Mar 27 2017 @ 09:23AM

చరిత్రలో నాకో పేజీ ఉండాలి: బుర్రా సాయిమాధవ్

తెలుగు తెరపై తెనాలి వాసులెందరో మెరిశారు.. ప్రేక్షకుల మదిలో నిలిచారు. ఈ మధ్య కాలంలో పాత్రోచిత పదాలతో అచ్చతెలుగు డైలాగులతో చిత్రసీమలో తారాజువ్వలా దూసుకుపోతున్నారు బుర్రా సాయిమాధవ్‌. కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాజుగారి గది, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, ఖైదీ నెంబర్‌ 150, గౌతమిపుత్ర శాతకర్జి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు చిరకాలం గుర్తుండిపోయేలా పదునైన డైలాగులెన్నో రాశారు. వెండితెరపై కాంతులీనుతున్న ఆయన చలనచిత్ర రంగ ప్రయాణాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
 
తెనాలి : కళల కాణాచి తెనాలి నా స్వస్థలం. నాన్న బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, అమ్మ జయలక్ష్మి ఇద్దరూ కళాకారులే. నేను 1973 డిసెంబర్‌ 16న జన్మించా. తమ్ముడు నరసింహ. మా ఇంటిలో నిత్యం నాటకాల రిహార్సల్స్‌ జరుగుతుండేవి. హర్మోనియం శబ్దాలు జోలపాటలుగా మారాయి. అమ్మనాన్నలు నాటకాల నిమిత్తం వెళితే కనీసం 10-15 రోజులు ఇంటికి వచ్చేవారు కాదు. మా ఆలనాపాలనా అమ్మమ్మే చూసేది. ఆమె పేరు కోటేశ్వరమ్మ.. ఇంకో పేరు పిచ్చమ్మ. అంటే సినిమా పిచ్చమ్మ. రోజూ సినిమా చూడాల్సిందే. పసి పిల్లవాడినైన నన్ను చంకన వేసుకుని సినిమాకు వెళ్లేది. అందుకే నేను చూడని పాత సినిమా లేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సినిమాలు తప్పకుండా చూసేవాణ్ణి. ఎన్టీఆర్‌ నా అభిమాన నటుడు. ఆయన సినిమాల్లోని కథానాయకుని పాత్రలను పరిశీలించేవాణ్ణి. ప్రతి నాయకుడు, సపోర్టింగ్‌ క్యారెక్టర్లు ఇలా ఉండాలి అని తెలుసుకున్నా. అప్పటి నుంచే సినిమాను అమితంగా ప్రేమించడం అలవాటు అయింది. నేను పదో తరగతి వరకు తాలూకా హైస్కూలో, ఇంటర్‌ వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్ వీఆర్‌ కళాశాలలో చదివా.

నేను చదువుకుంటున్న తాలూకా హైస్కూల్‌లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ రోజు సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు వేషం వేసే బాలనటుడు రాకపోవడంతో నాకు ఆ వేషం వేసి స్టేజ్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత పలు పౌరాణిక పాత్రలు వేయడంలో అమ్మ మెలకువలు నేర్పించింది. దుర్యోధనుడి పాత్రను పలుసార్లు పోషించా. ఆ ప్రదర్శనలు చూసిన మా గురువులు బొల్లిముంత కృష్ణ మాస్టారు గడియారం అనే నాటకంలో నా చేత వేషం వేయించారు. అప్పటి నుంచి బొల్లిముంత కృష్ణగారి తండ్రిగారైన అభ్యుదయ రచయిత, ప్రముఖ సినీరచయిత బొల్లిముంత శివరామకృష్ణ, నటులు, దర్శకులు ఎంపీ కన్నేశ్వరరావు, పగడాల శ్యాంసుందర్‌, దేవిశెట్టి కృష్ణారావు తదితరుల ప్రోత్సాహంతో నాటకాలు వేయడం మొదలైంది.
 
