Apr 21 2017 @ 02:39AM

తెలుగు నాటకంపై చెరగని ముద్ర

ఆనాటి పరిషత్తు పోటీల్లో భానుప్రకాశ్‌ నాటకం తప్పనిసరిగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తపడేవారంటే ఆయనకి ఎంతటి ఫాలోయింగ్‌ ఉండేదో అర్థమవుతుంది. ఆయన ప్రదర్శించిన ‘ఒంటి కాలి పరుగు’, ‘నాణేనికి మరో వైపు’, ‘గాలిగోపురం’, ‘హలాల్‌’, ‘క్షణికం’ వంటి నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
 
 
ఒక జాతి తనను తాను రక్షించుకోవాలన్నా తన ఉనికి కాపాడుకోవాలన్నా తన జాతి గొంతుకను బలంగా వినిపించాలి. ఆ గొంతుకే భవిష్యత్‌ తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. తెలుగు నాటకరంగంలో అలాంటి స్ఫూర్తినిచ్చిన వారే భానుప్రకాశ్‌. నటుడిగా, ప్రయోక్తగా నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన ఆయన తెలంగాణ నాటకానికి తొలి గొంతుకయ్యాడు. పరిషత్‌ నాటక రంగంలో ఆయన పాద ముద్రలు ప్రముఖంగా కనిపిస్తాయి. తెలంగాణలో అబ్బూరి రామకృష్ణారావు నిర్దేశకత్వంలో మంత్రి శ్రీనివాసరావు, ఏ.ఆర్‌. కృష్ణలు ప్రయోగాత్మక నాటకానికి తెరలేపితే తెలంగాణ పరిషత్తు నాటకానికి భానుప్రకాశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తాడు. ఆయన ఎందరో నటీనటులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది నాటకరంగానికి పరిచయం చేసారు. నటుడు నూతనప్రసాద్‌, దేశిరాజు హనుమంతరావు, అమరేంద్ర, శశిమోహన్‌ వంటివారు ఆయన స్కూల్‌నుంచి వచ్చినవారే. 1939 ఏప్రిల్‌ 21న నల్లగొండలో అండాలమ్మ, వేంకటహరి దంపతులకు భానుప్రకాశ్‌ జన్మించారు. బాల్యంలోనే గ్రామ ఫోను రికార్డుల ద్వారా వేమూరి గగ్గయ్య పద్యాలను అనుకరిస్తూ అభినయించే భానుప్రకాశ్‌ను ఆయన తాత నాటకాల పట్ల ప్రోత్సహించారు.
 
సికింద్రాబాద్‌కు చెందిన ఎస్‌.కె. ఆంజనేయులు ‘విశృతి నాట్యమండలి’ని స్థాపించి ప్రయోక్తగా పద్యనాటకాలు, సాంఘిక నాటకాలను ప్రదర్శించేవారు. భానుప్రకాశ్‌ మేనమామ ధరణికోట శ్రీనివాసరావు విశృతి నాట్యమండలి నాటకాల్లో నటించేవారు. అక్కడ జరిగే రిహార్సల్స్‌ను, ప్రదర్శనలను క్రమంగా చూసే భానుప్రకాశ్‌ ఆంజనేయులుకు దర్శకత్వంలో ఏకలవ్య శిష్యుడయ్యాడు. ఆ స్ఫూర్తితోనే 1955లో భాగి నారాయణశాస్త్రి రచించిన ‘డాక్టర్‌ యజ్ఞం’ నాటికను 16 ఏళ్ళ వయస్సులోనే తొలిసారి భానుప్రకాశ్‌ దర్శకత్వం వహించి ప్రదర్శించారు. ఈ నాటికకు ఉత్తమ దర్శకుడిగా బహుమతి అందుకున్నారు. ఈ తొలి అడుగు ఆయనను తరువాతి కాలంలో గొప్ప నటుడిగా, ప్రయోక్తగా ఆవిష్కరించింది.
 
