May 13 2017 @ 11:49AM

నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల

నట కుటుంబం, నట గురువుల కుటుంబం నుండి వచ్చిన నటుడు రాజీవ్‌ కనకాల. రెండున్నర దశాబ్దాలుగా 110 కిపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిందని, తెలుగు పరిశ్రమలో ఉన్నంత బలం మరెక్కడా లేదంటారాయన. భవిష్యత్తు తెలుగు చిత్రసీమదే, పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా, కౌబోయ్‌ చిత్రాలేవైనా విజయవంతంగా నిర్మించగల దమ్ము, ధైర్యం తెలుగు దర్శకులకే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలనంటున్న రాజీవ్‌ కనకాల ఇంటర్వ్యూ ఈ వారం......
 
మా నాన్నగారు దేవదాస్‌ కనకాల. అమ్మ లక్ష్మీదేవి కనకాల. ఇద్దరూ నటులే. ఎంతోమంది ప్రముఖ నటుల్ని నట శిక్షణాలయం ద్వారా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కింది. నేను పుట్టింది హైదరాబాద్‌ పాతనగరం ఆఫ్జల్‌గంజ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆ రోజుల్లో నగరంలో అదొక్కటే మంచి ఆసుపత్రి. ప్రైవేటు ఆసుపత్రులు కూడా తక్కువగా ఉండేవి. ఎల్‌.కె.జి నుంచి ఫస్ట్ క్లాస్‌ వరకు హైదరాబాద్‌లో రెండు మూడు తరగతులు చెన్నైలో చదివాను. ఆ తర్వాత నా చదువంతా హైదరాబాద్‌లోనే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్‌ ఆర్ట్స్‌లో పట్టా తీసుకున్నాను. ఈ విశ్వవిద్యాలయం మా బ్యాచ్‌తోనే ఆరంభమైంది. జె.వి.సోమయాజులు, చాట్ల శ్రీరాములు, కల్యాణి, వినోద్‌బాలగార్లు మా గురువులు. దశిక రాములుగారి టీచింగ్‌ పద్ధతి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండేది. గచ్చిబౌలిలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చేశాను.
 
నాటకానుభవం
నాలుగో తరగతి చదువుతున్నప్పుడే నా నాటకరంగ ప్రవేశం జరిగింది. ‘మాలపిల్ల’, ‘శాకుంతలం’, ‘మా నాన్న కావాలి’ నాటకాలు వేసేవాణ్ణి. ఈ విషయంలో నాన్నతో గొడవపడి మరీ నాటకాల్లో నటించేవాణ్ణి. ఆ ధ్యాసలోపడితే పూర్తిగా చదువుపోతుందేమో అనేది నాన్నగారి ఆలోచన. అందుకే నాన్నగారు నన్ను వీటికి కొంచెం దూరంగా ఉంచేవారు. అయినా నేను పట్టుబట్టి నాటకాల్లో వేసేవాణ్ణి.
 
రసరంజని
కె.వి.రమణాచారిగారి ఆధ్వర్యంలో రసరంజని సంస్థ ప్రారంభమైంది. నాటకాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో ఈ సంస్థను వారు స్థాపించారు. ప్రేక్షకులు ఎంతోకొంత టిక్కెట్టు కొనుక్కుని నాటకాలు చూసేలా చెయ్యాలని వారి ఉద్దేశం. ఇందులోభాగంగా ఎంతోమంది పెద్దలు కృషి చేశారు.‘ప్రసన్నకు ప్రేమతో’, భరణిగారి ‘కొక్కొరొక్కో’ లంటి ప్రముఖ నాటకాలను ఒక్కొక్కటీ దాదాపు 15 రోజులపాటు ప్రదర్శించేవాళ్ళం. వాటిల్లో ముఖ్యపాత్రలు నాకే వచ్చేవి. ఇలా నా నట జీవితం నాటకాలతో ముడిపడి వెండితెర వరకు వెళ్ళింది.
 
