Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 11 Jul 2017 13:43:14 IST

మట్కా అడ్డగా జుహీరాబాద్

మట్కా అడ్డగా జుహీరాబాద్

  • జహీరాబాద్‌ ప్రాంతంలో జోరుగా దందా
  • ఆట మొత్తం ఫోన్లలోనే
  • జూదరుల వ్యసనాలను సొమ్ము
  • చేసుకుంటున్న నిర్వాహకులు
  • రోజుకు రూ. లక్షల్లో టర్నోవర్‌
జహీరాబాద్‌: జహీరాబాద్‌ కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో కొన్ని అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొన్ని అక్రమ వ్యాపకాలకు జనాలు బానిసలవుతున్నారు. వాటికి దూరంగా ఉండాలని, సమాజం సైతం చిన్నచూపు చూస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నా వారు మాత్రం వాటి నుంచి బయటపడడంలేదు. ఎంత చెప్పినా వినక పోవడంతో వారి కుటుంబాలు వివిధ రకాల కారణాలతో రోడ్డుపైకి వచ్చిన సందర్భాలున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారు వాటిని మానుకోలేక, పూర్తిగా నష్టపోయిన గ్రామాలను వదిలి పట్టణాలకు వలసలు పోతున్నారు.
 
వేధిస్తోన్న మహమ్మారి
జహీరాబాద్‌ డివిజన్‌లోని జహీరాబాద్‌ పట్టణంతో పాటు కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, రాయికోడ్‌ మండలాల్లో మట్కా మహమ్మారి నిరుపేదలను పట్టిపీడిస్తోంది. ఏళ్ల తరబడి మట్కా వ్యసనానికి అలవాటుపడిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను పక్కనపెట్టి ఈ జూదానికే అలవాటయ్యారు. పోలీసులు సైతం వినూత్న తరహాల్లో అవగాహనలను కల్పిస్తున్నా వ్యసనపరుల వైఖరిలో మార్పురావడం లేదు. అలాంటి వారితో కొన్ని సందర్భాల్లో అధికారులు తలలు బాదుకోవాల్సి వస్తుంది.
 
ముంబై కేంద్రంగా..
మట్కా ముంబై ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. గ్రామాల్లోని వారు సైతం ఊర్ల నుంచే మట్కా ఆడుతున్నారు. చాట్‌లను వినియోగించి ఎక్కడో ఒక దగ్గర కూర్చుని నమ్మకంతో ఎంచుకున్న నంబర్‌పై రూ.10 మొదులుకుని వందలు, వేలవరకు బానిసలైన వారు పెట్టుబడులను పెడతారు. సమాచారం వచ్చేవరకు వేచి చూస్తారు. ముంబైలో మట్కా నిర్వహించేవారు ఫలానా నంబర్‌ వచ్చిందని స్థానికంగా జహీరాబాద్‌, కోహీర్‌ కేంద్రాల నిర్వాహకులకు సమాచారం ఇస్తారు. తమ నంబర్‌ వచ్చిన వారు సంతోషపడగా, రానివారు నిరుత్సాహానికి గురై తిరిగి రాసే సమయం కోసం ఎదురూ చూస్తూ కూర్చుంటారు. ఇలా రోజుకు నంబర్‌ తగిలేది కొందరికైతే నష్టపోయే వారు పెద్దమొత్తంలో ఉన్నారు. పోయిన డబ్బులను రికవరీ చేసుకోవాలని భావించి మట్కా జూదానికి బానిసైన వారు తరచూ డబ్బులను అప్పుగా తీసుకురావడం లేదా ఆస్తులను అమ్ముకోవడంవంటివి చేస్తారు. ఈ జూదానికి ఆస్తులను తగలేస్తున్నారు.
 
