desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 20 2017 @ 01:32AM

బడుగు కులాల బతుకులు ఛిద్రం!

  • తెలుగు రాష్ట్రాల్లో దారిద్య్రంలో శతాధిక బీసీ వర్గాలు 
  • వెనుకబడిన తరగతుల్లో అవకాశాలన్నీ పది కులాలకే  

తెలుగు రాష్ట్రాల్లో బీసీల్లో 120కి పైగా కులాలు ఉండగా వాటిలో 110 కులాలు అత్యంత వెనుకబడినవే! ఆది నుంచి ఇప్పటి వరకూ వీరంతా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. కులవృత్తులు కనుమరుగవడం, ప్రత్యామ్నాయ ఉపాధి మారర్గాలు లేక కష్టాలు అనుభవిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా ఆ వర్గానికి చెందిన పది పెద్ద కులాల వారు మాత్రమే ఆ ఫలాలను అనుభవిస్తున్నారనే అరోపణలున్నాయి. మిగిలిన 110 కులాల వారు మొత్తం కలిపి బీసీ జనాభాలో 38 శాతం వరకు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వీరి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గ్రామాల్లో ఉపాధి లభించక పట్టణాలకు వలస వెళ్లి కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ కాళప్ప చొరవతో బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కసరుత్తు ప్రారంభించింది. తెలుగు రాషా్ట్రల్లో రిజర్వేషన్లు ఉన్నా వాటి ఫలాలు అందక చీకటిలో మగ్గుతున్న బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్ణాల ప్రజల జీవిత చిత్రం ఇది.


తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఢమరుక ధ్వని, కంగుమనే బుడబుక్కల వారి స్వరం వింటూ పల్లెలు నిద్రలేచేవి. ఉదయాన్నే గంటానాదం చేస్తూ బాలసంతులు సందడి చేసేవారు. తమలపాకులు పండించే అగరులు, మాంసం విక్రయించే ఆరెకటిక వారు, గ్రామం నడిబొడ్డున విన్యాసాలు చేస్తూ జీవించే దొమ్మరి, వసా్త్రలకు రంగుల అద్దే భవసార క్షత్రియులు, గానుగ ఆడించే గాండ్ల వారు... ఇలాంటి శతాధిక వృత్తుల, వర్ణాల సమాహారం తెలుగు సమాజం. కాలక్రమంలో అనేక వృత్తులు కనుమరుగవుతున్నాయి. కొన్ని కులాల ఉనికి కూడా ఇప్పుడు లేదు. ఆర్థిక పరిపుష్టి శూన్యం. విద్య అంత కు మించి లేదు. రాజకీయాధికారం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది!!బుడబుక్కల
సంప్రదాయ వృత్తి: వీరి ప్రధాన వృత్తి భిక్షాటన. తెల్లవారుజామునే ఢమరుకనాదంతో ఊరిని మేలుకొలిపేవారు. వరికోతల సమయంలో గ్రామాల్లో ప్రత్యక్షమై రైతుల నుంచి ధాన్యం దానంగా స్వీకరించేవారు.

జనాభా: సుమారు 10 లక్షలు. అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, ప్రజ్ఞాపూర్‌లో వీరి సంఖ్య అధికం.

ప్రస్తుత పరిస్థితి: సంచారం చేస్తూ, భిక్షాటనపై జీవించే వీరిలో అక్షరాస్యత తక్కువ. గ్రామాల్లో వీరికి ప్రస్తుతం ఆదరణ కరువైంది. అక్షరాస్యత లేక, వేరే జీవనోపాధి లేక కూలీలుగా మారారు.
 
బాలసంతు
సంప్రదాయ వృత్తి: తెల్లవారుజామున గంటానాదం చేస్తూ భిక్షాటన చేసేవారు. చిన్న జంతువులను వేటాడుతూ జీవించేవారు. వీరిని బాలసంతు, బహురూపి అని కూడా పిలుస్తారు.

