
ఢిల్లీ: కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 2016 సంవత్సరానికిగాను కె.విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం విశ్వనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం జరగనుంది. సీతామాలక్ష్మి, సప్తపది, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శంకరాభరణం, స్వర్ణకమలం, శృతిలయలు, శుభసంకల్పం, స్వయంకృషి, స్వాతిముత్యం, సూత్రధారులు వంటి ఎన్నో సంగీత, నాట్య ప్రధానమైన ఉత్తమ చిత్రాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. తన సినిమాలలో సామాజిక అంశాలకే ప్రాధాన్యతనిస్తారు.
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా అయిన కళాతపస్విికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనతో యావత్ భారతీయ సినీ ప్రముఖులంతా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వనాథ్ రూపొందించిన శంకరాభరణం జాతీయ పురస్కారాన్ని దక్కించుకోగా, స్వాతిముత్యం చిత్రం ఆస్కార్‌కు అధికారిక ప్రవేశాన్ని దక్కించుకుంది. సంస్కృతికి పెద్ద పీట వేసే విశ్వనాథ్ చిత్రాల్లో నటించేందుకు అవకాశం రావడాన్ని నటీనటులంతా మహాభాగ్యంగా భావిస్తారు.
దర్శకత్వంతో పాటు పలు చిత్రాల్లో ఉదాత్తమైన పాత్రలను కూడా పోషించిన విశ్వానాథ్ ప్రస్తుతం ఈ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ 1957లో విడుదలైన తోడికోడలు చిత్రం కోసం సౌండ్ రికార్డింగ్ విభాగం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు వన్నెలద్దారు.