Dec 17 2017 @ 22:48PM

ఒక కొన్ని పద్యాల విమలత్వం

విమలకు ఇతివృత్తం మాత్రమే కవిత్వమనే ఉద్యమ భ్రమ లేదనుకుంటాను. అంతకుమించిన ‘‘అనుభవానికి’’ విలువ ఇవ్వడం ఆమె ప్రత్యేకత. నినాదాల్ని మించి,
జీవితాన్ని ప్రేమించగల వాళ్లే ఈ పని చెయ్యగలరు.
 
ఒక వ్యక్తి తన ఉద్విగ్నతల నుంచి, ఆదర్శ ప్రయాణాల నుంచి, ఆవేశాల నుంచి, ఆక్రోశాల నుంచి కోలుకొనే ప్రయత్నంలో-- వాక్యాలుగా పరిణ మించడమే-- బహుశా కవిత్వమవుతుంది. ప్రతి అనుభవం మన జ్ఞాపకాలలో నిలవనట్టే, ప్రతి వాక్యం కవిత్వంగా పరిణమించదనేదీ నిజమే. అభ్యుదయం పేరిట, విప్లవం పేరిట, అనుభూతి పేరిట, కేవలం ‘కవిత్వ’మనుకుంటూ ఎడతెరిపిలేకుండా వాక్యాలు రాసుకుంటూపోయే వాళ్లకి ఎప్పుడూ లోటు లేదు. నిజమాలోచిస్తే-- కవిత్వ వ్యవహారం, అంత తేలికైన విద్య కాదు. ఒక అనుభవం కలగడమే అపురూపం. అగ్ని గుండాల్లోంచి నడిచినా; గాయాల నెత్తురోడ్చినా; వానలో, వరదలో, వెన్నెల రాత్రుల్లో, ఆత్మీయుల ప్రేమలో, వాళ్లని కోల్పోయిన వేదనలో, సుడితిరిగినా-- ఇదంతా వ్యక్తిగత వ్యవహారం. వెంటాడే అనుభవాన్ని ఒడిసిపట్టుకుని, వాక్యాలుగా ఒదిగించడం అంటే-- మామూలు కాదు. కవి, గాఢమైన-- ఊపిరాడనివ్వని-- ఒక అనుభవాన్ని, తన కవితలో పునర్జీవిస్తాడు. సూక్ష్మంగా ఇదీ ప్రక్రియ.
 
రచనా వ్యాసంగం గురించి ఎప్పుడాలోచించినా గుడిపాటి వెంకట చలంగారి వాక్యాలు గుర్తుకొస్తుంటాయి: ‘‘బాధ పడాలి. నలగాలి, జీవిత రథచక్రాల కింద; కలంలోంచి నెత్తురు ఒలకాలంటే-- అక్షరాలా? పాండిత్యమా?-- కాదు-- సంవత్సరాల మూగవేదన.’’
నిజమే, మేలైన ఏ కవిత్వం చదివినా దశా విశేషాల్లో అంతరువులు ఉండవచ్చునేమో కాని, అంటువంటి వేదన ఏదో చదువరికి కలుగుతుంది; కలగాలి. కవిగా-- విమల కవిత్వం చదువుతున్నప్పుడు అటువంటి వేదన అనుభవించాను. ఇక్కడ ‘‘వేదన’’ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది వట్టి ‘‘జాలి’’ని ప్రేరేపించే మాట కాదు. తన ఉద్యమ సంకల్పంతో, నెత్తురు దారుల్లో నడిచి,-- ఎన్నో ఆశించి,-- తన్ను తను నిలబెట్టుకొనే ప్రయత్నంలో అనుభవించిన క్షణాల ‘‘వేదన’’. తన్ను తాను చెదిరిపోకుండా సాగించిన ‘‘మృగణ’’-- అనగా-- అన్వేషణ.
 