సైఫాబాద్‌ సైన్స్‌ కళాశాలలో చదువుకునే రోజుల్లో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమారుడు పి.వి. రంగారావు భానుప్రకాశ్‌కు సహవిద్యార్థి. వీరిద్దరూ నాట కాల్లో చురుకుగా పాల్గొనేవారు. అప్పట్లో ప్రతి సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాల సాంస్కృతికోత్సవాలను గిరిరాజ్‌ కోఠి (ఇప్పటి ఇ.యన్‌.టి. ఆస్పత్రి) మైదానంలో నిర్వహించేవారు. ఈ ఉత్సవాల్లో శ్రీరంగం శ్రీధారాచార్య రచించిన ‘ప్రతిధ్వనులు’ నాటకాన్ని భానుప్రకాశ్‌ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. పాత జ్ఞాపకాలు వెంటాడే ఇతివృత్తంలో సాగే ఈ నాటకం నటుడిగా, ప్రయోక్తగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన సోదరుడు శశాంకరావు ఈ నాటకంలో ఓ పాత్రను పోషించారు. డిగ్రీ, లా కోర్సులను పూర్తి చేసిన భానుప్రకాశ్‌ హెచ్‌.ఏ.ఎల్‌లో ఉద్యోగిగా చేరాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తున్నా నాటకాన్ని ఏనాడూ విస్మరించలేదు. ఆయన నాటక రంగాన్ని తొలిప్రాధాన్యతగా ఎంచుకున్నాడు. 1960లో కళారాధన నాటక సంస్థను ప్రారంభించి పరిషత్‌ నాటకాలకు నాంది పలికాడు. ప్రముఖ నాటక రచయిత ఆర్‌.వి.యస్‌. రామస్వామి ఆయనకు తోడుగా నిలిచాడు. రామస్వామి రచించిన నాటకాలు భానుప్రకాశ్‌ దర్శకత్వంలో రంగస్థల వేదికలపై కళాత్మకంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ ప్రదర్శనలే ఆయనను నాటక రంగ ప్రముఖుడిగా సుస్థిరం చేసాయి. ‘చీకటి కోణాలు’, ‘గాలివాన’, ‘వలయం’, ‘కెరటాలు’, ‘వెల్లువ’, ‘శ్రీమాన్‌ శ్రీమతి’ నాటకాలు ఆయనకు ప్రఖ్యాత నటుడిగా, ప్రయోక్తగా గుర్తింపు తెచ్చాయి. ‘గాలివాన’ నాటకం భానుప్రకాశ్‌ను తెలుగు నాటక రంగాన శిఖరాయమానంలో నిలిపింది. ఆనాటి పరిషత్తు పోటీల్లో భానుప్రకాశ్‌ నాటకం తప్పనిసరిగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తపడేవారంటే ఆయనకి ఎంతటి ఫాలోయింగ్‌ ఉండేదో అర్థమవుతుంది. ఆయన ప్రదర్శించిన ‘ఒంటి కాలి పరుగు’, ‘నాణేనానికి మరో వైపు’, ‘గాలిగోపురం’, ‘హలాల్‌’, ‘క్షణికం’ వంటి నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. భానుప్రకాశ్‌ నటుడిగా ప్రదర్శించిన ప్రతి నాటకం ప్రశంసలందుకుంది.
 
ఆ రోజుల్లో భానుప్రకాశ్‌ నాటకాలను ఎందరో సినీ ప్రముఖులు తప్పకుండా చూసేవారు. ప్రఖ్యాత సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావులు భానుప్రకాశ్‌ను విశేషంగా అభిమానించేవారు. వారి ప్రోత్సాహంతో భానుప్రకాశ్‌ సినీ రంగంలో అడుగుపెట్టి తన ప్రత్యేకత చాటాడు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా అన్నపూర్ణ సినీ సంస్థ నిర్మించిన ‘పూలరంగడు’ సినిమాలో భానుప్రకాశ్‌ విలన్‌గా పరిచయం అయ్యాడు. అందులో మరో విలన్‌ గుమ్మడితో పోటీపడి ఎలా నటిస్తారో మరి అని దుక్కిపాటి హెచ్చరించాడట. నాటక రంగంలో విశేష అనుభవం కలిగిన భానుప్రకాశ్‌ పెద్ద నటుల మధ్య పోటీపడి అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ఆయనకు మంచిపేరును తెచ్చిపెట్టింది. ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘బుద్ధిమంతుడు’, ‘ఆత్మీయులు’, ‘భక్త తుకారం’, ‘ముద్దుల కొడుకు’, ‘చిల్లరదేవుళ్ళు’, ‘పల్లె పిలిచింది’, ‘పారిజాతం’ వంటి అనేక సినిమాల్లో నటించారు. నాటకాల్లో హీరో పాత్రలు పోషించిన భానుప్రకాశ్‌ సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించడం యాదృచ్ఛికమే అయినా ప్రతిభగల నటుడిగా సినీ రంగంలో గుర్తింపు పొందాడు. నాటకానికి చిరునామాగా నిలిచిన భానుప్రకాశ్‌ 2009 జూన్‌7న మరణించారు. ఆయన సోదరులు అమరేంద్ర, కొడుకు హరి ఆయన నటవారసులుగా ఈనాటికీ నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెలుగు నాటకరంగంలో భానుప్రకాశ్‌ నిలువెత్తు సంతకమై జీవించే ఉంటాడు.
డాక్టర్‌ జె. విజయ్‌కుమార్జీ
తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యక్షులు
(నేడు రంగస్థల నటుడు, ప్రయోక్త భానుప్రకాశ్‌ జయంతి)