తొలిచిత్రం బోయ్‌ఫ్రెండ్‌
నా మొదటి చిత్రం ‘బోయ్‌ఫ్రెండ్‌’. 1991లో వచ్చింది. ఈ సినిమా నిర్మించేముందు భరత్‌గారు జూబిలీహిల్స్‌లో ఇంటర్వ్యూలకు పిలిచారు. నీకు వేషం ఇస్తున్నాం అన్నారు. చాలా సంతోషం కలిగింది నాకు. ఆర్టిస్టుగా గుర్తింపు పొందడానికి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. కనీసం జూనియర్‌ ఆర్టిస్టు అనే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించేవారు. ఇదంతా మద్రాసులో సంగతి.
నా రెండవ చిత్రం ‘సూర్యపుత్రులు’ లో ఎస్‌.ఐ. పాత్ర చేశాను. అప్పటికే ఏ.వి.ఎస్‌. గారు మంచి పికప్‌లో ఉన్నారు. నా నటన చూశాక నన్ను దగ్గరకు పిలిచి, ‘‘విరగదీశావ్‌ కదయ్యా, కీపిటప్‌’ అని ఆశీర్వదించారు. కాకపోతే ఈ చిత్రం మూడు సంవత్సరాల తర్వాత 1996లో విడుదలైంది. నా మూడో చిత్రం రామబంటు. సూర్యపుత్రుడు కంటే ఈ చిత్రమే ముందు విడుదలైంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారు హీరో. నాది కొడుకు పాత్ర. మంచి కుటుంబ కథా చిత్రమిది. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 1995లో విడుదలైంది. పెద్దన్నయ్య, స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌, ఆది, ఏ ఫిలిమ్‌ బై అరవింద్‌, సరైనోడు, బ్లాక్‌ అండ్‌ వైట్‌, సై, విక్రమార్కుడు, జనతాగ్యారేజ్‌, యమదొంగ, నాన్నకు ప్రేమతో, లక్ష్మి, దూకుడు, క్షేత్రం, నాయక్‌...ఇలా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులు మెచ్చినవి, నాకు నచ్చినవీ ఉన్నాయి.
 
నా చిత్తశుద్ధేనన్నీస్థాయిలో నిలబెట్టింది
ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌లు అన్నపూర్ణా స్టూడియో, రామకృష్ణ సినీ స్టూడియో నిర్మాణాలతో హైదరాబాద్‌లో ఉండేవారు. అప్పటికి ఇండస్ర్టీ మద్రాసులోనే ఉండేది. సూర్యపుత్రులు సినిమా కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక పాఠశాలలో సెలక్షన్స్‌ జరిగాయి. ఈ చిత్రంలో నేను ఎస్‌.ఐ పాత్ర పోషించాను. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్లో నా ఫస్ట్‌సీన్‌తో షూటింగ్‌ ప్రారంభించారు. తర్వాత చెన్నైకి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన మొదటిరోజు అవమానానికి గురయ్యాను. నా ముతకబట్టలు చూసి షూటింగ్‌లో బోయ్‌ నన్ను ఈసడించుకుని ఫో, పోయి అక్కడ చెట్టు దగ్గర కూర్చో, ఇక్కడ సీనియర్స్‌ కూర్చుంటారు అన్నాడు హేళనగా విసుక్కుంటూ. వెంటనే ఏ.వి.ఎస్‌ గారు నన్ను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్‌ మూడు సంవత్సరాలు కొనసాగింది.
 