జనాభా: సుమారు 50 వేలు

ప్రస్తుత పరిస్థితి: వేట చట్టవ్యతిరేకం కావడం, దానధర్మాలు తగ్గడంతో వీరికి ఆదరణ తగ్గింది. ఈ కులానికి చెందిన మహిళలు ప్లాస్టిక్‌ సామానులు, వంటపాత్రలు అమ్ముతూ జీవిస్తున్నారు. అక్షరాస్యత చాలా తక్కువ.
 
ఆరెకటిక 
సంప్రదాయ వృత్తి: గొర్రె, మేక మాంసం విక్రయం. ఎక్కడైనా నేరాలు జరిగితే ఈ కులంలోని యువకులను తీసుకెళ్లి విచారించడంతో తరచూ బాధితులయ్యేవారు. కల్లు దుకాణాల బయట బోటీ, ఇతర మాంసం పదార్థాలను విక్రయించడం ద్వారా పొట్టపోసుకునేవారు.

జనాభా: తెలంగాణ, ఆంధ్రప్రదేశలోని అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్న వీరి జనాభా సుమారు 30 లక్షలు. హైదరాబాద్‌లోనే 2 లక్షల మంది దాకా ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితి: హైదరాబాద్‌లో కల్లు దుకాణాల మూసివేతతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశతో పాటు పలు రాష్ట్రాల్లో వీరిని ఎస్సీల జాబితాలో చేర్చారు. తె లుగు రాష్ట్రాల్లో బీసీ-డీలోనే ఉండిపోయారు.
 
అగరు
సంప్రదాయ వృత్తి: తమలపాకులు సాగు చేసి, కావిళ్లలో పెట్టుకుని విక్రయిస్తూ జీవనం సాగించేవారు.

జనాభా: శ్రీకాకుళం జిల్లాలోని 19 గ్రామాలకు మాత్రమే పరిమితమైన వీరి జనాభా సుమారు 6 వేలు.

ప్రస్తుత పరిస్థితి: దేశీ తమలపాకు సాగుకు కట్టుబడి ఉండటంతో వీరి ఆదాయాలు బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా పలు కుటుంబాలు ఉపాధి కోసం విశాఖ, హైదరాబాద్‌ వెళ్లి కూలీపనులు చేసుకుంటున్నారు.
 
గాండ్ల 
సంప్రదాయ వృత్తి: గానుగ ఆడించి నూనె తీసి ప్రజలకు విక్రయించేవారు. గానుగ ఆడించే వారు కనుక వీరి కులం పేరు గాండ్లగా స్థిరపడింది. తెలంగాణ, రాయలసీమలో వీరిని గాండ్ల అని పిలిస్తే, కోస్తాంధ్రలో వీరిని తెలికల అని పిలుస్తారు. కాపు తెలికల, తెలగ తెలికల, దేవ తెలికల, దేవగాండ్ల, సజ్జనపు గాండ్ల అని కూడా వీరిని వ్యవహరిస్త్తున్నారు.

జనాభా: 20లక్షలు. చిత్తూరు జిల్లాలోనే సుమారు 3.5 లక్షల మంది ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితి: గానుగల ఆయిల్‌ ఎక్స్‌పెల్లర్లు రావడంతో వీరి జీవనాధారం దెబ్బతిన్నది. పాడిని నమ్ముకుని ఈ కులంలోని అధికశాతం కుటుంబాలు జీవిస్తున్నాయి. అధిక శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఈ కులంలో అక్షరాస్యుల సంఖ్య 3 శాతమే.
 
భవసార క్షత్రియులు 
సంప్రదాయ వృత్తి: వస్త్రాలకు రంగులు అద్దేవారు. సహజ పద్ధతుల్లో సొంతంగా రంగులు తయారు చేసుకునేవారు. టైలరింగ్‌ చేసేవారు.

జనాభా: రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో సుమారు 13 లక్షలు

ప్రస్తుత పరిస్థితి: రంగుల అద్దకం, టైలరింగ్‌ రెండూ యంత్రాలతో చేస్తుండటంతో వీరి ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. వీరిలో 70 శాతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.
 
