Oct 31 2017 @ 04:27AM

‘సభా’గస్వామ్యం

  • తెలుగు మహాసభల కోసం
  • సాంస్కృతిక సంస్థల సలహాలు: కేవీ రమణాచారి
  • తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు మహాసభల లోగోలు విడుదల
హైదరాబాద్‌, రవీంద్రభారతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో విశేష అనుభవం గల సంస్థలతో పాటు ఔత్సాహిక వర్త్తమాన సంస్థలనూ భాగస్వాములను చేయాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. మహాసభల నిర్వహణ కోసం రాష్ట్రంలోని సాహిత్య, సాంస్కృతిక, కళారంగ సంస్థల సూచనలు, సలహాలను స్వీకరించేందుకు పలువురు ప్రముఖులతో సోమవారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డితో కలిసి రమణాచారి సమావేశం నిర్వహించారు. రమణాచారి మాట్లాడుతూ.. సభలను విజయవంతంగా నిర్వహించడంలో సాహిత్య, సాంస్కృతిక సంస్థల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలను తాము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య అకాడమీ, ప్రపంచ మహాసభల తుది లోగోలను ఆయన విడుదల చేశారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, కళావైభవానికి అద్దం పట్టే రీతిలో జరిగే సభలకు సాహిత్య, సాంస్కృతిక, కళారంగ సంస్థలు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలుగు మహాసభల నిర్వహణ పండుగ వాతావరణాన్ని తలపించేలా నిర్వహించేందుకు సాంస్కృతిక, సాహిత్య సంస్థలు తోడ్పడాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ.. తెలుగు మహా సభల నేపథ్యంలో గ్రంథాలయ వారోత్సవాలను మాసోత్సవాలుగా నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక కళా సంస్థల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి పలువురు ప్రముఖులు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సమావేశంలో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.