                    ఈ షూటింగ్‌ కోసం నేను దాదాపు పదహారు సార్లు చెన్నై – హైదరాబాద్‌ మధ్య తిరిగాను. ముమ్మట్టి, సుమన్‌ల డేట్స్‌ దొరికేవి కావు. షూటింగ్‌ ఉందనేవారు, వెళ్తే కేన్సిల్‌ అయిందనేవారు. నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే నేను ఆ రోజుల్లో ఈ సినిమాలో పాత్రకోసం అన్నిసార్లు ఎంతో కమిటెడ్‌గా ఓపికగా తిరిగాను. అవన్నీ మరపురాని సంఘటనలు. ఆ ఓపిక, చిత్తశుద్ధే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
జూనియర్‌ ఎన్టీఆర్‌ నేను క్లాస్‌మేట్స్‌ కాదు, మిత్రులం మాత్రమే. ఆయనతో నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవి కావడం ఒక సెంటిమెంట్‌. ఆయన చిత్రాల్లో నేను నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. మా కాంబినేషన్‌ బాగుంటుంది. అంతేతప్ప మరింకేం లేదు.
 
నచ్చిన దర్శకులు
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ గొప్ప దర్శకులే. కొత్త కొత్త యువ దర్శకులు తెరమీదకు వస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు యువ దర్శకుల ఆలోచనా విధానం కొత్తరకంగా ఉంటోంది. నటీనటులు కూడా అంతే. నాకు నచ్చిన దర్శకులలో రాజమౌళి, వి.వి.వినాయక్‌, బాపు, విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు...వీరందరి దర్శకత్వం నాకు బాగా నచ్చుతుంది. ‘నీతో’ అనే సినిమా వాళ్ళబ్బాయితో తీసి దర్శకత్వం వహించారు. ఆ తరువాత శాంతినివాసం సీరియల్‌, ఆయన ప్రొడ్యూస్‌ చేసినవాటిల్లో నేను చేశాను. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ ఆయన ప్రొడ్యూస్‌ చేసిన చిత్రమే. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అదేవిధంగా బాపుగారి టి.వి.సీరియల్‌ ‘భాగవత కథలు’ సీరియల్‌లో చేశాను. మేం ఫీల్డుకు వచ్చినప్పుడు జానపదాలు లేవు. పౌరాణికాలు లేవు. ఏవో అడపాదడపా పౌరాణికాలు వచ్చేవంతే.
 
నాకీ తృప్తి చాలు
తెలుగు చిత్రపరిశ్రమ వచ్చి 80 సంవత్సరాలు గడిచింది. ఒకప్పుడు, టి.వి. పరిశ్రమ సినిమాను డామినేట్‌ చేస్తోంది, సినీ పరిశ్రమ మూసుకుపోతుంది అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. రెండు పరిశ్రమలూ నిలదొక్కుకున్నాయి. కొత్తనీరు వచ్చి పాతనీటిని తోసేస్తుంది. అదేవిధంగా నటుడు ఎంతకాలం ఫీల్డులో ఉంటాడనే గ్యారంటీ లేదు. నేను ఇంతకాలం ఇండస్ర్టీలో కొనసాగానంటే కారణం ఆయా వ్యక్తుల మంచితనం, గొప్పతనం,సహకారం ఉండబట్టే. నిర్మాతలు, ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు గనుకనే ఇప్పటికి 110 సినిమాలు చేయగలిగాను. ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నాను. నాకీ తృప్తిచాలు.
 
ఇప్పటినటులకుఅవకాశాలెక్కువ
అప్పట్లో నటులకు మెయిన్‌రోల్‌ మీదే ఎక్కువ మక్కువ ఉండేది.
సినిమా అయినా, స్టేజీ నాటకమైనా నటులు ఎంతో జాగ్రత్తగా దర్శకుని అడుగుజాడల్లో నడిచేవారు. ఇప్పటి నటులకు అదేం లేదు. ఫాస్ట్‌ఫుడ్‌లా వేడి వేడిగా చేసేస్తున్నట్టే ఉంటోంది. అన్ని రకాల పాత్రలు చేసే అద్భుతమైన నటులు, మంచి నటులు మనకున్నారు. కంపేర్‌చేస్తే, ఆనాటి నటుల్లోనే ఎక్కువశాతం మంచి నటన కనబరిచేవారున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటితరంలో మాత్రం అలాంటివారిని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. ఇప్పుడు మంచి నటుడుగా తయారవ్వడానికి ఎన్నో మంచి అవకాశాలున్నాయి. జాగ్రత్తగా చేసుకుంటే లాంగ్‌ స్టాండింగ్‌ కెరీర్‌ ఉంటుంది.
 
