Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 13 Oct 2017 21:00:02 IST

పవన్ కళ్యాణ్‌కి హ్యాట్సాఫ్ చెప్పేశారు

పవన్ కళ్యాణ్‌కి హ్యాట్సాఫ్ చెప్పేశారు

ప్రముఖ రచయిత తన 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'ఫిదా' సినిమాతో పాటు 'అత్తారింటికి దారేది' కథను, కథాంశాన్ని ఎలా డెవలప్ చేశారు, ఎలా డెవలప్ చేసుకోవచ్చో వంటి విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన ఈ చిత్ర కథాంశం గురించి వివరిస్తూ.. 'అత్తారింటికి దారేది' కథాంశం గురించి చెప్పుకోవాలంటే, తండ్రికి దూరమైన కుమార్తెను అంటే తాతకి దూరమైన తన మేనత్తని తిరిగి తాత దగ్గరకు చేర్చాలనే కుర్రాడి కథ. ఇదే కథా బీజం. అత్త కథ అనగానే 'అనసూయమ్మ గారి అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లరి అల్లుడు' వంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. 'బొమ్మా బొరుసా' నుంచి మొదలైన ఈ అత్తకు బుద్ది చెప్పే అల్లుళ్ల కథలకు భిన్నంగా 'అత్తారింటికి దారేది' ఉంటుంది. అద్భుతమైన కుటుంబ కథా చిత్రంగా, సెంటిమెంట్ చిత్రం చేయాలని త్రివిక్రమ్ ఈ కథని డెవలప్ చేసుకున్నాడు.
 
అత్తకు బుద్ది చెప్పే కథలు నార్త్ ఇండియాలో ఎందుకు తీయరు అని నేనడిగినపుడు, ఇక్కడ అత్తని అమ్మలాగా చూస్తామని, అందుకే ఇక్కడ మీ అత్త కథలు వర్కవుట్ అవ్వమని అక్కడి వారు చెప్పారు. ఇదే పాయింట్‌తో అత్తని ఆడించే విధంగా కాకుండా అత్తని గౌరవించేలా, తల్లిలాగా కథను రాసుకున్నాడు త్రివిక్రమ్. నార్త్ ఇండియన్ స్టయిల్‌లో తెరకెక్కించిన త్రివిక్రమ్, ఈ కథలో ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడు. అందులో ఎవరిని పవన్‌కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుంటారు అనే కోణంలో కథని రాసుకోవచ్చు. కానీ ఇది లవ్ స్టోరీ కాదు. 'ఫిదా' సినిమాలా దీనిని లవ్ స్టోరీగా డెవలప్ చేయదలచుకోలేదు. ఓ ఫ్యామిలీ డ్రామాతో సెంటిమెంట్‌గా తీసుకెళ్లాలని చేశాడు. దీనికోసం కొన్ని పాత్రలు సృష్టించి, ఆ పాత్రలతో పవన్ కళ్యాణ్‌పై ప్రేమాభిమానాలు వచ్చేలా చేశాడు. తన అత్త ఇంటిలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయడం, తండ్రి కూతుళ్లను కలపడం వంటి సెంటిమెంట్ దిశగా ఈ కథను రాసుకున్నాడు.
 
రెండో అమ్మాయిని తను ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ హీరోకి కావాల్సింది ప్రేమ కాదు. తన అత్తని తన తాత దగ్గరకు చేర్చడం. అందుకే సమంత, పవన్‌ల మధ్య ప్రేమని డెవలప్ చేయకుండా బ్రహ్మానందం అనే పాత్రని దింపి, కామెడీ కోణంలో కథని నడిపాడు. ఆ అమ్మాయికి ప్రేమ కలిగేలా చేసి కథను క్లైమాక్స్‌కి తీసుకెళ్లాడు. ఇక క్లైమాక్స్ గురించి ఏం చెబుతాం, నిజంగా హ్యాట్సాఫ్ టు పవన్‌కళ్యాణ్ గారు. ఎందుకంటే అంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో, అలా కన్నీళ్లతో అత్తని బ్రతిమాలక్కరలేదు. కానీ ఆయన మాట్లాడిన తీరు, చెప్పిన బ్యాక్ స్టోరీ, అందులో అమ్మని కోల్పోయినది చెప్పి, అత్తను కరిగించిన విధానం చిత్ర కథాంశంకి బలం అయింది. రెండు ఉప కథలను మధ్యలో చెప్పాడు తప్ప, హీరోకి మాత్రం ప్రేమ కథని చూపించకుండా, తను అనుకున్న మెయిన్ కథాంశం చుట్టూనే కథని అల్లుకున్నాడు.
 
ఈ కథని కథాంశముగా నాలుగు లైన్లలో చెప్పాలంటే ఓ కుర్రాడు తన తల్లిని, అత్తని కోల్పోయి, చనిపోయే ముందు తాత తన కూతురిని చూడాలని తాపత్రయపడితే, అత్తను నేను తీసుకువస్తానని తాతకు మాటిచ్చి, కోట్లను వదిలేసి సాదారణమైన మనిషిగా తన అత్త ఇంట్లో డ్రైవర్‌గా చేరి, తన అస్థిత్వం గురించి తెలియనీయకుండా, ఆ ఇంటిలోని వారందరి హృదయాలను గెలుచుకుని, అత్తను తీసుకుని వెళ్లే అవకాశం రాక, చివరికి తను ఏం కోల్పోయిందో తెలియజెప్పి, అప్పుడు అత్తని తీసుకుని వెళ్లాడు అనేది 'అత్తారింటికి దారేది'.
 
నాలుగైదు వాక్యాలలో చెప్పేటటువంటి కథ కనుక, మొత్తం కథా స్వరూపం సమగ్రంగా ప్రేక్షకుడికి అర్ధమైయ్యేట్లు అయితే అది కథాంశము అవుతుంది... అంటూ ముగించారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.