Oct 30 2017 @ 02:37AM

అట్లూరికి కమ్యూనిస్టుల నివాళి

ఏఎస్ రావునగర్‌/హైదరాబాద్‌, అక్టోబరు 29: సీపీఎం సీనియర్‌ నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు, ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు కమ్యూనిస్టు నేతలు ఘనంగా నివాళులర్పించారు. శనివారం అర్ధరాత్రి పూర్ణచంద్రరావు మరణవార్త తెలిసిన వెంటనే సీపీఎం, సీపీఐ కార్యకర్తలు ఆయన నివాసానికి తరలివెళ్లారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
 
కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా వానపాములలో జన్మించిన పూర్ణచంద్రరావు తన చివరి శ్వాస వరకు ఆదర్శ కమ్యూనిస్టు నేతగానే జీవించారు. 1946లో మొదలైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రావినారాయణరెడ్డి, భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డిలకు వెన్నుదన్నుగా నిలిచారు. అంతేగాక సినీ నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని మొదలెట్టిన పూర్ణచంద్రరావు ఎన్టీఆర్‌ హీరోగా ఆడపడుచు, కలవారి కోడలు, మాతృదేవత సినిమాలను నిర్మించారు. దాసరి నారాయణరావును సహాయ దర్శకుడిగా, శరత్‌బాబును నటుడుగా సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎంతోమందికి ఆదర్శ వివాహాలు చేశారు. చివరకు ఆయన కళ్లను దానం చేశారు.