
న్యూఢిల్లీ: రైల్వేల ప్రక్షాళనకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దాల తరబడి వేళ్లూనుకున్న వీఐపీ సంస్కృతికి, ఆర్డర్లీ వ్యవస్థకు స్వస్తి పలికేందుకు కీలక ముందుగుడు వేసింది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చేటప్పుడు జనరల్ మేనేజర్లు వారివెంటే ఉండాలని 36 ఏళ్లుగా అనుసరిస్తున్న ప్రోటోకాల్‌కు చరమగీతం పాడుతూ రైల్వే శాఖ అసాధారణ చర్య తీసుకుంది. ఈ ప్రోటాకాల్‌ను తప్పనిసరి చేస్తూ 1981లో జారీ చేసిన ఉత్వర్వును రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు సెప్టెంబర్ 28న రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.
మరోవైపు, రైల్వే ఉన్నతాధికారుల ఇళ్లల్లో పనులు చేసేందుకు రైల్వే సిబ్బందిని వాడుకోవడాన్ని కూడా మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించించింది. సిబ్బందిని తమ ఇళ్లల్లో వాడుకుంటున్న అధికారులు వెంటనే వారిని రిలీప్ చేయాలని కూడా ఆదేశించింది. సీనియర్ అధికారుల ఇళ్లలో 30,000 మంది ట్రాక్మెన్లు పనిచేస్తున్నారని, వారందరినీ తిరిగి తమ విధుల్లోకి చేరాలని కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రకారం ఇప్పటికే 6,000 నుంచి 7,000 మంది తిరిగి విధుల్లో చేరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 'ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఏ ఒక్కరికీ తిరిగి విధుల్లో చేరేందుకు మినహాయింపులు లేదు. త్వరలోనే సిబ్బంది మొత్తం విధుల్లోకి చేరుతుందని ఆశిస్తున్నాం' అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అధికారులు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణాలకు స్వస్తి చెప్పాలని, స్లీపర్, ఏసీ త్రీటైర్ క్లాస్‌ల్లో ఇతర ప్రయాణికులతో కలిసి ప్రయాణాలు సాగించాలని కూడా రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సీనియర్ అధికారులను కోరారు. రైల్వే బోర్డు మెంబర్లు, రైల్వే జోన్స్ జనరల్ మేనేజర్లు, డివిజన్ రైల్వే మేనేజర్లు ఈ కోవలోకి వస్తారు. కాగా, ఉన్నతాధికారుల పర్యటనల్లో బోకేలు, బహుమతులు ఇవ్వడాన్ని అధికారులు ప్రోత్సహించవద్దని రైల్వే బోర్డు చేర్మన్ అశ్వని లోహానీ సూచించారు.