
- ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా రూట్లో అమలు
- మెట్రో నగరాల మధ్య ప్రయాణ వేగం 160 కి.మీ.!
- 2022 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు
- సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం
న్యూఢిల్లీ, నవంబరు 30: వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా విజయవంతమైన ప్రాజెక్టు స్వర్ణ చతుర్భుజీ. ఈ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నేషనల్ హైవేల రూపు రేఖలే మారిపోయాయి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఊతం ఇచ్చేలా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నాలుగు నగరాలను కలుపుతూ వేసిన జాతీయ రహదారులు, మరెన్నో ప్రముఖ నగరాలను ఈ లింక్‌లో కలిపాయి. ఇప్పుడు ఇదే స్వర్ణచతుర్భుజిని రైల్వే విభాగంలోనూ ప్రవేశపెట్టబోతోంది కేంద్రప్రభుత్వం. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాలను కలుపుతూ రైల్వేలో స్వర్ణ చతుర్భుజి రాబోతోంది. దీనిద్వారా భారతీయ రైళ్ల వేగాన్ని పెంచడంతోపాటు ప్రధానమైన నాలుగు మెట్రో నగరాల మధ్య సెమీ హైస్పీడ్ ట్రాక్ వేస్తారు. ఈ మార్గంలో 2022 ఆగస్టు నాటికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెడతారు.
ఈ నాలుగు మెట్రో నగరాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన రైళ్ల వేగం గంటకు 88 నుంచి 90 కిలోమీటర్లగా ఉంది. వేగం డబుల్ అయితే... ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం 10వేల కిలోమీటర్ల సెమీ హైస్పీడ్ రూట్ ఏర్పాటు చేస్తారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. అది కారణం కాకపోయినా ఈ ప్రాజెక్టును అదే ఏడాది ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని చూస్తోంది. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-చెన్నై, చెన్నై-హౌరా, చెన్నై-ముంబై, హౌరా-ముంబై మార్గంలో అమలు చేసే ఈ ప్రాజెక్టు బ్లూ ప్రింట్ తయారు చేయడానికి నవంబరు 28న జరిగిన రైల్వే బోర్డు సమావేశం ఓకే చెప్పింది. దీనికి నీతి ఆయోగ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర కేబినెట్ ఆమోదమే మిగిలి ఉంది. 2017-18 వార్షిక బడ్జెట్లో ఢిల్లీ-ముంబై రూట్‌కి రూ.11,189 కోట్లు, ఢిల్లీ-హౌరా రూట్‌కు రూ.6,975 కోట్లు కేటాయించారు.
మిగతా నాలుగు రూట్లకు సంబంధించిన అంచనా వ్యయం 2018-19 బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టయ్యే వ్యయాన్ని ఈ ఏడాది చివరి కల్లా అంచనా వేసే పనిలో రైల్వే బోర్డు ఉంది. రైల్వే వర్గాల కథనం ప్రకారం ఇంకో రూ.36 వేల కోట్లు అవసరం అవుతుందని తెలుస్తోంది.