వివిధ రకాలుగా మట్కా
మట్కా జూదం వివిధ రకాలుగా ఉంటుంది. ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు రెండు ఆటలుగా కొనసాగుతుంది. కల్యాణ్‌, ముంబై అనే పేర్లతో మట్కా జూదం నడుస్తుంది. కల్యాణ్‌ పేరిట ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు బానిసలుగా మారిన వారు మట్కా ఆడుతుంటారు. సాయంత్రం 4-15గంటలకు వెలువడే ఫలితాన్ని ఓపెన్‌ అని, సాయంత్రం 6-15గంటలకు వచ్చే ఫలితాన్ని క్లోజ్‌ అని అంటారు. ఈ రెండు అంకెలను కలిపితే జాయింట్‌గా పేర్కొంటారు. సింగిల్‌ నంబర్‌ మీద ఒక రూపాయి కడితే రూ. 9 వస్తాయి. అదే జాయింట్‌ మీద ఒక రూపాయికడితే రూ. 90 వస్తాయి. ఇకపోతే ముంబై పేరిట ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు నమ్మకం ఉన్న నంబర్లపై జూదరులు డబ్బులు వెచ్చిస్తారు. రాత్రి 9.45గంటలకు వెలువడే ఫలితాన్ని ఓపెన్‌ అని, అర్ధరాత్రి 12.15గంటల వచ్చే ఫలితాన్ని క్లోజ్‌ అని అంటారు. ఇదిలా ఉండగా మట్కా జూదంలో భాగంగా జూదరులు ఓపెన్‌లో 3 అంకెలపై కొంత మొత్తాన్ని వెచ్చిస్తే దాన్ని వారి భాషల్లో పానాగా పరిగణిస్తారు. అందులో భాగంగానే ఓపెన్‌లో 3 అంకెలు, క్లోజ్‌లో 3అంకెలు కలిపితే దాన్ని సంగం పానాగా పరిగణిస్తారు. పానాలో జూదరులు ఒక రూపాయి వెచ్చిస్తే రూ. 90ల వస్తాయి. అదే సంగం పానాకు ఒక రూపాయి కడితే 4వేలరూపాయలు వస్తాయని సమాచారం.
 
ఫోన్ల ద్వారానే దందా
స్థానికంగా ఏజెంట్‌గా చలామణి అయ్యేవారు దూరప్రాంతంలో ఉన్న అసలు నిర్వాహకుల పేరిట ముందస్తుగా డిపాజిట్‌ చేస్తేనే వారి ఆటలు చెల్లుబాటవుతాయి. అందులో భాగంగానే కొందరు ఏజెంట్లు లక్షల రూపాయలను ముందస్తుగానే డిపాజిట్లు చేసి ఆటలు కొనసాగిస్తారు. జూదరులు కూడా స్థానిక ఏజెంట్‌ వద్ద ఎంతోకొంత డిపాజిట్‌ చేస్తేనే వారు ఆడడానికి అవకాశం ఇస్తారు. ఈ అక్రమ దందా అంతా ఫోన్లలోనే నడుస్తుంది. సమాచారం ఎప్పటికప్పుడు గోప్యంగా చేరుకుంటుంది. ఈ విషయంలో అధికారులు కూడా ఏమిచేయలేని నిస్సాయస్థితిలో ఉన్నారు. అనుమానం వచ్చిన వారిని మాత్రమే పట్టుకుని రావడం పరిపాటిగా మారింది. దీంట్లో నిర్వాహకులు దూరంగా ఉండడంతో కమీషన్‌ ప్రాతిపదికన మట్కా వ్యాపకాన్ని కొనసాగించేవారే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ఇటు జూదరులు అటు నిర్వాహకులు బాగానే ఉంటున్నప్పటికి కమీషన్‌ ప్రాతిపదికన పని చేసేవారే అధికారుల చేతిలో బకరాలుగా మారుతున్నారు. కమీషన్‌ ప్రాతిపదికన పని చేసే వారు ఊరికి ఒకరు చొప్పున ఉండి ఫోన్ల ద్వారా సమాచారాన్ని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు అందిస్తారనే సమాచారం.
 
మారకపోతే పీడీ యాక్ట్‌ కేసులు నమోదు
జూదరులు మట్కా జూదాన్ని ఆడడం మానకపోతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ చేపడుతూ మట్కా జూదరులు, నిర్వాహకుల కదలికలను గమనిస్తూనే ఉన్నారు. జహీరాబాద్‌ డివిజన్‌లో సుమారు 5-10మంది వరకు మట్కా నిర్వాహకులు ఉండి ఉంటారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశాం. మట్కాకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించాం. ఎక్కడైనా మట్కా ఆడుతున్నట్లు మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం. -నల్లమలరవి, డీఎస్పీ

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.