Apr 4 2017 @ 23:07PM

గదిలోకి వెళ్లగానే చాలా సీరియస్‌గా ఉండిపోయేదాన్ని: హిమజ

గలగలా మాట్లాడే ‘హిమజ’ అలవోకగా తెర మీద ప్రత్యక్షం కాలేదు. అందరిలాగే కాలేజీ చదువు చదివి.. అవకాశాల కోసం అన్వేషించి.. అడ్డంకులను అధిగమించి.. ఇప్పుడొక స్థానం సంపాదించుకుంది. నటనలోనే కాదు, జీవితంలోను - హిమజ యంగ్‌ అండ్‌ డైనమిక్‌. టీవీ సీరియల్స్‌ మొదలు.. ‘శతమానంభవతి’ వరకు ఆమె లైఫ్‌ ఎలా సాగిందంటే..

‘‘ఆడుతూపాడుతూ చదివేశాం. పట్టా చేతికొచ్చింది. ఇక, జీవితాన్ని పట్టాలెక్కించడమే మిగిలుంది. ఏం చేస్తే బావుంటుంది? ఎడతెగని ఆలోచనలు. సంఘర్షణ. ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేం! సగానికి పైగా యువత సమస్య ఇది. నాకు కూడా అలాంటి అనుభవం ఉంది. వాస్తవానికి మా నాన్న చంద్రశేఖర్‌రెడ్డికి బుల్లితెరతో సంబంధం ఉంది. నేను ఇంటర్‌మీడియట్‌లో ఉన్నప్పుడే ‘సర్వాంతర్యామి’ అనే టెలిఫిల్మ్‌లో నటించాను. సాయిబాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ టెలిఫిల్మ్‌కు మాటలు, పాటలు రాసింది నాన్నగారే! చిన్నప్పుడే నటనతో పరిచయం ఉందన్నమాట. కానీ, మళ్లీ అటువైపు ఆలోచన రాలేదు.
 
రొటీన్‌కు బైబై
డిగ్రీ పూర్తయింది. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి కదా! అన్వేషించాను. టీచర్‌ ఉద్యోగం దొరికింది. సామాజికశాస్త్రాన్ని బోధించడం నా పని. రోజు ఉదయాన్నే వెళ్లడం, పిల్లలకు పాఠాలు చెప్పడం.. సాయంత్రం ఇంటికి చేరుకోవడం..చాలా రొటీన్‌. కొన్నాళ్లకు బోర్‌ కొట్టింది. ఎందుకో నాకు తెలియకుండానే.. తరగతి గదిలోకి వెళ్లగానే చాలా సీరియస్‌గా  ఉండిపోయేదాన్ని. వాస్తవానికి అది నా స్వభావం కాదు. అందుకే, నాకు నేనే నచ్చలేదు. కేవలం ఆర్నెళ్లు. ‘వద్దురా బాబు ఈ ఉద్యోగం’ అనే పరిస్థితికి వచ్చేశా. ఒక రోజు హఠాత్తుగా మానేశా. మళ్లీ ఇంకో అన్వేషణ. అప్పుడు తగిలింది హెచ్‌ఆర్‌ ఉద్యోగం. మొక్కుబడిగా చేరాను తప్పిస్తే.. ఊహూ! అందులోను క్రేజ్‌ లేదు. మనసుకు నచ్చలా. ఇంకేముంది, షరా మామూలే..! నమస్కారం పెట్టి వదిలేయడం. ఉద్యోగాలు మానేస్తూ పోతున్నాను కానీ.. ఇంతకూ ఏం చేయాలి? మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఎవరో ఏదో అలవోకగా అన్న మాటలు.. ఒక్కోసారి మన జీవితాల్ని పెద్ద మలుపే తిప్పుతాయి.
 
క్లాస్‌రూం టు క్లాప్‌బోర్డ్‌
బహుశా నేనప్పుడు టీచర్‌ ఉద్యోగంలో ఉన్నాననుకుంటా. నాతోపాటు పనిచేసే ఉద్యోగుల్లో కొందరు ‘‘నువ్వు చూడటానికి చాలా బావుంటావు కదా! సినిమాల్లోకి ఎందుకు ప్రయత్నించకూడదు’’ అన్నారు. నిజానికి మనచుట్టూ ఉన్న వ్యక్తులు ఇచ్చే కాంప్లిమెంట్లే మనల్ని చాలా ఉత్సాహపరుస్తాయి. అంతకంటే ఎక్కువ ఆలోచింపజేస్తాయి. ‘‘నిజమే కదా! నేను నటిని ఎందుకు అవ్వకూడదు?’’ అంతర్మధనం మొదలైంది. అందులోను చిన్నప్పుడు ఒక సీరియల్‌లోనూ నటించానుగా! కెమెరా ముందు నిల్చోవడం కూడా కొత్తకాదు.. అనుకున్నాను. నటిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది నాన్నగారే కావడం విశేషం.
 