మనది అంతర్జాతీయ స్థాయి
ఒకప్పుడు లవకుశ, మాయాబజార్‌ చిత్రాలతో తెలుగు పరిశ్రమను జాతీయస్థాయికి తీసుకువెళ్ళారు. కె.వి.రెడ్డి, హెచ్‌.ఎం.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ లాంటి మహనీయులు. అందుకోసం ఎంతో కృషి చేశారు. ఇప్పుడు బాహుబలితో తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. మన మార్కెట్‌ పెరిగింది. జానపద, పౌరాణిక, కుటుంబకథా,కౌబోయ్‌ చిత్రాలు ఏవైనా బ్రహ్మాండంగా తీయగల దర్శకులు మనకున్నారు. భవిష్యత్తు తెలుగు చిత్ర పరిశ్రమదే.
 
నాన్నగారు ఒక నిఘంటువు
నాన్న దేవదాస్‌ కనకాలగారు ఒక నిఘంటువు. విజనరీ. మోర్‌ ఓవర్‌ దిక్సూచి. ఈనాటి గొప్ప నటులంతా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవారే. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌, నాజర్‌, ప్రదీప్‌శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్‌ వీళ్ళంతా దక్షిణాదిన స్టార్సే. టీవీలో ఉన్న నటులంతా నాన్నగారివద్ద తర్ఫీదు పొందినవారే.
 
నా జీవితంలోఒక అద్భుతం సుమ
ఒక భర్తగా నేను చెప్పాలంటే, నా జీవితంలో ఏదైనా అద్భుతాలు జరిగాయంటే అందుకు నా భార్యే ముఖ్య కారణం. ఒక తల్లిగానే కాదు, అన్ని రంగాల్లో ఆమె రాణించడం నిజంగా గొప్ప విషయం. యాంకర్‌గా ఈనాడు తెలుగు రాష్ర్టాలలోనే కాదు, అన్ని రాష్ర్టాలవారు ఆమెను ఆదరిస్తున్నారు. ఒక మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌ ఆమెలో ఉన్నాయి. ఆడవారిలో ఉండే ఓర్పు, సహనం అన్నీ తనలో ఉన్నాయి. వేలు లక్షలమంది ముందు నిలబడి వేదికపై ఆమె తొణకకుండా బెణకకుండా ఏకధాటిగా మాట్లాడటం, యాంకరింగ్‌ చెయ్యడం అంటే కత్తిమీద సాములాంటిదే. అది అందరికీ సాధ్యం కాదు. ఒక భర్తగానే కాకుండా, ఒక అభిమానిగా నేను చెబుతున్నాను. షి ఈజ్‌ రియల్లీ గ్రేట్‌.
 
మా అమ్మ లక్ష్మీదేవే
మా అమ్మ అంటే అమ్మే! ఆవిడ నటి. మా అమ్మగారు సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌లో పనిచేస్తున్న సమయంలో 1971 నవంబరు 21న మా అమ్మా నాన్నల వివాహం జరిగింది. అమ్మ బి.ఏ.బిఇడి చదివి థియేటర్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. అనేక సార్లు ఉత్తమనటి అవార్డు అందుకున్న స్టేజీ ఆర్టిస్టు. నాన్నగారి శిష్యులందరూ ఇంచుమించు అమ్మ దగ్గర కూడా శిష్యరికం చేసినవారే.
 
కుటుంబం
నా భార్యపేరు సుమ. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి రోషన్‌. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు . అమ్మాయి మనస్విని . ఐదవ తరగతి చదువుతోంది.