విమల కవిత్వంలో ప్రధాన లక్షణం ఆమె అనుభవాల గాఢత. రెండవది: ఆమెను ఆవరించిన ఏకాంతత. మరో విశేషం: స్మృతులను ఎంతగా నెమరువేసుకున్నా, వాటిల్లో భంగపాట్ల తలపోతలు, పశ్చాత్తాపాలూ ఉండవు. కోల్పోయిన ఆత్మీయుల పట్ల తనివి తీరని ఇష్టం కనిపిస్తుంది.
 
‘‘చీకటి ఆకాశాన మెరిసే/ ఇన్నిన్ని నక్షత్రాలలో మీరెవరు?/ మా కన్నీళ్లు తుడిచేందుకు మృత్యువును స్వచ్ఛందంగా ముద్దాడిన మీరెక్కడ?/ అకాల మర ణాన్ని వరించిన/ నా ప్రియ సహచరుల జాడల్ని వెతుక్కుంటూ/ ఈ రాత్రి చెప్పరాని నిరాశతో/ దుఃఖంతో, క్రోధంతో, ఆకాశాన్ని ఎలుగెత్తి పిలుస్తాను.’’
 
తను ఎన్నుకున్న మార్గం ఎంతటి కంటకభూయిష్ఠమో, నష్టం ఎంత కలవరపరుస్తుందో ఆమెకు తెలుసు: ‘‘యుద్ధంలో/ అనివార్య మరణాల శవయాత్రలు తప్పవు/ ఏ చేదు చీకటి రాత్రో/ నీ శాశ్వత వీడ్కోలు వార్తను/ ఎవరు నిర్దాక్షిణ్యంగా ప్రకటిస్తారో కదా/ చలన రహిత శరీరాల్ని ఊహించడం కష్టం/ నాకసలిష్టం లేదు/ నీకు నేనెన్నటికీ ఆఖరి వీడ్కోలు చెప్పను.’’
 
ఆమె ఎప్పుడూ ఎవరి జాలినీ ఆశించదు. తన్నుతాను కూడదీసుకొని నిలబడే ప్రయత్నాన్ని తన కవిత్వం ద్వారా చేస్తుంది. తన సంకల్పాలలో ఆమెకెంత పట్టుదలో, ‘చేదుపాట’ అనే కవిత పూర్తిగా చెబుతుంది. ఈ చెప్పడంలో వ్యంగ్యం వుంది; ఆక్రోశం వుంది; చరిత్ర చీకటి నీడలున్నాయి. వాక్యాలకొక విద్యుత్‌ స్పర్శ వుంది. ముగింపులో మరికాస్త నినాద స్పర్శ కూడా ఉంది.
 
‘‘అసలు మనం బయలుదేరింది/ కన్నీటి సముద్రాల్ని తగులబెట్టేందుకు కద/ అసలు మనం ఆయుధాలు ధరించింది/ సకల అమానవీయ విలువల విధ్వంసానికి కద/ అసలు మన స్వప్నాలన్నీ/ ఒక అద్భుత పునఃసృష్టికై కద/ మనపై పొరలుపొరలుగా పేరుకున్న సకల కల్మషాల్నీ/ దయచేసి ఇకనైనా కడుక్కుందాం పదండి/...’’ ఈ పద్యంలో ఆక్రోశం వెనుక బలమైన ఉద్యమ దీక్ష ఉంది. ఈ పద్యంకంటే గాఢంగా-- తీవ్రమైన వ్యంగ్యంతో పాటు-- ఒక్కింత దిగంబరావేశం కూడా కనబడుతుంది ‘దిగంబరుల ఊరేగింపు’ అనే పద్యంలో. స్త్రీత్వ అవమానాగ్ని స్పర్శ మండుతుంది: ‘‘... ఏ విషాద విభాత సంధ్యలోనో/ మనం తల్లి హక్కుని కోల్పోయాం/ మన స్వరాలను, స్వప్నాలను, ఆయుధాలను కోల్పోయాం/ మన చరిత్రంతా శ్రమ పరాయీకరణల చరిత్ర’’ అంటూ మగ మహారాజుని, సాచి లెంపకాయ కొడుతుంది.
 