చాత్తాద శ్రీవైష్ణవులు 
సంప్రదాయ వృత్తి: బ్రాహ్మణకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి, సిగను, జంధ్యాన్ని వదిలేసి ఆత్మగౌరవపోరాటం చేసిన వీరిని సాతాని పంతులు అని కూడా పిలుస్తారు. తెలుగురాషా్ట్రల్లో అన్ని జిల్లాల్లో ఉన్న వీరు అర్చకులు, పురోహితులు, హరిదాసులు, ఆయుర్వేద, మూలికా వైద్యులుగా ఉండేవారు.

జనాభా: సుమారు 7 లక్షలు.

ప్రస్తుత పరిస్థితి: జిల్లాల్లో పరిస్థితులను బట్టి వీరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అర్చకత్వంతో పాటు పౌరోహిత్యం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హరిదాసులుగా, నిజామాబాద్‌ , వరంగల్‌ జిల్లాల్లో అద్దకం పని, ఖమ్మం జిల్లాలో అడ్డాకులు సేకరించి విస్తళ్లు కుట్టడం వంటి వృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరిలో 90 శాతం నిరుపేదలు.
 
దాసరి 
సంప్రదాయ వృత్తి: నుదుటన నామం, నెత్తిన కలశం, చేతిలో చిడతలతో గ్రామాల్లో సంకీర్తనలు చేస్తూ జీవనోపాధి పొందేవారు. తెలంగాణలో దాసరి కులస్తులు యాచకవృత్తితో పాటు భాగవతాలు ఆడేవారు.

జనాభా: సుమారు లక్ష మంది.

ప్రస్తుత పరిస్థితి: సంచార జాతి కావడంతో వీరి పిల్లలకు చదువుకునే అవకాశాలు లేవు. దీంతో వీరు పేదరికం అనుభవిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి వీరి జీవనాధారం మారింది. కొన్ని జిల్లాల్లో వీళ్లు రాళ్లు కొట్టి జీవిస్తుండగా మరికొన్ని జిల్లాల్లో చెత్త ఏరుకుని జీవిస్తున్నారు.
 
దొమ్మర 
సంప్రదాయ వృత్తి: నిత్య సంచారులు. ఊరి బయట గుడిసెలు వేసుకుని, ఊళ్లో ప్రధాన కూడళ్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. దొమ్మరి ఆటగా పిలిచే వీరి ప్రదర్శనలు పూర్వం ప్రజలను అబ్బురపరచేవి.

జనాభా: సుమారు 3 లక్షల మంది

ప్రస్తుత పరిస్థితి: కులవృత్తికి ఆదరణ తగ్గడంతో చాలా కుటుంబాలు ఈతాకు చాపలు అల్లుకుంటూ జీవిస్తున్నాయి. చాపలకూ ఆదరణ తగ్గడంతో కొందరు పందులు, మేకలు పెంచుకుంటున్నారు. మరి కొందరు చిరువ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు.

దేవాంగులు 
సంప్రదాయ వృత్తి: చేనేత ఆధారంగా జీవించేవారు.

జనాభా: సుమారు 5 లక్షలు తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితి: పవర్‌లూమ్స్‌ రావడంతో వీరి జీవితాలు దుర్భరంగా మారాయి. నేత దుస్తులకు ఆదరణ తగ్గడం, వస్త్ర బేనర్ల స్థానాన్ని సైతం ఫెక్ల్సీలు ఆక్రమించడంతో వీరి ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
 
దూదేకులు 
సంప్రదాయ వృత్తి: వీరిని నూర్‌బాషాలుగా పిలుస్తారు. కంజరతో పత్తిని ఏకి క్షణాల్లో పరుపులు, దిండ్లు తయారు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో మంగళవాద్యాలు వాయిస్తారు. ఆధా ముస్లిం అని కూడా పేరున్న వీరిని అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా దూరంగా పెట్టడంతో వీరి పరిస్థితి రెంటికీ చెడిన రేవడి చందమైంది.

జనాభా: సుమారు 40 లక్షలు

ప్రస్తుత పరిస్థితి: జిన్నింగ్‌ మిల్లులు రావడం, దిండ్లు, పరుపుల రంగంలోకి బడా కంపెనీలు ప్రవేశించడంతో వీరు వీధిన పడ్డారు. అధిక శాతం విద్యావంతులైనా లక్షలాది మంది పేదరికంలో మగ్గుతున్నారు.
 
