
- తొలిసారి తెలుగు కవిని వరించిన కబీర్సమ్మాన్ అవార్డు
- ఈ నెల 10న భోపాల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు కవి, సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కె. శివారెడ్డి సాహిత్య కృషికిగానూ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘‘కబీర్ సమ్మాన్’’ వరించింది. ఈ నెల 10న భోపాల్‌లో జరిగే సాహిత్య సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడం విశేషం. మొదటిసారి తెలుగుల కవిని ఈ అవార్డు వరించడంతో తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ‘ఆరు దశాబ్దాలుగా కవిత్వమే జీవితంగా బతుకుతున్న కె. శివారెడ్డికి కబీర్ సమ్మాన్ అవార్డు దక్కడం తెలుగు కవులందరికీ నిజమైన పండుగ’’ అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి కొనియాడారు. శివారెడ్డికి బీసీ ప్రణాళిక సంఘం సభ్యులు, ప్రముఖకవి జూలూరి గౌరీశంకర్ అభినందనలు తెలిపారు.
శివారెడ్డి ప్రస్థానం
కె.శివారెడ్డి సుప్రసిద్ధ వచన కవి. 1943 ఆగస్టు 6న గుంటూరు జిల్లాలోని కార్మూరివారిపాలెంలో జన్మించారు. కూచిపూడిలోని హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ దాకా చదివారు. తెనాలిలోని వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో పీయూసీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. చదివారు. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో లెక్చరర్‌గా పనిజేసి 1999లో ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశారు. ‘వేకువ’ అనే త్రైమాసిక పత్రికకు సంపాదకునిగానూ వ్యవహరించారు.
2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారత్ తరఫున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరిగా విదేశాలకు వెళ్లి వివిధ సమావేశాల్లో కవిత్వం వినిపించారు. తన కవిత్వానికి.. వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించారు. ఆయన కవితలు సామాజిక అంశాల్ని కవితాబద్ధం చేస్తాయి. కెరీర్లో అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులతో పాటు 1974లో శివారెడ్డి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, 1990లో ‘మోహనా.. ఓ మోహనా’ కవితా సంకలానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.