Nov 10 2017 @ 02:17AM

ఒగ్గుకళ ‘చుక్క’ అస్తమయం

  • అనారోగ్యంతో చుక్క సత్తయ్య కన్నుమూత..
  • మూగబోయిన ఒగ్గుకళా లోకం
  • సీఎం కేసీఆర్‌ సహా నేతల సంతాపం
జనగామ/హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఒగ్గు కళ ‘చుక్క’ వెలుగు కోల్పోయింది. ఒగ్గు కళారంగం మూగబోయింది. ఒగ్గు కళ దిగ్గజం, ఒగ్గుబీర్ల ఆదిగురువు చుక్క సత్తయ్య (86) కన్నుమూశారు. గురువారం జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని తన స్వగ్రామం మాణిక్యాపురం గ్రామంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా చుక్క సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు మాధుర్యాన్ని, తెలంగాణ కళారంగం గొప్పతనాన్ని ఒగ్గుకథ రూపంలో దేశ విదేశాల్లో చాటిచెప్పిన చుక్క సత్తయ్య తన జీవితాన్నంతా ఆ కళకే అంకితం చేశారు. అనేక కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. మాణిక్యాపురం గ్రామంలో 1931 జూన్‌ 30న చౌదరిపల్లి ఆగయ్య, సాయమ్మ దంపతులకు రెండో సంతానంగా చుక్క సత్తయ్య జన్మించారు.
 
13 ఏళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించారు. పెద్ద బాలశిక్ష మాత్రమే చదువున్న సత్తయ్య.. ఒగ్గుకథ కళారంగంలో దిగ్గజంగా వెలుగొందారు. మల్లన్న కథ, బీరప్ప కథ, ఎల్లమ్మ, నల్లపోచమ్మ, కీలుగుర్రం, మాందాత, అక్కమాంకాళి, అల్లిరాణి, కనకతార, ఐదు మల్లెపూలు, సమ్మక్క, మండోదర, ఇపురాపురి పట్నం కథ, బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర లాంటి అనేక కథలను ఒగ్గు కళారూపంలోకి మలిచి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
 
సత్తయ్య ప్రదర్శించిన ఒగ్గుకథలన్నీ విశేష ప్రాచుర్యం పొందాయి. గ్రామీణ ప్రజలను చైతన్యపరిచే కళారూపాలనూ సత్తయ్య ప్రదర్శించారు. విద్య ఆవశ్యకత, కుటుంబ నియంత్రణ, వరకట్న దురాచారం వంటి అంశాలపై తనదైన శైలిలో ఒగ్గుకథలు చెబుతూ చైతన్యవంతం చేశారు. మొత్తంగా 12 వేలకు పైగా కళాప్రదర్శనలు ఇచ్చిన చుక్క సత్తయ్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దాకా ఎంతో మంది మహామహుల చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నారు.
 
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పురస్కారాన్ని పొందారు. తెలంగాణ భాషా సాంస్కృతిక విభాగం ‘ఒగ్గు చుక్క’ పేరుతో సత్తయ్యపై డాక్యుమెంటరీని రూపొందించింది. చౌదరిపల్లి సత్తయ్యకు నుదురు భాగాన తెల్లటి వెంట్రుకలు చుక్కలా ఉండటంతో ఆయన పేరు చుక్క సత్తయ్యగా స్థిరపడిపోయింది. కాగా చుక్క సత్తయ్య మరణ వార్తను విన్న కళాభిమానులు, ఆయన శిష్యలోకం దుఃఖసాగరంలో మునిగిపోయింది. సత్తయ్య అంత్యక్రియలను శుక్రవారం ఆయన స్వగ్రామం మాణిక్యాపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్తయ్యకు కుమారులు అంజయ్య, శ్రీశైలం, కుమార్తె పుష్ప ఉన్నారు.కాగా చుక్క సత్తయ్య మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.
 
తెలంగాణతోపాటు యావత్‌ దేశం గర్వించదగిన కళాకారుడిగా చుక్క సత్తయ్య ప్రపంచ ఖ్యాతినార్జించారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చుక్క సత్తయ్య మృతి ఒగ్గు కళారంగానికి తీరని లోటు అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. సత్తయ్య మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.