Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 12 Jun 2017 00:44:29 IST

సరస్వతీ పుత్రుని తొలి కవితాపుష్పం ‘పెనుగొండ లక్ష్మి’

సరస్వతీ పుత్రుని తొలి కవితాపుష్పం పెనుగొండ లక్ష్మి

కాలొకచోట నిల్వక, ముఖమ్మున నిప్పుకలుప్పతిల్ల, బో
నాలకు నాల్క జాచి యనయంబును గజ్జెలు గట్టియాడు నీ
కాల పిశాచి కేమిటికి గట్టితి పట్టము? దీని గర్భమున్‌
జీలిచి చూడుమెందఱి వజీరుల యాత్మలు మూల్గుచున్నవో
- ‘పెనుగొండ లక్ష్మి’
పుట్టపర్తి నారాయణాచార్యులు
 
‘పెనుగొండ లక్ష్మి’ పుట్టపర్తి నారాయణాచార్యులు తొలి రచన. ఇది క్షేత్ర ప్రశస్తి కావ్యాల్లో ప్రసిద్ధమైనది. ఈ కావ్యంలోని భావావేశం, భాషా సారళ్యం, కవితా మాధుర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. అందువల్లనే, ‘నా రచనలను చదివినవాళ్ళు ఎక్కువగా నా చిన్ననాటి రచనల్నే మెచ్చుకుంటా’రని పుట్టపర్తివారే ‘పెనుగొండ లక్ష్మి’ ఉపోద్ఘాతంలో స్వయంగా చెప్పుకున్నారు.
 
ఇందులో 123 పద్యాలు ఉన్నాయి. దీనిని ఆయన పన్నెవండవ ఏట (1926లో) రచించినా ముద్రణ మాత్రం పందొమ్మిదో ఏట అంటే 1933లో జరిగింది. క్షేత్రప్రశస్తి కావ్యంగా ప్రసిద్ధమైన కొడాలి సుబ్బారావు ‘హంపీక్షేత్రం’ కంటే తన కావ్యమే పదహై దేండ్లు పెద్దదని, ఆ రచనా కాలం నాటికి తనకు ఛందస్సు కూడా రాదని, తిక్కన భారతాన్ని బాగా చదువుతుండడం వల్ల ఆ వాచక శక్తి దీనికి పునాది అయిందని, ఆంధ్ర మహాభారతం శక్తి అలాంటిదని పుట్టపర్తి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. సాధారణంగా రచయితలు చేసిన రచనలు వాళ్ళకే పాఠ్య గ్రంథంగా ఉండడం జరగదు. పుట్టపర్తి రాసిన ఈ తొలి రచన ఆయనకే విద్వాన్‌ పరీక్షలో పాఠ్య గ్రంథంగా ఉండడం విశేషం.
 
పెనుగొండకు ఒక చారిత్రక విశిష్టత ఉంది. ఇది విజయనగర రాజుల కాలంలో గొప్పగా వెలుగొందిన ప్రదేశం. శ్రీకృష్ణదేవరాయలకు వేసవి విడిది. ఒకనాడు శౌర్య పరాక్రమాలకు, సకల సంపదలకు, దానిమ్మ ద్రాక్ష వంటి పండ్ల తోటలకు ఆటపట్టై అలరారింది. ఇలాంటి పెనుగొండలో పుట్టపర్తి చిన్నతనంలో నివసించారు. ‘ముదల’, ‘ఊరడింపు’, ‘కోట’, ‘రణభూములు’, ‘రాజవీధి’, ‘రామబురుజులు’, ‘దేవాలయం’, ‘శిల్పం’, ‘బాబయ్య గోరి’, ‘గగన మహలు’, ‘కడచూపు’, ‘తెలుగురాయడు’ శీర్షికలతో కవి ఒకనాటి పెనుగొండ ఘనతను, నేటి దురవస్థను ఆవేదనాభరితంగా తెలిపారు.
 
కాల ప్రభావం ఊహింపలేనిది, అతిక్రమింపలేనిది. ఒక క్షణంలో నిండుగా ప్రపంచాన్ని అలరారేలా చేసి మరుక్షణంలో రూపనామక్రియలు లేకుండా చేసే శక్తి కాలానికుంది. అలాంటి కాలమనే పిశాచికి ఎందుకు పట్టంగట్టావని ‘ముదల’లో కవి భగవంతుణ్ణే ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘కాలొకచోట నిల్వక, ముఖమ్మున నిప్పుక లుప్పతిల్ల, బో/నాలకు నాల్క జాచి యనయంబును గజ్జెలు గట్టియాడు నీ/ కాల పిశాచి కేమిటికి గట్టితి పట్టము? దీని గర్భమున్‌/ జీలిచి చూడు మెందఱి వజీరుల యాత్మలు మూల్గుచున్నవో’.
 
ఒకప్పుడు రాజులతో కళకళలాడిన భవనాల్లో నేడు నిశ్శబ్దం తాండవిస్తోంది. సంపదలకు, ఆనందానికి నిలయమై ప్రకాశించిన ప్రదేశం నిర్జీవంగా ఉంది. తన కాలం నాటి ఆ పెనుగొండ దురవస్థను కవి ‘ఊరడింపు’లో ఇలా వర్ణిస్తున్నారు: ‘అదిగో పాతరలాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద మ/ల్లదె! మా కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్‌ నీరుగా నేడ్చుచు/న్నది, భాగ్యంబులు గాసెగట్టిన మహానందైక సారంబునం/ దుదయంబయ్యె నభాగ్యరేఖ, చెడెనయ్యో పూర్వసౌభాగ్యముల్‌’.
 
