Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 25 Feb 2017 03:05:43 IST

వినోద విజ్ఞానాల కృషీవలుడు

వినోద విజ్ఞానాల కృషీవలుడు

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. మట్టిలో మాణిక్యం. విజయానికి మారు పేరు. ఒక కుగ్రామంలో, రైతు కుటుంబంలో పుట్టి ఎర్రగడ్డల వ్యాపారం చేస్తూ స్వయం కృషి, స్వీయప్రతిభ, సృజనాత్మకతతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నతుడు. నేటి తరానికి మార్గదర్శి, ‍స్ఫూర్తి ప్రదాత.
 
 
ఏనుగు మొదలుకుని పిపీలీకం (చీమ) వరకు అనంతకోటి జీవరాశుల్లో మానవజన్మ సర్వోత్కృష్టమైనది. ఈ భూమి మీద నేటి వరకు కొన్ని కోట్ల మంది మానవులు పుట్టారు, గిట్టారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర వేయగలిగారు. వారే చరితార్థులు, చరిత్రకారులు. ఆ కొద్దిమంది కోవకు చెందినవారే కీర్తిశేషులు బి. నాగిరెడ్డి.
ఆయన పూర్తి పేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై. కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్‌ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్‌ బి.ఎన్‌. రెడ్డి గారు నాగిరెడ్డి గారికి స్వయానా అన్న. మల్లీశ్వరి సినిమాకు కెమెరా మెన్‌గా పనిచేసిన కొండారెడ్డి, వ్యాపారవేత్త రామలింగారెడ్డి నాగిరెడ్డి గారి తమ్ముళ్లు. ఈయన బాల్యం నాన్నమ్మ గారి ఊరు అయిన వై. కొత్తపల్లెలో, అమ్మమ్మ గారి ఊరు అయిన పొట్టిపాడు (కొండాపురం మండలం)లో గడిచింది. ప్రాథమిక విద్య వై. కొత్తపల్లెలో జరిగింది. అప్పటికే వీరి కుటుంబ సభ్యులు మద్రాసు నుంచి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. అందువల్ల మద్రాసులో హైస్కూల్‌ విద్యను అభ్యసించారు.
 
అచట పుట్టిన చిగురు కొమ్మయినా చేవగానే ఉంటుందన్నట్లు ఈ గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది. పులివెందుల –- తాడిపత్రి మార్గంలో పులివెందుల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. జనాభా 800 మాత్రమే. ఎంతో మంది ప్రతిభా మూర్తులకు జన్మనిచ్చింది. ఈ గ్రామానికి చెందిన కొక్కంటి సుబ్బారెడ్డి, లింగిరెడ్డి వెంకటరెడ్డి, చింతా నర్సింహారెడ్డి, గుండ్రెడ్డి సోమిరెడ్డి, వి.హెచ్‌. రామిరెడ్డి అనువారు మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వమే ఇంగ్లండ్‌ వెళ్లి బారిస్టర్‌ చదివారు.
 
చిత్రపరిశ్రమకు మూల విరాట్టులైన బి.ఎన్‌. రెడ్డి, నాగిరెడ్డి ఈ గ్రామవాసులే. భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, కడప జిల్లా పరిషత్‌ తొలి చైర్మన్‌, మాజీ పరిశ్రమల మంత్రి పెంచికల బసిరెడ్డి, ప్రముఖ గాంధేయవాది, మాజీ శాసనసభ్యులు చవ్వా బాల్‌రెడ్డి ఈ గ్రామవాసులే.
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, టంగుటూరు ప్రకాశం పంతులు వంటి ప్రముఖుల వల్ల స్ఫూర్తి పొంది విద్యార్థి దశలోనే నాగిరెడ్డి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. నాగిరెడ్డి గారి దృష్టి కుటుంబ సభ్యులు నిర్వహించే బి.ఎన్‌.కె. ప్రెస్‌ వైపు మళ్లింది. చక్రపాణి గారితో కలిసి ఆంధ్రజ్యోతి మాసపత్రికను 1945లో ప్రారంభించారు. 1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డిగారు అని పిలిచేవారు. మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు.
 
1949–-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్‌కేర్‌ సెంటర్‌, విజయా హెల్త్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు.
 
1950లో విజయా ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్‌, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీసు హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఓ ఎన్టీఆర్‌ను, ఓ ఎస్వీ రంగారావును, ఓ సూర్యకాంతాన్ని, ఓ సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. 1957లో నిర్మించబడిన మాయాబజార్‌ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. ప్రేక్షక లోకానికి షడ్రసోపేతమైన విందు భోజనం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష. ఎన్టీరామారావును శ్రీకృష్ణుడి పాత్రలో చూడడం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది.
 
1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మించబడింది. ఆలిండియా ఫిల్మ్‌ సమ్మేళన్‌కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు నాలుగు సార్లు అధ్యక్షులు. 1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్‌, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బి.ఎన్‌. రెడ్డి, బి. నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్‌, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది.
 
బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. మట్టిలో మాణిక్యం. విజయానికి మారు పేరు. ఒక కుగ్రామంలో, రైతు కుటుంబంలో పుట్టి ఎర్రగడ్డల వ్యాపారం చేస్తూ స్వయం కృషి, స్వీయప్రతిభ, సృజనాత్మకతతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నతుడు. నేటి తరానికి మార్గదర్శి, ‍స్ఫూర్తి ప్రదాత.
డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి
అధికార ప్రతినిధి, ఏపీసీసీ
(నేడు నాగిరెడ్డి 12వ వర్థంతి)

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.