Oct 9 2017 @ 22:50PM

మాటల ‘రాక్షసుడి’ కలం ఆగిపోయింది

‘లేడి పంజా’ దెబ్బ రుచి చూపించి, ‘జగన్నాథ రథ చక్రాల’ను వడివడిగా నడిపించిన నాటక రచయిత ఇక లేరు. ‘ప్రతిఘటన’, ‘దేవాలయం’, ‘రాక్షసుడు’, ‘ఎర్ర మందారం’ లాంటి చిత్రాల్లో తూటాల్లాంటి మాటలతో రచయితగా విశ్వరూపం ప్రదర్శించిన ఎంవీఎస్‌ హరనాథరావు కలం శాశ్వతంగా విశ్రమించింది.
 
కాలేజీలో చదువుతున్న రోజుల్లో హరనాథరావుకి టి. కృష్ణ జూనియర్‌. ఇద్దరి భావాలూ ఒక్కటే కావడంతో ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది. ‘జగన్నాథ రథచక్రాలు’ నాటకంలో హరనాథరావు తండ్రిగానూ, టి.కృష్ణ కొడుకుగానూ నటించారు. దేవుని అస్తిత్వంపై చర్చే ఈ నాటకం. దీన్ని రాయడానికి హరనాథరావుకు రెండేళ్లు పట్టింది. ఈ నాటకానికి ఎన్ని ప్రశంసలు వచ్చాయో, అదే స్థాయిలో విమర్శలూ వినిపించాయి. చెన్నైలో ‘జగన్నాథ రథచక్రాలు’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు బి.ఎన్‌.రెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, ఆత్రేయ వంటి ప్రముఖులు చూసి హరనాథరావుని అభినందించారు. టి. కృష్ణతో చక్కని అవగాహన ఉండటంతో సినీరంగంలోనూ వారి అనుబంధం కొనసాగింది. కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒకదానికి తప్ప మిగిలిన వాటన్నింటికీ హరనాథరావు రచన చేశారు. వీటిలో ‘ప్రతిఘటన’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘దేవాలయం’, ‘రేపటి పౌరులు’ చిత్రాలు హరనాథరావు మనసుకి నచ్చినవి.
 
నందులు తరలి వచ్చాయి
రచయితగా ‘ఇదా ప్రపంచం’ చిత్రానికిగాను 1987లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్న హరనాథరావు, ఆ తర్వాత ‘ప్రతిఘటన’, ‘భారతనారి’, ‘అన్న’, ‘అమ్మాయి కాపురం’ వంటి చిత్రాలకు, ‘తళాంగు తకధిమి’ అనే నాటికకు రాష్ట్రప్రభుత్వ నంది పురస్కారాన్ని పొందారు. అభ్యుదయ, విప్లవ చిత్రాలకే కాకుండా కమర్షియల్‌ సినిమాల రచయితగానూ రాణించారు ఎంవీయస్‌. ‘రాక్షసుడు’, ‘యం ధర్మరాజు ఎంఏ’, ‘మూడిళ్ల ముచ్చట’, ‘ధర్మచక్రం’, ‘పుణ్యభూమి నా దేశం’, ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’, ‘సూత్రధారులు’, ‘మమతల కోవెల’, ‘మంచి దొంగ’, ‘స్వాతి కిరణం’, ‘రామాయణం’ వంటివి వాటిలో కొన్ని. దాదాపు 150 చిత్రాలకు సంభాషణలు రాసిన హరనాథరావు 20 పైగా చిత్రాలలో నటుడిగా తన ప్రతిభను చాటారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలో ‘అబ్బా! నీ యబ్బా ఎంకట సుబ్బా!’ అంటూ నరకాసురుడిగా చేసింది ఐదు నిముషాల నిడివి పాత్రే అయినా దాన్ని బాగా రక్తి కట్టించారు. అలాగే ‘స్వయంకృషి’, శోభన్‌బాబు హీరోగా నటించిన ‘దేవాలయం’ వంటి చిత్రాల్లో ఆయన విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు.
 
నాటకం ఒక వ్యామోహం
తనని పదిమందికీ చూపించి, తన అక్షరాలను పరిచయం చేసింది నాటకమేనని హరనాథరావు చెప్పేవారు. అందుకే నాటకం మీద వ్యామోహంతో చివరి క్షణం వరకూ నాటకాలు రాస్తూనే ఉన్నారు. రాయడమే కాకుండా కొన్నింటికి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. పద్యనాటక పక్రియలో కొత్త ఒరవడి సృష్టించాలని ‘ప్రజాకవి వేమన’ పేరుతో నాటకం రాసి, అందులో వేమనగా నటించారు. అయితే ఆ నాటక ప్రదర్శనకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యాయి కానీ తిరిగి వచ్చినదేమీ లేదు. దాంతో పద్య నాటకాలు తన వల్ల కాదని అంతటితో వాటికి ముగింపు పలికారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొంత కాలం నుంచీ ఒంగోలులోనే ఉంటూ వచ్చిన ఆయన అక్కడే చివరి శ్వాస విడిచారు.
 
విప్లవ చిత్రాల రచయిత
సినీ పరిశ్రమలో టి. కృష్ణ, కె. విశ్వనాఽథ్‌, కోడి రామకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య వంటి ప్రముఖ దర్శకులెందరితోనో కలిసి పనిచేసిన హరనాథరావు మృదుభాషి, సౌమ్యుడు. రచయితగా అవకాశాలు తగ్గినా ఏనాడూ ఆయన నిరాశ చెందలేదు. తనకున్నది చాలనుకున్నారు. ఒకరిని దే హీ అని అడక్కుండా నడక సాగితే చాలనుకున్నారు. ‘ఆత్మసంతృప్తి ఉన్నవాడు గొప్ప ఆస్తిపరుడు’ అనేవారు హరనాథరావు. కొన్ని దశాబ్దాల పాటు విప్లవ, అభ్యుదయ చిత్రాలకు ఏకైక రచయితగా ఓ వెలుగు వెలిగారు హరనాథరావు. టి. కృష్ణ సినిమాలతో పాటు ‘ఉదయం’, ‘ఎర్ర మందారం’, ‘ఆకలీ నీకు జోహార్లు’, ‘ఎర్రోడు’ తదితర చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ ముద్ర నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. కొన్ని సినిమాలు రావడానికీ, మరి కొన్ని సినిమాలు పోవడానికీ ఆ ముద్రే కారణం.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌, ఒంగోలు