Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 21 Mar 2017 22:09:14 IST

సరిలేరు నీకెవ్వరూ...

సరిలేరు నీకెవ్వరూ...

ఎన్టీఆర్‌కు వరుసకు బావమరిది, ఆ తర్వాత వియ్యంకుడు అయిన యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన సినిమా ‘కంచుకోట’. ఇవాల్టితో 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. త్రిపురనేని మహారథి రాసిన కథ, స్ర్కీన్‌ప్లే ఆకట్టుకుంటాయి. జానపద చిత్రాల్లోను సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి చిత్రం ‘కంచుకోట’. జానపదాల్లోనూ స్ర్కీన్ ప్లే అప్లై చేసి గ్రాండ్‌ సక్సెస్‌ చూసిన సినిమా ఇది. కాగా ఈ చిత్రాన్ని ఏరియాలవారిగా రైట్స్‌ అమ్మి అప్పట్లో సంచలనం సృష్టించారు విశ్వేశ్వరరావు. 1967 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. నిర్మాణ వ్యయం ఏడు లక్షలు కాగా మొదటివారమే ఏడు లక్షలు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.
 
మేటి నటుల కలయిక
‘కంచుకోట’లో ఎన్టీఆర్‌, కాంతారావు, ఉదయ్‌కుమార్‌, సావిత్రి, దేవిక, ధూళిపాల, ప్రభాకరరెడ్డి, పద్మనాభం, వాణిశ్రీ, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య తదితరులు నటించారు. కేవీ మహదేవన్ సంగీతం అందించగా ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, మహారథి పాటలు రాశారు. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా అలరించడం విశేషం. ‘కంచుకోట’ చిత్రం తొలిసారి విడుదలైనప్పుడు సంచలన విజయం సాధించి, వసూళ్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. 1975లో ఈ చిత్రం రిపీట్‌ రనలో హైదరాబాద్‌లో మూడు ఆటలతో వందరోజులు ఆడింది. రెగ్యులర్‌ షోస్‌తో రిపీట్‌ రనలో సెంచరీ చూపిన తొలి భారతీయ చిత్రం కావడం మరింత విశేషం. ఈ సందర్భంగా 1975 డిసెంబర్‌ 5న హైదరాబాద్‌ శోభన థియేటర్‌లో ఈ చిత్ర రిపీట్‌ రన్ శతదినోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాతి రోజుల్లో ఈ చిత్రాన్ని అనుసరించి పలు జానపద చిత్రాలు రూపొందాయి. అయినప్పటికీ కంచుకోట స్థాయిలో అవి అలరించకలేకపోయాయి. ఈ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ‘సరిలేరు నీకెవ్వరూ...’ దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్‌ మేటి జానపద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘కంచుకోట’ 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.