అపూర్వమైన జానపద సాహిత్యాన్నంతా సేకరించి మనకు అందించిన జానపద సాహిత్యో ద్ధారకులు నేదునూరి గంగాధరం. ఆరువేలకు పైగా జానపద గీతాలను సేకరించారు.
పల్లె పాటలు, పల్లె పదాలు, పల్లె సాహిత్యం అనగానే మొదటగా గుర్తు కువచ్చే పేరు ‘నేదునూరి గంగాధరం’. ఆయన 1904 జూలై 4వ తేదీన రాజమండ్రికి సమీపాన కొంతమూరులో జన్మించారు. పెద్ద చదువులేవీ చదవకపోయినప్పటికీ, చిన్నప్పుడే కందుకూరి వారి ఆశీర్వాదం పొందారు. సారస్వత తపస్సుకి దీక్షపూనారు. మానవల్లి రామకృష్ణ కవి అంతటి గొప్పవారి దగ్గర పరిశోధనలో శిక్షణ పొందారు. బీదబడి పంతులుగా కాలం వెళ్ళదీశారు. పల్లెపాటలు దండుకునే బిచ్చగాడయ్యారు. తండ్రి తాతల మడిచెక్కా, భార్య మెడలోని పుస్తే పూసా అమ్మేసి పల్లెపాటల సేకరణకు కంకణం కట్టుకున్నారు. ఆయన్ను నేదునూరి గంగాధరం అని కాకుండా ఇంటి పేరు వెనక్కి నెట్టి జనం పాతపాటల గంగాధరం అన్నారు. లోకమేమో ‘‘కవికోకిల’’ అంటే తానేమో ‘‘సకలసుకవి జనావర్తిని’’ అన్నారు. జనం ‘‘జానపద వాఙ్మయోద్ధారకుడు’’ అని అంటే తాను ‘‘జీవన సాహిత్య భిక్షువు’’నన్నారు.
అపూర్వమైన జానపద సాహిత్యాన్నంతా అపారంగా సేకరించి మనకు అందించిన జానపద సాహిత్యోద్ధారకులు గంగాధరం గారు. ఆరువేలకు పైగా జానపద గీతాలను సేకరించి ప్రచురించారు. శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారి ప్రేరణతో ఊరూర తిరిగి ప్రాచీన పద్యాలు, శాసనాలు, తాటాకు గ్రంథాలు సేకరించారు. శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావుగారి ప్రేరణతో పాత పాటల్ని సేక రించి భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి, కృష్ణా పత్రికల్లో ప్రచురించారు. చింతా దీక్షితులుగారి ఆదేశానుసారం స్త్రీల పాటలు, కథా గేయాలు సేకరించారు.
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి సూచనల్ని శిరసావహించి సామెతలు, గేయాలు, జాతీయాలు, పారిభాషిక పదాలు మొదలైనవాటిని సేకరించి ఆనాటి పత్రికల్లో ప్రచురించారు. టేకుమళ్ళ రాజగోపాలరావు సూచనల ప్రకారం కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు. ఈవిధంగా ప్రముఖుల సలహాలను స్వీకరించి జానపద వాఙ్మయంలోని ప్రతి అంశాన్ని సేకరించి తర్వాతి సేకర్తలకు, పరిశోధకులకు మార్గదర్శకులుగా నిలిచారు. తీరిక వేళల వ్యవసాయం చేసుకుంటూనే కావ్యపఠనం చేసేవారు. 1925లో లోయరు గ్రేడు ట్రెయినింగ్లో నెగ్గి కొంతమూరు ప్రధానోపాధ్యాయులుగా ఉంటూనే జానపద సాహిత్యానికి సంబంధించిన సమస్త విషయాలను సేకరించారు. నాలుగున్నర దశాబ్దాలపాటు ఒక్క చేతి మీదుగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి అంతటి మహోద్యమం గంగాధరంగారు సాగించగలిగారు.
వీరి సేకరణలో జానపద గేయాలే కాకుండా కథాగేయాలు, వీరగాథలు, సామెతలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, జాతీయాలు, పొడుపు కథలు, మారుమూల పదాలు, పలుకుబళ్ళు, కిటుకు మాటలు, క్రీడలు వినోదాలు, పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, వైద్యం, కళలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢవిశ్వాసాలు, చేతిపనులు మొదలైన విష యాలన్నీ లక్షల సంఖ్యలో సేకరించి విజ్ఞాననిధిని రాశిగా పోశారు. ఈయన అసలే నిరుపేద ఉపాధ్యాయులు, జానపద వాఙ్మయోద్ధారణకు తన పిత్రార్జిత మైన 63 కుంచాల భూమిని, ముప్ఫైకాసుల బంగారాన్ని ఖర్చుచేశారు. 1953లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కొన్ని కొట్టుకుపోయాయట. అయినా మిగిలిన సేకరణలేం తక్కువ కాదు.