శ్రీకృష్ణదేవరాయల కాలంలో అల్లసాని పెద్దన రాకపోకలతో, రాయల సార్వభౌమ త్వానికి తల వంచిన సుల్తానుల పూజలతో వెలుగొందుతూ- ఆదివరాహ ధ్వజం నీడలో కీర్తిసౌఖ్యాలను అనుభవిస్తూ, కళింగప్రభువైన గజపతిని నిలువరించి, చీమ సైతం హాయిగా నిద్రించే స్థితిని కల్పించి అలరారిన పెనుగొండ వైభవం ఇలా చెప్పబడింది: ‘గండపెండేరంబు ఘల్లుఘల్లుమన దానములతోడ దేశాక్షి బలుకు నాడు/ సులతానులెల్ల దలలు వంచి కల్కితురాయీల నిను బూజసేయునాడు/ ఆదివరాహ ధ్వజాంతరంబుల నీడ నీ కీర్తి, సుఖము బండించునాడు/ గుహల లోపల దూరికొన్న యా గజపతి తలపైని నీకత్తి గులుకునాడు/ నీదు కన్నుల వెలిచూపు నీడలోన/ జీమయును హాయిగా నిద్రజెందునాడు/ గలుగు నాంధ్రుల భాగ్యసాకల్య గరిమ/ బూడిదను బడి నీ తోడ బోయె దల్లి!’
 
కళలకు నెలవైన పెనుగొండ నేడు కళావిహీనమై పోయిందని కవి బాధను ఇలా వ్యక్తం చేశారు: ‘ఉలిచే రాలకు జక్కిలింతలిడి యాయుష్ర్పాణముల్వోయు శి/ల్పుల మాధుర్య కళాప్రపంచంబు లయంబున్‌ జెందె, పాతాళమున్‌/ గలసెన్‌ బూర్వకవిత్వ వాసనలు, నుగ్గైపోయె నాంధ్రావనీ/ తలమంబా! యిక లేవ యాంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్‌’.
 
ఒకనాడు కృష్ణరాయలు అల్లసాని పెద్దన మొదలైన కవులను సన్మానించి పల్లకీ ఎక్కించి పండితులు వాళ్ళను కీర్తిస్తుండగా తానే పల్లకీ మోయగా మెరసిన రాజవీధులు నేడు శూన్యతను ఆవహించాయని కవి ఇలా ఆక్రోశిస్తున్నారు: ‘కవులన్‌ బంగరు పల్లకీల నిడి యుత్కంఠాప్తితో బండిత/ స్తవముల్‌ మ్రోయగ రత్నకంకణ ఝణత్కారంబుగా నాత్మహ/స్త విలాసమ్మున మ్రోసి తెచ్చెనట నౌరా! సార్వభౌ ముండు, నే/ డవలోకింపుము నీరవంబులయి, శూన్యంబైన వీ మార్గముల్‌’.
 
శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి రత్నరాసుల వైభవాన్ని వర్ణిస్తూ ఒక ఇంటివారు కుట్టాణిముత్యాలను కుప్పలుగా పోయగా, గువ్వలు ధాన్యమనుకుని భ్రమపడి కోరాడుతుండగా, ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు నవ్వబోగా అత్తగారు మర్యాద కాదని వారించినట్లు కవి ఇలా చమత్కారభరితంగా చెప్పారు: ‘కులుకున్‌ బచ్చని రత్నకంబళములన్‌ గుట్టాణిముత్యాలు గు/ప్పలు వోయన్‌ మనవారు, ధాన్యమను భావంబూని గోరాడు గు/వ్వల యజ్ఞానము గాంచి ఫక్కుమని నవ్వన్‌ గ్రొత్త సంసారి య/త్తలు గస్సన్నల నాపియుందురని స్వాంతంబందు నూహించెదన్‌’
పుట్టపర్తి పెనుగొండలోని దేవాలయ శిల్పసంపదకు, శ్రమశక్తికి ముగ్ధులైనారు. ఆ కట్టడాల నిర్మాణం చూసి ఆయన ఎంతగానో ఆశ్చర్యానికి లోనైనారు: ‘ఎట్లు పైకెత్తిరో యేన్గుగున్నలకైన తలదిమ్ము గొలుపు నీ శిలల బరువు/ యేరీతి మలచిరో యీ స్తంభములయందు ప్రోవుగ్రమ్మిన మల్లెపూలచాలు/ యే లేపనంబున నీ కుడ్యములకెల్ల తనరించినారొ యద్దాలతళుకు/ యే యంత్రమున వెలయించిరో వీనికి జెడకయుండెడు చిరంజీవశక్తి/ కని విని యెఱుంగనట్టి దుర్ఘటములైన/ పనులు, స్వాభావికముగ నుండినవి వారి/ కా మహాశక్తి యేరీతి నబ్బెనొక్కొ/ కాలమో! జీవనమో! యేదొ కారణంబు’. చిన్నవయసులోనే ప్రౌఢ కావ్యం రాసిన కవి పుట్టపర్తి. ఈ కావ్యం ఆయన కవిత్వ కృషికి పునాది. ఈ పునాదిపైననే ఆయన అనేక కావ్య హర్మ్యాలు నిర్మించారు.
 భూతపురి గోపాలకృష్ణశాస్త్రి
99666 24276

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.