ట
అనువాద పురస్కారం పొందిన వెన్నా వల్లభరావు 35 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో వివిధ కళాశాలల్లో హిందీ విభాగం అధిపతిగా, అధ్యాపకుడుగా పనిచేసి పదవీవిరమణ చేశారు 15 కుపైగా అనువాద గ్రంథాలు, మూల రచనలు చేశారు.
ఇదో మైలురాయి: దేవి ప్రియ
హైదరాబాద్‌: సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల దేవిప్రియ సంతోషాన్నీ, సంతృప్తినీ వ్యక్తం చేశారు. ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం నా సాహితీ ప్రయాణంలో ఓ మైలురాయి లాంటిది..ఈ అవార్డు ఇచ్చినందుకు అకాడమీ వారికి కృతజ్ఞతలు అన్నారు దేవిప్రియ. అవార్డు లభించాక ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. గాలి రంగు గురించి మాట్లాడుతూ- గత 15-20 సంవత్సరాలుగా నేను ఒక శైలిలో, ఓ సంవిధానంలో రాస్తున్న కవితా స్రవంతికి కొనసాగింపే గాలి రంగు. ఇది నా ఫిలాసఫీ ఆఫ్‌ లైఫ్‌. నా శైలి విశిష్టమైనది కాదో, అది ఎంత ఉత్తమమో తేల్చాల్సినది విమర్శకులు. నేను ఈ కవితా ధారను కొనసాగిస్తాను. గాలిరంగు తర్వాత నేను మరో రెండు పుస్తకాలు రాశాను. అరణ్య పురాణం కూడా అందులో ఒకటి. గాలి రంగు ను నా అత్యుత్తమమైన కవితా సంపుటి అని చెప్పను. నా కవిత్వంలో అదో దశ మాత్రమే. ఇంకా బాగా రాయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను..’’ అని అన్నారు దేవిప్రియ.