
- పలువురు ప్రముఖుల నివాళులు
రాంనగర్/హైదరాబాద్: ఆంధ్ర మహిళాసభ పూర్వ అధ్యక్షురాలు, ప్రముఖ సంఘసేవిక, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సన్నిహిత సహచరి కంచర్ల సుగుణమణి(99) మరణించారు. ఆమె తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు నిద్రలోనే కన్నుమూశారు. కాకినాడలో పుట్టిన సుగుణమణికి 1943 నుంచి ఆంధ్ర మహిళాసభతో అనుబంధం ఉంది. స్త్రీ జనోద్ధరణ కోసం 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ ప్రారంభించారు. 1947 నుంచి మరణించేవరకు ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రికి సేవలందించారు. మద్రాస్ రాష్ట్ర సొసైటీ అడ్వయిజరీ బోర్డు సభ్యురాలిగా ఐదేళ్లు పనిచేశారు. వికలాంగుల సలహాబోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. కస్తూర్బా గాంధీ సేవాసంఘం ఉమెన్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1974 నుంచి శారదా సంఘం ఏపీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఉమ్మడి ఏపీ కార్మిక సంక్షేమ సలహా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. సుగుణమణికి అనేక అవార్డులు వచ్చాయి. జాతీయ బాలల సంక్షేమ అవార్డు, రసమయి మిలినీయం అవార్డు, కేంద్ర సాంఘికసంక్షేమ శాఖ ఉత్తమ సంఘసేవకురాలు పురస్కారం, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు, ఇందిరాప్రియదర్శిని ప్రతిభా అవార్డును అందుకున్నారు. మరణవార్త తెలియగానే జస్టిస్ జీవన్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వీసీ సరస్వతీరావు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ సుశీలాదేవి, ఆంధ్ర మహిళాసభ చైర్మన్ ఎస్వీరావు నివాళులర్పించారు. అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.