ఎందుకు రాయకూడదు...
నాటకాలు వేయడమే కాదు ఎందుకు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ ఫలితమే దాకలమూచి, అద్దంలో చందమామ అనే నాటికలు. అవి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాటక పరిషతలలో బహుమతులు గెలుచుకున్నాయి. నాటక రచయితగా గుర్తింపు తెచ్చాయి. దీనికితోడు నా మిత్రుడు చెరుకుమల్లి సింగారావు అభ్యుదయ వాది. ప్రజా నాట్యమండలిలో కీలకపాత్ర పోషించేవారు. ఆయన భావజాలం నాపై తీవ్ర ప్రభావం చూపింది. నాటకాలు ముమ్మరం కావడంతో చదువుపై దృష్టిపోయింది. రంగస్థలం ఆ స్థానాన్ని భర్తీచేసింది. ప్రముఖ దర్శకుడు పీఎన్ రామచంద్రరావు బంధువైన తెనాలికి చెందిన నూతలపాటి సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే చిత్రసీమకు దారి తీసింది. సత్యనారాయణ గారు ఎన్నో సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశారు. ఆయనే నాకు కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్‌లో ప్రాథమిక అంశాలు నేర్పించారు. వృత్తిరీత్యా బీజీగా ఉండటంతో ఆయనకు వచ్చిన అవకాశాలను నాకు కల్పించారు. ఆ చిత్రం పేరు తాళికట్టు శుభవేళ. ఆ సినిమాకు ఘోస్ట్‌రైటర్‌గా పని చేశా. అందుకోసమే హైదరాబాద్‌లో అడుగుపెట్టా. ఆ తర్వాత హైటెక్‌ స్టూడెంట్స్‌ అనే చిత్రానికి పాటలు రాశా. తొలిసారిగా బుర్రా సాయిమాధవ్‌ అనే టైటిల్‌ కార్డును వెండితెరపై చూసుకున్నా.
 
నిద్రపోని రాత్రులు
హైదరాబాద్‌లో ఉండే సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయానికి హాస్యనటులు బ్రహ్మానందం కారణం. దిల్‌ రాజుకు పరిచయమైన సమయంలో ఆయన కొన్ని సినిమాలు పంపిణీచేసి నష్టపోయారు. అలా జరిగి ఉండకపోతే నా దిల్‌ ఇంకా కొంచెం ముందే మొదలై ఉండేది. సత్యనారాయణ స్వామి మహత్మ్యం అనే సినిమాకు మాటలు, పాటలు రాశా. ఈ చిత్రాలేవి నాకు గుర్తింపు ఇవ్వలేదు. బతుకు భారమైంది. హైదరాబాద్‌లో నేను, నా మిత్రుడు సింగారావు పరిశ్రమలో నిలబడాలని ఎన్నో ఇబ్బం దులను ఓర్చుకుని ఉన్నాం. ఆకలి తీరని రోజులు, నిద్రపోని రాత్రులు ఎన్నో అనుభవించాం. అలాంటి సమయంలోనే సీతతో నాకు పెళ్లైంది. మాకు ఇద్దరు కుమార్తెలు మీనాక్షి, సాయిచరణి. జీవనం ఎంత కష్టమైనా నా ప్రయత్నం ఆగలేదు.
 
అగ్రహీరోలకు ఒకేసారి....
నేను రాసిన సీరియల్స్‌లో నాగబాబు హీరోగా ఉన్నారు. అందువల్ల ఆయనతో పరిచయం ఉంది. పవనకల్యాణ్‌ గారికి పరిచయం చేసి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాకు మాటలు రాసే అవకాశం నాగబాబు కల్పించారు. అలా చిరంజీవిగారి కుటుంబానికి దగ్గరయ్యా. ఖైదీ నెంబర్‌ 150 సినిమాకు ఆ పరిచయాలే కారణమయ్యాయి. క్రిష్‌గారు చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో రెండోసారి అవకాశం కల్పించారు. ఒకేసారి అగ్రహీరోలతో పనిచేసే అదృష్టం వరించింది. రెండు చిత్రాల్లోని నా మాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రస్తుతం వైజయంతి మూవీస్‌లో తెరకెక్కుతున్న ‘మహానటి’ అనే చిత్రానికి మాటలు రాస్తున్నా. మహానటి సావిత్రి బయోపిక్‌ చిత్రమిది. శరభ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పవన కల్యాణ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, క్రిష్‌తో మరో చిత్రం చర్చల దశలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం హిట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ చిత్రానికి మాటలు రాసింది నేనే.
 