ఇంతటి తీవ్ర స్వరం వినిపించగల విమల తన ఐకాంతికతలో, ప్రకృతి ప్రేమలో, తలపోతల సున్నిత క్షణాలలో అచ్చంగా అనుభవమై కరిగిపోతుంది. ఇటువంటి పద్యాల్లో ‘తెల్లవారని రాత్రి’, ‘కళాకారులు’, ‘తెలియదు మరి’, ‘శూన్యస్వప్నం’, ‘ప్రేమ’, ‘నేనొక్కతినే ఇక్కడ’, ‘ఓ నా ప్యారీ జాన్‌’- విశేషంగా చెప్పదగినవి. ఇవి బాహ్య జీవిత లక్ష్యాల పోరాటాల్ని మించిన, ఆంతరిక స్వగతాలు. యీ ప్రతి పద్యంలోనూ దిగులు కాదు; తన్ను తాను జారిపోకుండా నిలుపుకొనే స్వస్థత మనల్ని ఆకర్షిస్తుంది.
‘‘శీతాకాలపు ఉదయపు నీరెండలో/ పచ్చటి చెట్ల పైనుండి/ కిలకిలారావాలతో ఒక్కసారిగా/ పైకెగిరిన పక్షుల గుంపులు/ బహుశా, ఏ అనాచ్ఛాదిత ఆకాశం క్రింది/ బీడుభూముల మీదో/ అవి విత్తనాలు చల్లుతాయేమో/ బహుశా, కూలిన ఆకాశమల్లెలతో సహా/ సతత హరితారణ్యాలు మళ్లీ అల్లుకుంటాయేమో’’. దృశ్యానుభవాన్ని ఎంతగా లోపలకు పీల్చుకుని అక్షరాలతో కవిత్వపు బొమ్మకట్టగలదో యీ కవి!-- ‘ఒక ప్రయాణం - రెండు దృశ్యాలు’ కవిత నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది. కవిగా విమల ఉద్యమ సంకల్పంతో పాటు కవిత్వగాఢత కూడా ప్రదర్శించే సున్నితమైన రచన ‘ఈ కాసిన్ని పద్యాల కోసం’-- అనేది: ‘‘ఈ కాసిన్ని పద్యాల కోసం/ ఎన్నిమార్లు నన్ను నేను/ నెత్తురొలికేలా గాయపరుచుకున్నానో కదా/ ఈ కాసిన్ని పద్యాల కోసం/ ఎన్నిమార్లు నేను/ కన్నీటి జడుల మధ్య తడిసానో కదా/ ఈ కాసిన్ని పద్యాల కోసం/ ఉన్మత్త ఆవేశంతో/ ఎడతెగని మోహంతో/ జీవితంతో ఎంత పోరాడానో కదా/ శ్రమజీవి చెమట చుక్కలో/ చివరకు నా పాట/ ప్రతిధ్వనించింది’’.
 
విప్లవ కవులుగా ప్రసిద్ధులైన కవి పరంపరలో నాకు ఇద్దరి కవిత్వ ప్రకటన రీతి చాలా ఇష్టం. ఒకరు శ్రీ శివసాగర్‌. రెండవ వ్యక్తి విమల. విమలకు విశేషించి- ఇతివృత్తం మాత్రమే కవిత్వమనే ఉద్యమ భ్రమ లేదనుకుంటాను. అంతకుమించిన ‘‘అనుభవానికి’’ విలువ ఇవ్వడం ఆమె ప్రత్యేకత. నినాదాల్ని మించి, జీవితాన్ని ప్రేమించగల వాళ్లే ఈ పని చెయ్యగలరు.
 ఇంద్రగంటి శ్రీకాంతశర్మ