గంగాధరం గారు ప్రకటించిన గ్రంథాలు వరుసగా: 1) ‘మేలుకొపులు’-1949 2) ‘మంగళహారతులు’-1951 3) ‘సెలయేరు’-1955, దీనిలో ఏడు శీర్షికల్లో 250 పాటలున్నాయి. 4) ‘వ్యవసాయ సామెతలు’, దీనిలో 912 తెలుగు సామెతల తోపాటు అరబ్బీ, ఇంగ్లీషు, ఇటలీ, ఆఫ్ఘనిస్థాను, కర్ణకటము, చైనా, జపాను, జర్మనీ, తుర్కీ, తమిళం, పరాసు, ఫారసీ, బెంగాళీ, బడగ,మలయా, మలయాళం, మరాఠీ, రష్యా, స్పెయిను, హిందూస్థానీ భాషలకు చెందిన 199 సామెతల తెలుగు అనువాదాలున్నాయి. 5) ‘పసిడి పలుకులు’-1960, ఈ గ్రంథం ఒక లఘువిజ్ఞాన సర్వస్వం. దీనిలో నుడికారాలు, సాంకేతికపదాలు, పారిభాషిక పదాలు మాండలి కాలు వేల సంఖ్యలో ఉన్నాయి. 6) ‘స్త్రీల వ్రత కథలు’-1960, ఈ రెండు సంపుటాల్లో నూరు నోముల కథలు కొన్ని పాటలు ఉన్నాయి. 7) ‘జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి’, ఇందులో పది వ్యాసాలున్నాయి. 8) ఆట పాటలు-1964. 9) ‘మిన్నేరు’-1968, ఇందులో తొమ్మిది శీర్షికల చొప్పున 382 పాటలున్నాయి. 10) ‘మున్నీరు’-1973, ఇందులో ఏడు శీర్షికల కింద 270 పాటలున్నాయి. ఈ చివరి గ్రంథం గంగాథరంగారు కీర్తిశేషులయ్యాక వెలువడింది. వీరి రచనల్లో మరికొన్ని: పండుగలు-పరమార్థములు, వ్యవసాయ ముహూర్త దర్పణం, గృహవాస్తు దర్ప ణం, పుట్టు మచ్చల శాస్త్రం, కోడిపుంజుల శాస్త్రం మొదలైనవి ముఖ్యమైనవి.
సుప్రసిద్ధ సాహిత్యవేత్త రామానంద చటర్జీ గారు తమ ‘మాడర్న్ రివ్యు’ అనే పత్రికలోనూ, విశ్వభారతి పట్టం పొందిన కుంజ బిహారీదాస్ తన ఇండియావల్లి గీత సంచయంలోనూ, ప్రఖ్యాత జానపద సాహిత్య మహారథి దేవేంద్ర సత్యార్థి గారు తన ఆంగ్ల, హిందీ గ్రంథాల్లోనూ గంగాధరం గారిని ప్రశంసించారు.
రాజమహేంద్ర వరం రాజసింహాసనం మీద కూర్చొని రాజరాజ నరేంద్రుడు భారతం రాయిం చాడు. అదే వీధుల్లో జోలికట్టి పల్లెపాటలు సేకరించాడు గంగాధరం. తన పూర్వులు గనుక తన కోసం రాయ మన్నాడు రాజరాజనరేంద్రుడు. తన తెలుగు వారి అనాదృత సంపద గనక పల్లెపాటలు సేకరిం చడానికి గంగాధరం పూనుకున్నాడు.
గంగాధరంగారు జానపద వాఙ్మయోద్ధారకుడే కాదు ప్రదర్శనా కళల తొలి పరిశోధనా పితామహుడు కూడా. ‘కవి కోకిల’, ‘వాస్తువిశారద’, ‘వాఙ్మయోద్ధారక’, ‘జానపదబ్రహ్మ’ బిరు దాంకితులైన అసాధారణ సాహిత్యవేత్త నేదునూరి గంగాధరంగారు.
ఈ అనాదృత వాఙ్మయ భిక్షువు 1970 మార్చి 11న పరమపదించారు. వారికి జనాపద సాహిత్య లోకమెంతో ఋణపడి ఉంది. గంగాధరం గారి ముందుగానీ, తర్వాతగానీ చాలామంది జానపద సాహిత్యంలో కృషి చేశారు. అదంతా ఒకెత్తు, నేదునూరి గంగాధరం గారి కృషి ఒకెత్తు.