సొంతూరులో సన్మానం
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ సీరియల్‌కు నంది పురస్కారం అందుకున్నా. నా సొంత ఊరు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం అందుకున్నా. సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోవడం ఎప్పటికీ మర్చిపోను. అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ నుంచి మెప్పు పొందడం ఆనందం. చలనచిత్ర రంగంలో నా అభిమాన రచయిత ఆత్రేయ. ఆయన నుంచి నేటితరం రచయితలు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వరకు అందరి ప్రభావం నాపై ఉంటుంది. రాబోయే తరాలకు నేను కూడా కనపడాలి. నా ప్రభావం ఉండాలి. నా ముద్రలు చెరిగిపోకుండా ఉండాలి. తెలుగు చలన చిత్రం ఒక మహాగ్రంథమైతే అందులో నాకో పేజీ ఉండాలి. కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కోలిపేది అని నమ్ముతా.
 
క్రిష్‌తో పరిచయం...
బుల్లితెర నా మస్తిష్కంలో మెరిసింది. ఓ ప్రముఖ చానల్‌ మినీ మూవీస్‌ అనే కార్యక్రమం చేస్తోంది. అందులో అవకాశం దొరికింది. అలాంటివి చేసి నా ప్రత్యేకతను నిరూపించుకున్నా. అదే చానల్‌లో ప్రసారమయ్యే పుత్తడి బొమ్మ సీరియల్‌కు మాటలు రాశా. దర్శకుడు క్రిష్‌గారి తండ్రి సాయిబాబు ఆ సీరియల్‌కు నిర్మాత. ఈ నేపథ్యంలో క్రిష్‌గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆయన గమ్యం, వేదం సినిమాలను పూర్తిచేశారు. నా ప్రతిభను గుర్తించి ‘సాయి మనం కలసి సినిమా చేస్తున్నాం. సీరియల్స్‌ వద్దు’ అని చెప్పారు. తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్‌ సినిమాకు మాటలు రాసే అవకాశమిచ్చారు. అందులోని డైలాగులు విస్తృత గుర్తింపు తెచ్చాయి. ఆ సమయంలో రానా ద్వారా సురేష్‌బాబుతో పరిచయం ఏర్పడింది. వారు నిర్మిస్తున్న గోపాల గోపాల సినిమాకు అవకాశం వచ్చింది. తొలిసారిగా స్టార్‌హీరోస్‌తో పనిచేసిన సినిమా అది. ఆ క్రమంలోనే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి మాటలు రాశా.
 
వన్స్ మోర్
కృష్ణం వందే జగద్గురుమ్‌
‘అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే పుట్టామనుకుంటారు కొందరు. కాదు నాన్న పక్కన పది నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండు నిజాలే కానీ పురిటి నెప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు. పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు. కళ అంటే బతుకునిచ్చేదే అనుకోకు. బతుకు నేర్పిది కూడా’
‘దేవుడంటే సాయం ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడన్నారు. ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు. మహావిష్ణువు అవతారం అన్నారు. తాత రాసింది దేవుడు గురించి కాదు సాయం గురించి’
 
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
 • ఏ మతంలోనైనా ఒకేలా ప్రేమించుకుంటారు.
 • ప్రేమంటే కలిసి ఉండటమే కాదు.. దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం.
 • ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు.. కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు.
 • బిడ్డ ఆకలి తీరాక తల్లి ఆకలి మొదలవుతుంది.
 • కన్నీళ్లు మనకు వస్తే కష్టం అవుతుంది. అదే మనకోసం వస్తే ప్రేమ అవుతుంది.

ఖైదీ నెంబర్‌ 150
 • పట్నాలు పల్లెటూర్లకు పిల్లలు
 • పొగరు నా ఒంట్లో ఉంటాది, హీరోయిజం నా ఇంట్లో ఉంటాది
 • సాగులేదని భూమిని అమ్ముకుంటే, సాకలేదని అమ్మను అమ్ముకున్నట్లే

గౌతమిపుత్ర శాతకర్జి
 • విశ్రాంతి లేదు. విరామం లేదు. నా కత్తినంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా శరణమా రణమా.
 • ఇప్పటికీ ఉనికినే నిలుపుకున్నాం. ఇక ఉనికిని చాటుకుందాం.
 • దొరికిన వాడిని తురుముదాం. దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం.
 • నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు.. ఓ చరిత్రకు.
 • తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.