Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 31 Oct 2017 04:22:37 IST

పురోహితులు మారారు!

పురోహితులు మారారు!

  • పందిళ్లలో బ్రాహ్మణేతర పౌరోహిత్యం
  • విశ్వబ్రాహ్మణుల నుంచి ఎక్కువగా
  • శతాబ్దంక్రితమే కోస్తాంధ్రలో నాంది
  • రాజధానిలో జోరుగా సంప్రదాయం
  • పెళ్లి పద్ధతుల్లోనూ కొత్త పోకడలు
తెనాలి, అక్టోబరు 30 : కేరళలోని మణప్పురం శివాలయంలో పూజారిగా దళితుణ్ణి నియమించడం అందరినీ ఆలోచింపజేసింది. అలాగే, మరో 35 మంది బ్రాహ్మణేతర సామాజికవర్గాలకు చెందినవారికీ దేవాలయాల పురోహితులుగా అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, బ్రాహ్మణేతర పౌరోహిత్యం అనేది తెలుగు నేలకు కొత్త విషయం కాదు. దాదాపు శతాబ్దం క్రితమే మొదలయి, నేటికీ కొనసాగుతోంది.
ఈ మార్పు కేవలం పెళ్లిళ్లు జరిపించే సామాజికవర్గాలను పెంచడంతో ఆగిపోలేదు. పెళ్లి క్రతువులు, మంత్రాల నుంచి, ఆ సమయంలో ధరించాల్సిన ప్రత్యేక దుస్తుల దాకా ప్రతిదానినీ మార్చేసింది.
 
ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంతో ఈ సంప్రదాయం బాగా వేళ్లూనుకొంది. దీనికోసం తెనాలిలో ప్రత్యేకంగా వేద పాఠశాల ఏర్పాటయింది. పెళ్లి మంత్రాలను, పందిట్లో పాటించాల్సిన నియమాలను ఈ పాఠశాలలో నేర్పిస్తున్నారు. బ్రాహ్మణుల తరువాత ఎక్కువగా పెళ్లి మండపాల్లో ఈనాడు విశ్వ బ్రాహ్మణులు కనిపిస్తున్నారు. ఆ తరువాత నాయీ బ్రాహ్మలు, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారు పౌరోహిత్యంలో కొనసాగుతున్నారు.
 
పొన్నూరులో తొలి మంత్రం
గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు పూనికతో తెలుగు నేలను సంస్కరణ ఉద్యమం ఊపేసింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం ఈ ఉద్యమానికి ఊతమిచ్చింది. త్రిపురనేని రామస్వామిచౌదరి, గుడిపాటి వెంకటచలం, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కొండవీటి వెంకటకవి (కళాప్రపూర్ణ) తదితరులు బాలికా విద్య, వితంతు పెళ్ళిళ్లు వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. అయితే, వితంతువులను పెళ్లాడటానికి యువకులు ముందుకొచ్చినా, పెళ్లి జరిపించడానికి బ్రాహ్మణులు వెనుకాడేవారు. దీంతో.. త్రిపురనేని రామస్వామి చౌదరి.. బ్రాహ్మణేతర పౌరోహిత్య సంప్రదాయాన్ని ముందుకు తెచ్చారు.
 
ఈ బాటలో నడిచిన తొలి సంస్కర్తగా గుంటూరుజిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన పిన్నమనేని సోమయ్యవర్మ నిలిచారు. ఆయనది కమ్మ సామాజికవర్గం. సోమయ్యవర్మ 1936లో వితంతువును వివాహమాడారు. ఆ సమయంలో పెళ్లి జరిపించే బ్రాహ్మణుల సహాయ నిరాకరణతో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో తానే వేదాలు అధ్యయనం చేసి, పౌరోహిత్యం స్వీకరించారు. మరికొందరిని తన శిష్యులుగా చేసుకొన్నారు. అలా ఆయన పూనికతో పొన్నూరు ప్రాంతంలో దాదాపు 25 మంది యువకులు పౌరోహిత్యం నేర్చుకున్నారు. అయితే, ఎక్కడయితే ఈ సంప్రదాయం పురుడుపోసుకుందో, ఆ కృష్ణా జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఆ ఛాయలు అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు విశ్వబ్రాహ్మణ పురోహితులు మాత్రమే మిగిలారు.
 
తెలంగాణకూ విస్తరణ
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మూల్పూరుకు చెందిన రామదాసు సుబ్బారావు కుటుంబం కొన్నిదశాబ్దాల క్రితం తెలంగాణలోని బోధన్‌ వెళ్లి స్థిరపడింది. ఆయన అక్కడ అనేక పెళ్లిళ్లు జరిపించారు. ఈ సంప్రదాయాన్ని రామదాసు శిష్యులు నేటికీ కొనసాగిస్తున్నారు. పొన్నూరుకు చెందిన గాంధీ.. ఓ బ్రాహ్మణ వివాహం జరిపించడాన్ని అప్పట్లో విశేషంగా చెప్పుకొనేవారు.
 
కారంచేడులో యార్లగడ్డ పాపారావు చౌదరి, వట్టిచెరుకూరులో రావి వెంకట్రావు (84), గుంటూరులో కోటా వెంకయ్యవర్మ(90), శివరామయ్యవర్మ , లేమళ్లపాడులో ఎర్రగుంట్ల వీరనారాయణవర్మ, పొన్నూరులో పిన్నమనేని గాంధీ, తెనాలిలో వేముల శ్రీహరి, మునిపల్లెలో పిన్నమనేని రాధాకృష్ణవర్మ, పచ్చలతాడిపర్రులో రామినేని చంద్రశేఖరరావు, మూల్పూరులో కలపాల రామదాసు తదితరుల గురు సంప్రదాయాన్ని వారి శిష్యులు విస్తరింపజేస్తున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.