Feb 7 2017 @ 01:43AM

రాచర్ల సామ్రాజ్యం కన్నుమూత

విశాఖపట్నం: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, గోరా చివరి సోదరి రాచర్ల సామ్రాజ్యం(98) సోమవారం విశాఖలో కన్నుమూశారు. సోమవారం ఉదయం తన పనులు తానే చేసుకున్న ఆమె, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయాసంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. దేశభక్తుడు గోపరాజు వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919 ఏప్రిల్‌ 26న రాజమండ్రిలో సామ్రాజ్యం జన్మించారు. కాకినాడ సమీపంలోని రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావుతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు. కుమారుడు పుట్టిన మూడేళ్లకు(1937) భర్త మృతిచెందారు. కుమారుడికి ఐదేళ్ల వయసు వచ్చాక కన్నవారింటిలో ఉంచి ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో ఆమెను విజయవాడలో అరెస్టు చేసి రాయవెల్లూరు జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చాక గాంధీ ఆశ్రమం సేవాగ్రామ్‌లో శిక్షణ పొందారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలో 1980 వరకు పనిచేశారు. 1972లో కేంద్రం నుంచి తామ్రపత్రం అందుకున్నారు. సామ్రాజ్యం చివరి వరకు బాపూజీ ఆశయాలను అనుసరించారు. మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.