అన్నీ సగం సగం..
అమ్మకు నా మీద ఒక ఫిర్యాదు ఉంది.. ‘‘ఏంటే. అన్నీ సగం సగం పనులే చేస్తుంటావు?’’ అని. అమ్మ చెప్పింది నిజమే! ఉద్యోగం, సీరియల్స్‌, సినిమాలు.. ఇలా అన్నింటిలోను వెళుతున్నాను కాబట్టి. ఒక వయసులో కన్ఫ్యూజన్‌ సహజం. అందులో నుంచి నేర్చుకున్న పాఠాలే.. రాటుదేలే అనుభవాలుగా మిగిలిపోతాయి. కొన్ని సీరియల్స్‌లో చేశాక.. సినిమాల్లో నా కెరీర్‌ మొదలైంది. నా తొలి చిత్రం ‘శివం’. అందులో రాశీఖన్నాకు స్నేహితురాలి పాత్ర నాది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘చందమామరావే’, ‘జనతాగ్యారేజ్‌’, ‘ధృవ’, ఈ మధ్యనే వచ్చిన ‘శతమానంభవతి’ ఇలా నటిస్తూ వెళుతున్నాను. వాస్తవానికి సీరియల్స్‌లో చేస్తున్నప్పుడు అయితే దుస్తులు మార్చుకోవడానికే సమయం ఉండేది కాదు. సినిమాల్లో కాస్త తీరిక దొరుకుతోంది.
అందులోను ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తున్నది.
 
అందరూ మెల్లమెల్లగా నేనెక్కడ కనిపించినా ‘అదిగో హిమజ.. హిమజ’ అంటున్నారు. ముఖ్యంగా ‘శతమానంభవతి’లో చేసిన సుబ్బలక్ష్మి పాత్ర మంచి పేరుతెచ్చింది. బుల్లితెర మీద చేసినప్పుడు.. నాకు రెండు అవార్డులు వచ్చాయి. అంతకంటే సినిమాల్లో పేరొస్తోంది. ఇప్పుడు నా కెరీర్‌ పట్ల నాకొక స్పష్టత వచ్చింది. ఇక, వెండితెర మీదే భిన్నమైన పాత్రల్సి పోషించాలన్న ఆసక్తితో .. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నా. ఎవరిలోనైనా కన్ఫ్యూజన్‌ ఎందుకుంటుంది? ఒక స్పష్టత కోసం! ఆ స్పష్టతను మనకు మనమే అన్వేషించుకుంటూ వెళ్లాలి. అందుకు అనుభవాలు అవసరం. కొంత ప్రయాణం సాగడం ముఖ్యం. అప్పటి వరకు ఓపిక పట్టాలి. నేను అదే చేశాను. నాకంటూ సినిమాల్లో ఒక పునాది వేసుకున్నాను. ఇక, మంచి నటిగా ఎదగడమే నా ముందున్న సవాలు.’’

‘‘సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పరాభవాలు తప్పవు. నన్ను కొందరు అన్నారు ‘‘లుక్‌ బాలేదు. నీ ముఖానికి మేకప్‌ సరిగా పడదు. ఎంత చెప్పినా ఇంతేనా, నటనలో మెరుగుపడాలి’’ ఇటువంటి కామెంట్లు వచ్చాయి. అవి అందరికీ ఎదురయ్యేవే! ఇక, గాసిప్స్‌ అంటారా? సినిమా పరిశ్రమలో ఒక ఆడపిల్ల అడుగుపెడుతూనే.. గాసిప్స్‌ నీడలా రావడం మొదలుపెడతాయి. నా మీద రూమర్స్‌ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. అవేవీ పట్టించుకోకుండా.. నా పని నేను చేసుకు పోవడం అలవాటు చేసుకున్నాను..’’

‘‘మా సొంతూరు మంగళగిరికి దగ్గర్లోని వేర్లపాలెం. అది మా అమ్మమ్మ వాళ్ల ఊరు. మా నాన్న చంద్రశేఖర్‌రెడ్డి ఆర్టీసీలో పాతికేళ్లు పనిచేశారు. అమ్మ గృహిణి. అన్నయ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మాది మధ్యతరగతి కుటుంబం. ‘భార్యామణి’, ‘స్వయంవరం’, ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ సీరియళ్లు పేరుతెచ్చాయి. అవన్నీ సినిమాల్లోకి ప్రవేశించడానికి పనికొచ్చే అనుభవాన్ని ఇచ్చాయి..’’

- రాళ్లపల్లి రాజావలి