Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 11 Oct 2017 02:01:56 IST

కరువు సీమలో చినుకు చిందు

కరువు సీమలో చినుకు చిందు

  • వాగులు, వంకల ఉద్ధృతి
  • జల వనరుల్లోకి పుష్కలంగా నీరు
  • 15 ఏళ్ల తరువాత చిత్రావతికి వరద
  • అనంతపురంలో 716 చెరువుల్లోకి నీరు
  • కర్నూలులో ఎనిమిదేళ్ల తర్వాత హంద్రీ పరవళ్లు
  • కడపలో పదేళ్లకు గండికోటకు వరద
(ఆంధ్రజ్యోతి రాయలసీమ జిల్లాల ప్రతినిధులు)
రాయలసీమలో చినుకు చిందేసింది! ‘కరువు తీరా’ వానలతో నేల మురుస్తోంది. అక్కడక్కడా పంటలకు నష్టం వాటిల్లినప్పటికీ... నీటి ముఖమెరిగి ఏళ్లు గడిచిన చెరువులకు జలకళ వస్తోంది. ‘పరవళ్లు’ మరిచిన వాగులు, వంకలు, చిత్రావతి వంటి నదులకు పాత ‘నడక’ గుర్తుకొస్తోంది. పది రోజులుగా ఒక మోస్తరుగా... రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ వ్యాప్తంగా మునుపెన్నడూ లేని ‘జలదృశ్యం’ కళ్లకు కడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో ఆశపెట్టి, తర్వాత ముఖం చాటేసినా... ప్రస్తుత వర్షాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పంటలకు నష్టం చేకూర్చే అవకాశమున్నా... కరువుతీరా కురుస్తున్న వానలతో రాయలసీమలో సాగుకు ఈ ఏడాది ఢోకా ఉండదని రైతులు అంటున్నారు.
 
కర్ణాటకలో కట్టిన చెక్‌డ్యాములు, పరగోడు డ్యామ్‌తో అనంతపురం జిల్లాలో చిత్రావతి దాదాపుగా ఒట్టిపోయింది. ఇప్పుడు... 15 ఏళ్ల తర్వాత చిత్రావతి ఉరకలెత్తుతోంది. ఈ దృశ్యాన్ని అనంత రైతులు, ప్రజలు అబ్బురంగా చూస్తున్నారు. ఇక... వేదవతి(హగరి), స్వర్ణముఖి, పాపాగ్ని, మద్దిలేరు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. పెన్నా నదికి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, అనంతపురం డివిజన్ల పరిధిలో 1263 చెరువులకుగాను... 716 చెరువులకు వర్షపు నీరు చేరింది. సుమారు 17 ఏళ్ల తర్వాత వేదవతి (హగరి) నదిపై నిర్మించిన బైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీరు చేరింది. కదిరి ప్రాంతంలోని యోగివేమన ప్రాజెక్టులోకి 900 ఎంసీఎఫ్ టీ నీరు చేరింది. ప్రాజెక్టు నుంచి 12 వేల క్యూసెక్కులను కిందికి వదిలారు. తనకల్లు మండలంలోని చెన్నరామస్వామి ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తివేశారు.
 
హంద్రీ పరవళ్లు
కర్నూలు జిల్లాలో 2009 తర్వాత ఇప్పుడు హంద్రీ నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురిసింది. క్రిష్ణగిరి మండలంలో 126.2 మి.మీ, దేవనకొండలో 107.3 మి.మీ, వెల్దుర్తిలో 105.2మి.మీ, నందికొట్కూరులో 97.0, కర్నూలులో 90.3, ఎమ్మిగనూరులో 89.6, పెద్దకడుబూరులో 86.2, కోడుమూరు మండలంలో 82.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
 
గండికోట గేట్లెత్తేశారు
ఇక కడప జిల్లాలో పదేళ్ల తరువాత పెన్నా ద్వారా గండికోట ప్రాజెక్టులోకి వరద వచ్చింది. దీంతో, మైలవరం జలాశయంలోకి నీళ్లు వదులుతున్నారు. జిల్లాలోని పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు నిండడంతో గేట్లు ఎత్తివేశారు. సంబేపల్లె మండలం ‘సుబ్బారెడ్డిఇండ్లు’ గ్రామంలో బోరు నుంచి నీరు ఉబుకుతోంది
 
చిత్తూరుకు రిలీఫ్‌
చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రానికి 900 చెరువులు నిండిపోగా, 1500 చెరువులకు 70% నీరు చేరింది. 50 నుంచి 60 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకినట్లు భూగర్భజల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కౌండిన్య రిజర్వాయర్‌ 90% నిండింది. దీంతో ఏడాదిన్నర పాటు పలమనేరుకు తాగునీటి సమస్య తీరింది.
 
కొట్టుకుపోయిన జాతీయ రహదారి
చిత్తూరులో నిలిచిన రాకపోకలు
ఇతర జిల్లాల్లోనూ రవాణాకు ఇబ్బందులు
చిత్తూరు జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి శాంతిపురం మండలం పోడూరు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మదనపల్లె సమీపంలో హంద్రీ-నీవా కాలువలు తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వి.కోట మండలం యాలకల్లు సమీపాన గిడిగీ కనకదుర్గ జలపాతం వద్దకు వెళ్లిన యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. 2009 తర్వాత హంద్రీనది ఉప్పొంగడంతో కర్నూలు నగరం వరదలో చిక్కుకుంది. నదీ తీరాన ఉన్న లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. ఆయా ప్రాంతాలను కలెక్టర్‌ సత్యనారాయణ, ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. కర్నూలు జిల్లాలో దాదాపు 10వేల హెక్టార్లలో పత్తిపంట నీట మునిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొలకలెత్తే ప్రమాదముందని అనంతపురంలో వేరుశనగ రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లూరు మండలం రేమడూరు సమీపంలోని హంద్రీనదిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లను పోలీసులు కాపాడారు. అనంతపురం జిల్లాలోని తిమ్మాపురం చెరువు తెగి కడప జిల్లాలోని కొండాపురం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వంకలో చిక్కుకున్న రెండు బస్సులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. పాగేరు వంక ఉధృతి వల్ల ఖాజీపేట- కమలాపురం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.