రజకులు 
సంప్రదాయ వృత్తి: బట్టలు ఉతికి, వాటి ని ఇసీ్త్ర చేసి ఇచ్చేవారు. ప్రజలందరికీ తలలో నాలుకలా ఉండేవారు.

జనాభా: సుమారు 30 లక్షలు

ప్రస్తుత పరిస్థితి: కులవృత్తికి ఆదరణ లేకపోవడంతో 10 లక్షల మంది వరకు పట్టణాలకు చేరి కూలీనాలీ చేసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌లలో వాచ్‌మెన్లగా  ఉంటూ బట్టలు ఇస్త్రీ చేస్తూ బొటాబొటీ జీవితాలు గడుపుతున్నారు. గ్రామాల్లో కులవృత్తుల్లో ఉన్న వారు తీవ్ర వివక్షకు గురవుతున్నారు.
 
గంగపుత్రులు 
సంప్రదాయ వృత్తి: చేపలు పట్టి, వాటిని విక్రయించి జీవించేవారు. గంగపుత్రుల్లో అగ్నికుల క్షత్రియ, బెస్త, పల్లి, ఓడబలిజ, జాలరి, గంగావార్లు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, బోయ, నెయ్యల, పట్టపు కాపు తదితర 13 ఉపకులాలున్నాయి.

జనాభా: సుమారు 75 లక్షలు

ప్రస్తుత పరిస్థితి: నాటు పడవల స్థానంలో మరపడవలు వచ్చాయి. ఉపాధి అవకాశాలు తగ్గాయి. కొత్తతరం వారు నిరక్షరాస్యులుగా మిగిలారు. దీంతో వీరి ఆర్థిక స్థితి దుర్భరంగా తయారైంది.


బోయ
సంప్రదాయ వృత్తి: పెత్తందార్లు, రాజులకు పల్లకీలు మోసేవారు. కాలక్రమంలో వారి ఇళ్లలో కావళ్లతో నీరు మోసేవారు. ఆ తరువాత ఇంటి పనులు చేస్తూ జీవించారు. వేటాడటంలో సిద్ధహస్తులు. తెలంగాణలో వాల్మీకి కులస్తులుగా, రాయలసీమలో బోయలుగా పిలుస్తారు. వాల్మీకిబోయ, తలయారి, బోయబేదార్‌, నిషాది, పెద్దబోయ, చుడువాళ్లు, యల్లాపు తదితర తెగలు ఈ కులంలోనివే. కొన్ని ప్రాంతాల వారిని ఎస్టీల్లో చేర్చగా మిగిలిన వారు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

జనాభా: సుమారు 80 లక్షలు

ప్రస్తుత పరిస్థితి: స్వామిభక్తికి పెట్టింది పేరయిన బోయల్లో లక్షలాది మంది యజమాని తప్పులను నెత్తిన వేసుకుని ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారని చెబుతారు. ఉపాధి అవకాశాలు లేక, విద్య లేక వీరు కావలి వాళ్లుగా, భవననిర్మాణ కార్మికులుగా జీవిస్తున్నారు.
 
భట్రాజులు 
సంప్రదాయ వృత్తి: పూర్వం పెళ్లిళ్లు, శుభకార్యం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేవారు. ఎదుటి వారికి పొగిడి వారిచ్చే బహుమతులతో జీవించేవారు. మొదట సంచార జీవితం సాగించే వీరు క్రమంగా స్థిరనివాసం ఏర్పరచుకుని, చదువుకున్నారు. పది మందికీ విద్య బోధిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.

జనాభా: సుమారు 22 లక్షలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో భట్టువారిపాలెం, భట్టుగూడెం పేర్లతో గ్రామాలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో వీరి ఉనికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత పరిస్థితి: ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఈ కులానికి చెందిన యువత పైచదువులు చదువుకోలేకపోతున్నారు.


- స్పెషల్‌ డెస్క్‌