
- 2009లో కేసీఆర్ నిరసన
- కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం
- సబ్‌జైలుకు తీసుకొచ్చిన పోలీసులు
ఖమ్మంటౌన్: కేసీఆర్ అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు నిరవధిక నిరాహారదీక్ష చేపడతారనే వార్తలు ప్రజలను ఉద్విగ్నంలో ముంచాయి. కరీంనగర్లో కేసీఆర్ దీక్ష చేపట్టగానే అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం అంతగాలేని ఖమ్మం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ను ఖమ్మానికి తీసుకు వస్తున్నారనే వార్త తీవ్ర ఉద్విగ్నం.. ఉత్కంఠ.. ప్రజల్లో ఉత్తేజం.. కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తీసుకురావడమే తెలంగాణ ఉద్యమ స్వరూపమే మారిపోయింది. తెలంగాణ చరిత్రలో ఖమ్మంకు సుస్థిరస్థానం లభించింది. కేసీఆర్ దీక్షకు బుధవారంతో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. నవంబరు 29, 2009 లో తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ దీక్షను భగ్నంచేసి ఆయనను అరెస్టుచేసి రాత్రి వేళలో ఖమ్మం సబ్‌జైల్‌కు తరలించింది. నవంబరు 29, 30 తేదీలలో ఖమ్మం సబ్‌జైలులో కేసీఆర్‌ను ఉంచారు. అక్కడ నిరాహారదీక్ష చేపట్టడంతో 30వతేదీ రాత్రి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రస్తుత మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ రావడంతో వారిని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద అరెస్టు చేసి ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ఉద్యోగులు, ఎన్డీ నాయకులు, సీపీఐ నేతలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరింది.